Telugu Global
National

ఐటీ వాహనాలకు బీజేపీ స్టిక్కర్లు.. జార్ఖండ్ లో రాజకీయ రచ్చ

బెర్మో నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైమంగల్ ఇంటిలో సోదాలు చేసేందుకు వచ్చిన ఐటీ అధికారులు బీజేపీ స్టిక్కర్ ఉన్న కారుని ఉపయోగించారు. దానిపై బీజేపీ అసెంబ్లీ పాస్ కనపడింది.

ఐటీ వాహనాలకు బీజేపీ స్టిక్కర్లు.. జార్ఖండ్ లో రాజకీయ రచ్చ
X

ఆమధ్య బీజేపీకి ఓ విచిత్రమైన పేరు పెట్టారు తెలంగాణ మంత్రి కేటీఆర్. BJP అనే పేరు మధ్యలో IT, ED, CBI అనే అక్షరాలు కూడా యాడ్ చేసుకోవాలని BJ'IT-ED-CBI-'P అనే పేరు పెట్టుకోవాలని వ్యంగ్యంగా సూచించారు. విమర్శలు వస్తున్న కొత్తల్లో కనీసం బీజేపీ నేతలు కవర్ చేసుకోడానికి ప్రయత్నించేవారు. కానీ ఇప్పుడు అన్నీ వదిలేసినట్టు తెలిసిపోతోంది. సీబీఐ, ఐటీ, ఈడీ డిపార్ట్ మెంట్లను రాజకీయ కక్షసాధింపులకోసం వాడుకుంటామని బహిరంగంగానే వారు సంకేతాలిస్తున్నారు. ఇటీవల మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో కూడా ఆ పేర్లు వినబడటం వెనక కారణం అదే. తాజాగా జార్ఖండ్ లో ఎమ్మెల్యేల ఇళ్లలో జరిగిన ఐటీ దాడులకు అధికారులు బీజేపీ స్టిక్కర్లు ఉన్న కార్లలో రావడం విశేషం. ఈ స్టిక్కర్ వ్యవహారం కాస్తా మీడియాలో వైరల్ కావడంతో తీరిగ్గా నాలుక కరచుకున్నారు బీజేపీ నేతలు.

జార్ఖండ్ లో ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రదీప్ యాదవ్, కుమార్ జైమంగల్ ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. బెర్మో నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైమంగల్ ఇంటిలో సోదాలు చేసేందుకు వచ్చిన అధికారులు బీజేపీ స్టిక్కర్ ఉన్న కారుని ఉపయోగించారు. దానిపై బీజేపీ అసెంబ్లీ పాస్ కనపడింది. అంతలో మీడియా ఆ విషయం పసిగట్టి వీడియోలు తీసింది. ఐటీ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. ఆ తర్వాత ఆ స్టిక్కర్ తీసేశారు. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. బీజేపీ స్టిక్కర్లు ఉన్న కార్లలో ఐటీ అధికారులు తిరుగుతున్నారని ప్రచారం జరిగిపోయింది. అది బీజేపీ ప్రయోజిత కార్యక్రమం అని తేలిపోయింది.

ఇంత బరితెగించాలా..?

బీజేపీ ఆదేశాల ప్రకారమే ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు తెగబడతాయనే విషయం తెలిసిందే. కానీ మరీ ఇంత బరితెగించి బీజేపీ వారు ఇచ్చిన కార్లలో ఐటీ అధికారులు తిరగడమే ఇప్పుడు విచిత్రం. కాంగ్రెస్ తోపాటు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చాలనుకోవడం దారుణం అని అన్నారాయన. ప్రజలకు ఈ నిజానిజాలన్నీ తెలియాలని చెప్పారు. బీజేపీ దిగజారిపోయిందని, వారికి నైతికతే లేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా బీజేపీ నేతలు చెప్పినట్టల్లా ఆడటం మరింత దారుణం అని విమర్శించారు.

అబ్బెబ్బే అదేం లేదు..

ఇక బీజేపీ బుకాయింపు ఈ ఎపిసోడ్ కి హైలెట్. ఆ కార్లపై కావాలనే కాంగ్రెస్ నేతలు బీజేపీ స్టిక్కర్లు అంటించి ఉంటారని అంటున్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు దీపక్ ప్రకాష్. ఇది కాంగ్రెస్ కార్యకర్తల కుట్ర అని అభివర్ణించారు. అవి అద్దె వాహనాలని, అలాంటివాటిపై ఉన్న స్టిక్కర్లకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

First Published:  5 Nov 2022 4:36 AM GMT
Next Story