Telugu Global
National

లక్ష్మీ పూజతో డబ్బు వస్తుందా..? సరస్వతి పూజతోనే చదువొస్తుందా..?

సరస్వతి పూజ చేస్తే చదువొస్తుందని అంటారు. మరి సరస్వతిని అసలు దేవతగా గుర్తించని ముస్లింలు, సరస్వతి పూజ చేయనివారికి చదువు రాకుండా పోతుందా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్.

లక్ష్మీ పూజతో డబ్బు వస్తుందా..? సరస్వతి పూజతోనే చదువొస్తుందా..?
X

హిందూ దేవతలపై ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే బీజేపీ నుంచి వెంటనే కౌంటర్లు పడతాయి. కానీ ఆ విమర్శలు చేసింది సాక్షాత్తూ బీజేపీ ఎమ్మెల్యేనే అయితే కాషాయదళం ఏం చేస్తుంది..? ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉంది. అవును, బీహార్ బీజేపీ ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్ హిందూ దేవతల గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారినా బీజేపీ నుంచి రియాక్షన్ లేదు. అయితే కొంతమంది స్థానికులు మాత్రం భాగల్ పూర్‌లో ఆయన దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన ప్రదర్శన చేపట్టారు.

Advertisement

లలన్ పాశ్వాన్ ఏమన్నారు..?

సహజంగా నాస్తికవాదులు చేసే విమర్శలనే లలన్ పాశ్వాన్ కూడా తెరపైకి తెచ్చారు. కానీ ఆయన బీజేపీ ఎమ్మెల్యే కావడం, అందులోనూ ఆయన హిందూ దేవతల్ని విమర్శించడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. దీపావళి రోజున హిందువులు లక్ష్మీదేవిని పూజిస్తారు, లక్ష్మీదేవిని పూజిస్తేనే సంపద పెరుగుతుంది అనుకుంటే ముస్లింలలో కోటీశ్వరులు ఉండకూడదు కదా. ఇదే లాజిక్ తీశారు లలన్ పాశ్వాన్.

సరస్వతి పూజ చేయకపోతే చదువు రాదా.. ?

Advertisement

సరస్వతి పూజ చేస్తే చదువొస్తుందని అంటారు. మరి సరస్వతిని అస్సలు దేవతగా గుర్తించని ముస్లింలు, సరస్వతి పూజ చేయని ముస్లింలకు చదువు రాకుండా పోతుందా. వారిలో ఎవరూ ఐఏఎస్, ఐపీఎస్ కాకుండా పోతున్నారా అని ప్రశ్నించారు లలన్ పాశ్వాన్. హనుమంతుడి పూజ చేయని ముస్లింలు, క్రైస్తవులు బలహీనులుగా ఉంటారనుకోవడం భ్రమేనన్నారు. ఆత్మ, పరమాత్మ అనే భావన కేవలం ప్రజల విశ్వాసమని చెప్పారాయన. మనం నమ్మితే దేవుడు, లేకపోతే అది కేవలం రాతి బొమ్మ అన్నారు. ప్రతీ దాన్ని సైంటిఫిక్‌గా ఆలోచించాలని, గుడ్డిగా నమ్మడం మానేస్తే.. మేధో సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు పాశ్వాన్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సైంటిఫిక్ భావనతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినా, హిందూ దేవుళ్లపై చేసిన కామెంట్లు చాలామందికి నచ్చలేదు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. బీజేపీ ఈ విషయంలో స్పందించడానికి వెనకాడుతోంది.

Next Story