Telugu Global
National

సోనియాగాంధీ విష కన్య.. పాకిస్తాన్ ఏజెంట్.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

మహిళల పట్ల ప్రధానికి ఏమాత్రం గౌరవం ఉన్నా.. వెంటనే బసన గౌడను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. సోనియాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై క్షమాపణలు చెప్పాలన్నారు.

సోనియాగాంధీ విష కన్య.. పాకిస్తాన్ ఏజెంట్.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
X

కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. నాయకులు రాజకీయపరమైన విమర్శలు పక్కన పెట్టి వ్యక్తిగత దూషణల‌కు దిగుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీని విష సర్పంతో పోల్చారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో ఆ తర్వాత వివరణ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా బీజేపీ నాయకులు నోటికి పని చెబుతున్నారు. ఓ ఎమ్మెల్యే సోనియా గాంధీని విష కన్య అని పేర్కొనడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

శుక్రవారం యత్నాల్ లోని కొప్పల్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యే బసన గౌడ మాట్లాడుతూ.. ఒకప్పుడు మోడీకి వీసా ఇచ్చేందుకు అమెరికా తిరస్కరించిందని.. ఇప్పుడు అదే వ్యక్తిని ప్రపంచమంతా కొనియాడుతోందన్నారు. ప్రపంచ నేతలు ఆయనతో వేదిక పంచుకోవడానికి ఆహ్వానం పలికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారని చెప్పారు. అలాంటి వ్యక్తిని కొందరు విష సర్పంతో పోలుస్తున్నారని మండిపడ్డారు.

వాస్తవానికి సోనియా గాంధీ విషకన్య అని.. చైనా, పాకిస్తాన్ ఏజెంట్ గా ఆమె పనిచేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. బసన గౌడ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ విమర్శించారు. ప్రధాని మోడీ, సీఎం బసవరాజ్ బొమ్మై ఉసిగొల్పడంతోనే బసన గౌడ ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

మహిళల పట్ల ప్రధానికి ఏమాత్రం గౌరవం ఉన్నా.. వెంటనే బసన గౌడను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. సోనియాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై క్షమాపణలు చెప్పాలన్నారు. బసన గౌడ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ, అమిత్ షా ఏం సమాధానం చెబుతారని ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బాఘేల్ ప్రశ్నించారు.

First Published:  28 April 2023 3:17 PM GMT
Next Story