Telugu Global
National

గుజరాత్ బాట పట్టిన 80వేల కోట్లు.. బీజేపీ ఎన్నికల స్టంట్..

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే మోదీ, అమిత్ షా కి వ్యక్తిగతంగా చాలా పెద్ద డ్యామేజీ జరుగుతుంది. అందుకే ఆ ఇద్దరూ గుజరాత్ ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఎన్నికల వేళ నిధుల వరద పారిస్తున్నారు.

గుజరాత్ బాట పట్టిన 80వేల కోట్లు.. బీజేపీ ఎన్నికల స్టంట్..
X

ఆమధ్య ఉత్తర ప్రదేశ్ ఎన్నికల వేళ.. యూపీకి లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లను కేటాయించింది కేంద్రం. ఎన్నికలకు 6నెలల గడువు ఉండగా 8సార్లు ప్రధాని మోదీ అధికారిక పర్యటనలకు వెళ్లొచ్చారు. లక్షకోట్లు కేటాయించినా, ఆ ప్రాజెక్ట్ లు ఎప్పటికి పూర్తవుతాయనేది మాత్రం అంతుచిక్కని ప్రశ్నే. అప్పటికప్పుడు పబ్బం గడుపుకోవ‌డానికి మోదీ వేసిన గేమ్ ప్లాన్ అది. సరిగ్గా గుజరాత్ ఎన్నికల వేళ.. అదే వ్యూహంతో బీజేపీ సిద్ధమైంది. ఇక్కడ 80వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లను తెరపైకి తెచ్చింది.

ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో గుజరాత్ కి మోదీ 80వేల కోట్ల రూపాయల పథకాలు ప్రకటించారు. ఏప్రిల్ 20న 22వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేశారు. జూన్ 10న మరోసారి గుజరాత్ వచ్చిన ఆయన 12 ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనలు, మరో 14 ప్రాజెక్ట్ లకు భూమిపూజ చేశారు. సాగునీటి పారుదలకోసం నవ్ సారి లో 3వేల కోట్ల రూపాయలతో 7 ప్రాజెక్ట్ లను ప్రారంభించారు.

జూలై 15న గాంధీ నగర్ రైల్వే స్టేషన్లో 790 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అదే నెలలో 28వ తేదీ కూడా గుజరాత్ వచ్చి సబర్ కాంత జిల్లాలో వెయ్యికోట్లతో ప్రాజెక్ట్ లకు ప్రారంభోత్సవాలు చేశారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో కూడా మోదీ గుజరాత్ వచ్చారు. సెప్టెంబర్ 29న చివరిసారిగా రాష్ట్రానికి వచ్చిన మోదీ 29వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేశారు. హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చేసిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వీటికి అదనం. అంటే ఎన్నికలొస్తున్నాయనే సరికి 80వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లు ఎగురుకుంటూ గుజరాత్ కి వచ్చేశాయి.

ఆమ్ ఆద్మీతో భయం..

గుజరాత్ లో బీజేపీ విజయం నల్లేరుపై నడక అనుకునేవారు గతంలో. 27ఏళ్లుగా అక్కడ బీజేపీయే అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు ఆ పార్టీకి ఆమ్ ఆద్మీ భయం పట్టుకుంది. ఉచిత కరెంటు హామీతో గుజరాత్ లో ఇప్పటికే కేజ్రీవాల్ కలకలం సృష్టించారు. పంజాబ్ లాగే గుజరాత్ లో కూడా పాగా వేయాలని చూస్తున్నారు. దీంతో బీజేపీకి భయం పట్టుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీని ఇరుకున పెట్టేందుకు ఢిల్లీలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ అస్త్రాన్ని ప్రయోగించింది. ఇటు గుజరాత్ లో ప్రజల్ని పెట్టుబడులతో బుజ్జగించే పనిలో పడింది.

ఇంకా ఆరోపణలేనా..?

గుజరాత్ లో అధికార బీజేపీపై అసంతృప్తి ఓ రేంజ్ లో ఉంది. దీన్ని తప్పించుకోవాలంటే ఆత్మస్తుతి పరనింద అవసరం. పాతికేళ్లకు పైగా గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పై మండిపడుతోంది. కాంగ్రెస్ వల్లే గుజరాత్ అభివృద్ధి వెనకపడిందని అంటోంది. కాంగ్రెస్ కూడా బీజేపీకి దీటుగా బదులిస్తోంది. నర్మదా ప్రాజెక్ట్ కంటే ప్రతిష్టాత్మకమైన కల్పసర్ యోజనపై పదేళ్ల క్రితం బీజేపీ హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకూ పనులు మొదలు కాలేదంటున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శక్తి సిన్హ్ గోయల్. షిప్ యార్డ్ కూడా కలగానే మిగిలిపోయిందని, మహువా ఓడరేవు పనులు ముందుకు కదలడంలేదని, భావ్ నగర్ ను నేషనల్ ప్లాస్టిక్ పార్క్ గా మారుస్తామన్న వాగ్దానం కూడా అలాగే ఉండిపోయిందని విమర్శించారు.

మొత్తమ్మీద బీజేపీ అక్కడ తీవ్ర ఇబ్బంది పడుతోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ రెండు వైపులా బీజేపీని ఇరుకున పెడుతున్నాయి. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే మోదీ, అమిత్ షా కి వ్యక్తిగతంగా చాలా పెద్ద డ్యామేజీ జరుగుతుంది. అందుకే ఆ ఇద్దరూ గుజరాత్ ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఎన్నికల వేళ నిధుల వరద పారిస్తున్నారు.

First Published:  9 Oct 2022 8:01 AM GMT
Next Story