Telugu Global
National

కాషాయదళం చేతికి మరో కాంట్రవర్సీ

పఠాన్ మూవీలో దీపికా డ్రెస్సింగ్ బీజేపీ వాళ్లకు, కాషాయదళానికి కోపం తెప్పించింది. అందులో దీపికా పదుకొనే కాషాయ వస్త్రంతో బికినీలో కనిపించడం వారికి నచ్చలేదట. దీంతో దీపికను టార్గెట్ చేశారు.

కాషాయదళం చేతికి మరో కాంట్రవర్సీ
X

బాలీవుడ్ అగ్రనటుడు షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన పఠాన్ సినిమాకు సంబంధించిన ఓ పాట ఇటీవల విడుదలైంది. ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ పాటలో దీపికా బికినీ ధరించి అంగంగా ప్రదర్శన చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని నెటిజన్లు ట్విట్టర్ లో ఓ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పఠాన్ మూవీలో దీపికా డ్రెస్సింగ్ బీజేపీ వాళ్లకు, కాషాయదళానికి కోపం తెప్పించింది. అందులో దీపికా పదుకొనే కాషాయ వస్త్రంతో బికినీలో కనిపించడం వారికి నచ్చలేదట. దీంతో దీపికను టార్గెట్ చేశారు. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మరింత రెచ్చిపోయారు. సినిమాలోంచి ఈ పాటను తొలగించకపోతే .. తమ రాష్ట్రంలో ఈ సినిమాను విడుదల చేయడంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

గతంలో ఢిల్లీ జేఎన్‌యూలో జరిగిన ఘటనలో దీపికా.. తుక్డే తుక్డే గ్యాంగ్ కు మద్దతు ఇచ్చిందని కూడా ఆయన గుర్తుచేశారు. కాగా బీజేపీ మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి. సినిమాల్లోనూ బీజేపీ వాళ్ల పెత్తనం, ఇన్వాల్వ్ మెంట్ ఏమిటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల బీజేపీ ఐటీవింగ్ మరింత రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారి సినిమాలను విడుదల అయినప్పుడు వాటిని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలియక హీరోలు ఆపసోపాలు పడుతున్నారు. అయితే సినిమాల మీద కూడా తమ సంప్రదాయాలను రుద్దడం సరికాదన్నది కొందరి వాదన. మరి దీపికా పాట వ్యవహారం ఎంత దూరం వెళుతుందో వేచి చూడాలి.

First Published:  14 Dec 2022 3:10 PM GMT
Next Story