Telugu Global
National

బీజేపీ టార్గెట్ @ 170..సాధ్యమేనా?

రాబోయే ఎన్నికల్లో సౌత్ జోన్‌లో బీజేపీ 170 ఎంపీ స్థానాల్లో గెలవాలని నడ్డా టార్గెట్ ఫిక్స్ చేశారు. సౌత్ జోనంటే దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గోవా, అండమాన్ నికోబార్ ఉన్నాయి. ఇక్కడే నడ్డా టార్గెట్‌పై అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి.

బీజేపీ టార్గెట్ @ 170..సాధ్యమేనా?
X

రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బీజేపీ చాలా పెద్ద టార్గెట్‌నే ఫిక్స్ చేసుకుంది. నిజానికి పెట్టుకునే టార్గెట్ రీచ్ అయ్యేలా ఉండాలి. అంతేకానీ మోయలేని భారమని అనిపించకూడదు. నిజంగానే భారాన్ని మోయలేమని ముందే అనిపిస్తే ఇక భారాన్ని మోయటానికి కూడా మానసికంగా ఎవరు సిద్ధంగా ఉండరు. ఇప్పుడు జరిగింది ఇదే. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సుదీర్ఘమైన సమావేశం జరిగింది.

ఈ మీటింగ్‌లో రాబోయే ఎన్నికల్లో సౌత్ జోన్‌లో బీజేపీ 170 ఎంపీ స్థానాల్లో గెలవాలని నడ్డా టార్గెట్ ఫిక్స్ చేశారు. సౌత్ జోనంటే దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గోవా, అండమాన్ నికోబార్ ఉన్నాయి. ఇక్కడే నడ్డా టార్గెట్‌పై అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. సౌత్ జోన్ మీద ఎందుకింత దృష్టిపెడుతున్నట్లు? ఎందుకంటే ఉత్తరాధిలో పార్టీకి ఇబ్బందులు మొదలైనట్లున్నాయి. గతంలో సాధించినన్ని సీట్లను రాబోయే ఎన్నికల్లో సాధించటం కష్టమని నరేంద్ర మోడీకి అనిపించి ఉంటుంది. అందుకనే సౌత్ జోన్ పైన దృష్టి పెట్టింది.

నడ్డా పెట్టిన టార్గెట్ ఎందుకు మోయలేని భారమని అంటున్నదంటే ఇప్పుడు కర్నాటక, తెలంగాణలో తప్ప సౌతిండియాలో బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా లేదు. కర్నాటకలో 25, తెలంగాణలో నాలుగు మాత్రమే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ 29 సీట్లు వచ్చేది డౌటే. పైగా తమిళనాడు, ఏపీ, కేరళలో ఎంపీ సీట్లు గెలుస్తుందనే ఆశ కూడా పెట్టుకోనక్కర్లేదు. అంటే గెలిచే సీట్లకు మహారాష్ట్రలో మాత్రమే ఛాన్స్ ఉంది.

ఇక్కడ కూడా 48కి 48 గెలిచే ఛాన్స్ లేదు. మరి ఏ లెక్కలో నడ్డా 170 సీట్ల టార్గెట్ ఫిక్స్ చేశారో అర్థంకావటంలేదు. ఇక్కడే బీజేపీలోని భయం అర్థ‌మైపోతోంది. కొన్ని సర్వే సంస్థ‌లు రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని చెబుతున్నా సీట్ల విషయంలోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సంపూర్ణ మెజారిటీతో బీజేపీ సీట్లు గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నా నమ్మేట్లుగా లేదు. ఇప్పుడు సౌత్ జోన్ విషయంలో నడ్డా విధించిన టార్గెట్‌తో ఈ విషయం అర్థ‌మైపోతోంది.

First Published:  10 July 2023 4:52 AM GMT
Next Story