Telugu Global
National

డిసెంబర్‌లో దీదీ సర్కార్‌ను కూల్చేస్తామంటున్న బీజేపీ.. అక్కడ అంత అవకాశం ఉన్నదా?

పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ సర్కార్ త్వరలో కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ తర్వాత దీదీ సర్కార్ ఉండదంటూ అసన్‌సోల్ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ మంగళవారం మీడియా ముందు వ్యాఖ్యానించారు.

డిసెంబర్‌లో దీదీ సర్కార్‌ను కూల్చేస్తామంటున్న బీజేపీ.. అక్కడ అంత అవకాశం ఉన్నదా?
X

ఎన్నికల్లో అధికారం దక్కిందంటే ఓకే.. లేదంటే ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను కూల్చడం బీజేపీకి పరిపాటి అయిపోయింది. బీజేపీ నాయకులు ప్రతీ రాష్ట్రంలో 'మీ పార్టీలో కూడా శిండేలు ఉన్నారు' అంటూ వ్యాఖ్యానిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనేస్తాం అంటూ బాహాటంగానే మాట్లాడుతుండటంపై ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. ఇటీవల తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కుట్ర చేసి బీజేపీ అధినాయకత్వం బొక్కాబోర్ల పడింది. అయినా సరే వారి వైఖరిలో మాత్రం ఏ మాత్రం మార్పు రావడం లేదు.

తాజాగా పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ సర్కార్ త్వరలో కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ తర్వాత దీదీ సర్కార్ ఉండదంటూ అసన్‌సోల్ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ మంగళవారం మీడియా ముందు వ్యాఖ్యానించారు. దీదీ ఆట డిసెంబర్‌లో ఖతమ్ అవుతుంది. 30 మందికి పైగా టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో కాంటాక్ట్‌లో ఉన్నారని అగ్నిమిత్ర అన్నారు. మా వ్యూహమేంటో మేం ప్రకటించము. కానీ ఏదో ఒకటి మాత్రం జరిగి తీరుతుంది. డిసెంబర్‌లో పెద్ద ఆట ఉందని మా నాయకత్వం ఇప్పటికే పలు మార్లు చెప్పింది. అదే జరుగుతుందని అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి నెలకొన్నది. ఈ ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసింది. వారి వద్ద డబ్బులు లేవు. మరి వాళ్లు ఎలా పని చేస్తారు? ప్రభుత్వాన్ని నడుపుతున్న వారిలో సగానికి పైగా జైల్లో ఉన్నారు. త్వరలో మిగిలిన వాళ్లు కూడా వెళ్తారని అగ్నిమిత్ర అన్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేవారు. మమతి బెనర్జీని అరెస్టు చేస్తామని, 40 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చేస్తారని చెప్పారు. బీజేపీ నేత, సినీ నటుడు మిథున్ చక్రవర్తి కూడా దీదీ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. మీకు బ్రేకింగ్ న్యూస్ కావాలా? మాతో 38 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. ఇక మిగిలింది మీరే ఊహించుకోండని విలేకరుల భేటీలో చెప్పారు.

కాగా, బెంగాల్‌లో మమత బెనర్జీని కూల్చి అధికారంలోకి వచ్చేంత అవకాశం బీజేపీకి ఉందా అంటే లేదనే చెప్పాలి. మొదట్లో సీపీఎం పార్టీతో యుద్దమే చేసి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ.. కమ్యూనిస్టులకు బెంగాల్‌లో చోటే లేకుండా చేశారు. ఇక 2021లో జరిగిన ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది. అయితే గతంలో 3 సీట్లే ఉన్న బీజేపీ 70 సీట్లకు తన బలం పెంచుకున్నది. 294 సీట్లున్న బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీకి 220 మంది ఎమ్మెల్యేల తిరుగులేని బలం ఉన్నది. 30 నుంచి 40 మంది పోయినా అధికారం మాత్రం టీఎంసీకే ఉంటుంది. కానీ మమతను కాదని పార్టీని వీడేంత సాహసం టీఎంసీలో ఎవరూ చేయరని విశ్లేషకులు భావిస్తున్నారు.

2026 వరకు అధికారంలో ఉండే అవకాశం వదిలేసి.. బీజేపీతో జట్టుకట్టే ఆలోచన ఎవరికీ రాదని అంటున్నారు. మమత బెనర్జీని అరెస్టు చేసి, పార్టీని నిలువునా చీల్చితే తప్ప బీజేపీకి అక్కడ అధికారం దక్కే ఛాన్స్ లేదు. అయితే, ఒక జాతీయ పార్టీని చీల్చేంత సాహసం బీజేపీ చేస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ, ఎంతటికైనా దిగజారే బీజేపీ వంటి పార్టీ అంత పని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా బీజేపీ మాత్రం పార్టీలను చీల్చే పనిని మాత్రం వదలడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

First Published:  22 Nov 2022 12:45 PM GMT
Next Story