Telugu Global
National

మధ్యప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో బీజేపీకి చావుదెబ్బ

మధ్యప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ మీద‌ కాంగ్రెస్ పై చేయి సాధించింది. క్రమక్రమంగా అక్కడ కమలం వెనకబడి హస్తం పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.

మధ్యప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో బీజేపీకి చావుదెబ్బ
X

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అంటే ఇదే కాబోలు ! 'కాంగ్రెస్ ముక్త్' (కాంగ్రెస్ నుంచి విముక్తి') అని లోగడ నినాదాలు చేసిన బీజేపీ నేతలే నాలిక్కరుచుకుంటున్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఇదే జరుగుతోంది. స్థానిక ఎన్నికలు ఏ ముహుర్తాన వచ్చాయో గానీ.. పాలక బీజేపీకి చుక్కలు చూపుతున్నాయి. ఒకప్పుడు బీజేపీ కంచుకోటలుగా ఉన్న కార్పొరేషన్లన్నీ కాంగ్రెస్ కైవశమైపోతూ .. కమల వికాసం కాస్తా కకావికలమవుతోంది. ఉదాహరణకు 57 ఏళ్లలో మొదటిసారిగా గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ వశమై పోయింది. 28 వేల ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి శోభా శిఖర్ వార్... బీజేపీకి చెందిన సుమన్ శర్మను ఓడించారు. ఈ కార్పొరేషన్ లోని 66 వార్డులకు గాను బీజేపీ 34 మాత్రమే గెలిచింది. 25 వార్డులు కాంగ్రెస్ హస్తగతం కాగా మరో ఏడు వార్డుల్లో ఇతర అభ్యర్థులు విజయం సాధించారు. అంటే మొత్తం మీద బీజేపీకి ఎలా లేదన్నా నష్టమే ! ఈ లాస్ కి రెండు రోజులు ముందే మోరేనా మున్సిపల్ కార్పొరేషన్ ని కూడా హస్తం పార్టీ చేజిక్కించుకుంది. ఇక్కడ సైతం కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి శారదా సోలంకీ బీజేపీ అభ్యర్థి మీద 14 వేల ఓట్లకు పైగా తేడాతో విజయం సాధించారు. ఈ కార్పొరేషన్ లోని 47 వార్డులకు గాను కాంగ్రెస్ 19, బీజేపీ 15,బహుజన్ సమాజ్ పార్టీ 8 సీట్లను గెలుచుకున్నాయి. భిండ్ జిల్లాలో 2014 లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలిచిన మున్సిపాలిటీలను ఇప్పడు అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. భిండ్, లహర్, గోహద్ మున్సిపాలిటీల్లో ఇప్పుడు హస్తం జెండాలు ఎగురుతున్నాయి.

ఇంకా లిస్టు చాలానే ఉంది. జబల్పూర్, ఛింద్వారా, రేవా కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ ఖాతాలోకే ! ఉజ్జయిని, బుర్హంపూర్ కార్పొరేషన్లను బీజేపీ అతి కష్టం మీద నిలబెట్టుకుంది. కేవలం 542, 736 ఓట్ల తేడాతో ఇవి కమలనాథుల వశమయ్యాయి. గ్వాలియర్, చంబల్ లో కాంగ్రెస్ విజయం ఈ ప్రాంతానికి చెందిన బడా బీజేపీ నేతలను ఆశ్చర్య పరిచింది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా, వంటి ప్రముఖులంతా ఈ ప్రాంతం వారే ! ఇంతకీ ఈ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి దారి తీసిన పరిస్థితులను విశ్లేషించాల్సి ఉంది. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక వైఖరి మొదలైందని గ్వాలియర్ కి చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ దేవ్ షిర్మాలి అంటున్నారు. సింధియా బీజేపీకి షిఫ్ట్ అయ్యాక కాంగ్రెస్ లో ఉన్న ఫ్యాక్షనలిజం బీజేపీకి మారిందని, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు బలోపేతంగా మారుతూ వచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.

గ్వాలియర్ కార్పొరేషన్ ని ప్రతిష్టాత్మకంగా భావించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రులు తోమర్, సింధియా రోడ్ షోలతో బాటు ఎన్నికల ప్రచారాన్ని ఓ రేంజిలో నిర్వహించారు. తన దూరపు బంధువు, మాజీ మంత్రి అయిన మాయాసింగ్ కి గ్వాలియర్ మేయర్ టికెట్ కోసం సింధియా యత్నించారని, కానీ పార్టీ తోసిపుచ్చిందని తెలుస్తోంది. అయితే ఆయనను సంతృప్తిపరచేందుకు పార్టీ హైకమాండ్ ఆయన మద్దతుదారుల్లో చాలామందికి కార్పొరేటర్ టికెట్లను ఇచ్చింది. ఇటీవల కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం బీజేపీ ఓటమికి ఓ కారణమన్న అభిప్రాయం వినవచ్చింది. మొత్తానికి 2014 లో 16 మేయర్ పదవులను దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు ఐదింటిని కాంగ్రెస్ పార్టీకి వదులుకుంది. అలాగే ఒక స్థానాన్ని ఆప్ అభ్యర్థి కైవసం చేసుకోగా, కట్ని లో రెబెల్ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ఆప్, మజ్లీస్ పార్టీ కూడా ఈ స్థానిక ఎన్నికల్లో 'అరంగేట్రం' చేసి బీజేపీకి కలవరం కలిగిస్తున్నాయి. సింగ్రౌలీ మేయర్ సీటును ఆప్.. బీజేపీ నుంచి లాక్కోవడం విశేషం. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లీస్ పార్టీ ఏడు వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్, తదితరులు .. ఇక బీజేపీ హవాకు అడ్డుకట్ట వేయగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆ తరువాత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ ప్రభావాన్ని చూపుతాయని కాంగ్రెస్ ఆశిస్తోంది.
Next Story