Telugu Global
National

ఆ ఎన్నికల్లో బీజేపీ ఎంత ఖర్చు చేసిందో తెలుసా ?

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి ఖర్చు చేసిన దాంట్లో సగం బీజేపీయే చేసింది. పార్టీలు ప్రకటించిన ఖర్చుల లెక్కలప్రకారం అన్ని పార్టీలు కలిపి 470 కోట్లు ఖర్చు చేశాయి.

ఆ ఎన్నికల్లో బీజేపీ ఎంత ఖర్చు చేసిందో తెలుసా ?
X

దేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా బీజేపీ పెట్టినంత ఖర్చు ఏ పార్టీ పెట్టలేకపోతోంది. నిధుల వసూళ్ళలో కూడా ఆ పార్టీతో ఏ పార్టీ కూడా పోటీ పడలేకపోతోంది. ఈ విషయంలో వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ కన్నా చాలా వెనకబడే ఉంది.

ఈ ఏడాది ఆర‍ంభంలో జరిగిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికలలో ఖర్చు విషయంలో బీజెపికీ దగ్గర్లోకి కూడా ఏ పార్టీ రాలేకపోయింది. అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ (ADR) అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఐదు రాష్ట్రాల్లో లీగల్ గా అన్ని పార్టీలు చేసిన మొత్తం ఖర్చు 470.101 కోట్ల రూపాయలు కాగా అందులో 47.47% శాతం అంటే 223.148 కోట్ల రూపాయలను బీజేపీ ఒక్కటే ఖర్చు చేసింది. ఇదే సమయంలో బీజేపీ సేకరించిన నిధులు 914.03 కోట్ల రూపాయలు.

13 రాజకీయ పార్టీలు సేకరించిన మొత్తం నిధులు రూ. 1441.797 కోట్లు కాగా, ఖర్చు చేసిన మొత్తం రూ. 470.101 కోట్లు అని నివేదిక పేర్కొంది.

ఇక రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ 102.65 కోట్ల రూపాయలు,తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ 68.646 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ 240.105 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

రాజకీయ పార్టీలు తమ ఖర్చులను ప్రచారం, ప్రయాణ ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు, పోటీలో ఉన్న అభ్యర్థులకు చెల్లించిన మొత్తం, అభ్యర్థి(ల) నేర పూర్వాపరాలను ప్రచురించడానికి ఖర్చు చేసిన మొత్తం. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా, వర్చువల్ ప్రచారం కోసం చేసిన ఖర్చులను ప్రకటిస్తాయి.

ఇలా రాజకీయ పార్టీలు ప్రకటించిన మొత్తం వ్యయంలో ప్రచార ఖర్చు 33.93% కాగా ఇతరాలపై ఖర్చు 8.27%.

అయితే ఇది లీగల్ గా పార్టీలు బైటికి చెప్పే ఖర్చు మాత్రమే. పంపకాలు, ఇతరత్రా చట్ట విరుద్దంగా చేసిన ఖర్చును ఏ పార్టీ కూడా చెప్పుకోదు. నిజానికి ఈ ప్రకటించిన ఖ‌ర్చుకన్నా అప్రకటిత ఖర్చే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా చూసినప్పుడు బీజేపీ ఎంత ఖర్చు పెట్టి ఉంటుందో ఊహించుకోవచ్చు.

First Published:  20 Oct 2022 8:03 AM GMT
Next Story