Telugu Global
National

బెంగుళూరు నీట మునిగిపోతూ ఉంటే స్థానిక బీజేపీ 'నీరో' హోటల్ లో ఎంజాయ్ చేస్తున్నాడు!

బె‍ంగుళూరులో వరదలతో ప్రజలు అష్టకష్టాలు పడుతూ ఉంటే స్థానిక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఓ హోటల్ లో దోశ తింటూ అది ఎంత గొప్పగుందో వివరిస్తూ, ఆ హోటల్ కు వ‌చ్చి రుచి చూడాలని ప్రజలందరికీ సూచించడం వివాదాస్పదమయ్యింది. వరద‌ల గురించి పట్టించుకోని తేజస్వీ, ఈ సమయంలో హోటల్ ను ప్రమోట్ చేయడమేంటని విమర్శ‌లు వస్తున్నాయి.

బెంగుళూరు నీట మునిగిపోతూ ఉంటే స్థానిక బీజేపీ నీరో  హోటల్ లో ఎంజాయ్ చేస్తున్నాడు!
X

నాలుగు రోజులుగా వర్షాలు వరదలతో బెంగుళూరు నగరం అతలాకుతలం అయిపోతోంది. జ‌న జీవనం అస్తవ్యస్తమయ్యింది. కాలనీలు, బస్తీలు నీట మునిగిపోయాయి. ప్రజలు తాగడానికి కూడా నీళ్ళు లేక కటకటలాడుతున్నారు. అనేక చోట్ల పవర్ సప్లై లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎంపీ, అందులోనూ అధికార పార్టీ ఎంపీ చేయాల్సింది ఏంటి ? కష్టాల నుంచి ప్రజలను ఆదుకోవడానికి ఏర్పాట్లు చేయడం. నియోజక వర్గంలో పర్యటించడం...ఇది కదా చేయాల్సింది.

ఊ ..అంటే విపక్షాలు పాలించే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ప్రభుత్వాల మీద రెచ్చగొట్టే మాటలు మాట్లాడటంలో, మత వివాదాలు రెచ్చగొట్టడంలో ధిట్ట అయిన బెంగళూరు సౌత్ లోక్‌సభ సభ్యుడు తేజస్వి సూర్య వరదల సమయంలో తన నియోజక వర్గంలోని ఓ హోటల్ లో ఉప్మా దోశ తింటూ అది ఎంత గొప్పగా ఉందో చెప్తూ వీడియో తీసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఆయన దోశ తింటూ... ఈ హోటల్ లో బట్టర్ మసాలా దోశ 'ఉప్పిట్టు' (ఉప్మా) చాలా రుచిగా ఉంది. నాణ్యత కూడా చాలా బాగుంది. మీరు కూడా ఈ హోటల్ కువచ్చి రుచి చూడండి'' అంటూ ప్రజలకు సూచించాడు.

ఈ వీడియోను చూసిన నెటిజనులు తేజస్వి సూర్యపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ లావణ్య బల్లాల్ మాట్లాడుతూ, ఈ వీడియో సెప్టెంబర్ 5 నాటిదని, ఆ సమయంలో నగరంలోని చాలా ప్రాంతాలు వరదలకు గురయ్యాయని చెప్పారు.

"ఇది సెప్టెంబర్ 5 నాటి వీడియో. ఒక వైపు బెంగుళూరు మునిగిపోతున్నప్పుడు తేజస్వి సూర్య దోశ తింటూ ఎంజాయ్ చేశారు. కనీసం ఒక్క వరద ప్రభావిత ప్రాంతాన్ని అయినా సందర్శించారా?" అని బల్లాల్ ట్వీట్ చేశారు.


నటి, మాజీ కాంగ్రెస్ ఎంపీ రమ్యతో సహా పలువురు ట్విట్టర్ వినియోగదారులు సూర్య వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసి కామెంట్లు కురిపించారు.

"ఫుడ్ బ్లాగర్ తేజస్వీ సూర్యగారూ, మీరు హోటళ్లను ప్రమోట్ చేయాలనుకుంటే, ORRలో కాఫీ కోసం కలుద్దాం.బెంగళూరు సౌత్‌కు చెందిన మీ ఓటర్లు అక్కడ కూడా పని చేస్తున్నారు" అని రమ్య ట్వీట్ చేశారు.

''రోమ్ తగలబడినప్పుడు, నీరో ఫిడేల్ వాయించినట్టు, బెంగళూరు మునిగిపోయినప్పుడు, తేజస్వి సూర్య దోశేలు తింటూ, ఓట్లేసిన‌ ప్రజలను ఎగతాళి చేశాడు! మీరు తదుపరి ఓటు వేసేటప్పుడు ఈ చిత్రాన్ని, అతని చిరునవ్వును గుర్తుంచుకోండి! ''అని ఆప్ నాయకుడు పృథ్వీ రెడ్డి అన్నారు.

"ఎంపీ పేరు: తేజస్వి సూర్య

నియోజకవర్గం: బెంగళూరు సౌత్

గత 3 రోజుల్లో కేజ్రీవాల్‌పై ట్వీట్లు: 240

రాహుల్ గాంధీపై ట్వీట్లు: 17

ఇందిరా గాంధీ, నెహ్రూపై ట్వీట్లు: 55

మోడీని ప్రశంసిస్తూ ట్వీట్లు : 137

బెంగళూరు వరదలపై ట్వీట్లు: 00" అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

కొందరు నెటిజనులు "సూర్య మిస్సింగ్" అంటూ పోస్ట్ చేశారు. "ఎలాంటి కారణాలు లేకుండానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వాలిపోయే తేజస్వీ, ఇప్పుడు తన సొంత రాష్ట్రం అత్యంత అధ్వాన్నమైన దశల్లోకి ఉన్నప్పుడు.. అతను కనిపించడం లేదు" అని పేర్కొన్నారు.

అనేక మంది నెటిజనులు సూర్య టార్గెట్ గా విమర్శలు గుప్పించినప్పటికీ బిజెపికి చెందిన మరో ఇద్దరు బెంగళూరు ఎంపీలు సదానంద గౌడ (ఉత్తర), పిసి మోహన్ (సెంట్రల్) లపై కూడా నెటిజన్ లు మండిపడ్డారు. బెంగళూరులో వర్షం బీభత్సం సృష్టిస్తూ ఉంటే ఆ ఎంపీలు ఏం చేస్తున్నట్టు ? అని ప్రశ్నించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేల మీద కూడా నెటిజనులు విరుచుకపడ్డారు. ..

Next Story