Telugu Global
National

ముస్లిం యువకుడిపై ఫేక్ 'లవ్ జీహాదీ' కుట్ర... బైట‌పడ్డ బీజేపీ నాయకుల బండారం

లవ్ జీహాదీ పేరుతో ఎంత ద్వేషం రెచ్చగొడుతున్నారో చూస్తూనే ఉన్నాం. తమ‌ స్వార్ద ప్రయోజనాల కోసం లవ్ జీహాదీ అనే పదాన్ని ఉపయోగించుకుంటున్నాయి కొన్ని శక్తులు. ఓ ముస్లిం యువకుడితో ఉన్న ఆర్థికపరమైన విబేధాల వల్ల అతన్ని లవ్ జీహాదీ కేసులో ఇరికించాలని ఓ బీజేపీ నాయకుడు చేసిన కుట్ర‌ విఫలమై ఆయనే కటకటాల పాలవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

ముస్లిం యువకుడిపై ఫేక్ లవ్ జీహాదీ కుట్ర... బైట‌పడ్డ బీజేపీ నాయకుల బండారం
X

జూలై 15వ తేదీన ఉదయాన్నే ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లా దుండ్వారా పోలీస్ స్టేషన్ ముందు దాదాపు 200 మంది హిందూ సంఘాల కార్యకర్తలు గుమి కూడారు. వారికి బీజేపీ యూత్ వింగ్ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్ అమన్ చౌహాన్, అతని సహచరుడు ఆకాష్ సోలంకీలు నాయకత్వం వహించారు. లవ్ జీహాదీ కి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేశారు. రాధ అనే అమ్మాయికి న్యాయం చేయాలని ప్రిన్స్ ఖురేషీ అనే వ్యక్తిని శిక్షించాలని అక్కడ గుమిగూడిన గుంపు డిమాండ్ చేసింది.

అదే సమయంలో ఢిల్లీకి చెందిన రాధ అనే యువతి అమన్ చౌహాన్, ఆకాష్ సోలంకీలతో కలిసి పోలీసు స్టేషన్ లోకి వెళ్ళారు. ఆ యువతి ప్రిన్స్ ఖురేషీ అనే ముస్లిం యువకునిపై పోలీసులకు పిర్యాదు చేసింది. ఆ పిర్యాదులో ఖురేషీ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో మోను గుప్తా అనే పేరుతో తనకు పరిచయం అయ్యాడని, తనను పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానం చేశాడ‌ని, ఆపై గంజ్‌దుండ్వారాకు వచ్చిన తాను నిజాన్ని తెలుసుకున్న తర్వాత తనపై ఖురేషీ అత్యాచారం చేశాడ‌ని ఆమె ఆరోపించింది.

ఈ పిర్యాదును స్వీకరించిన పోలీసులు ఖురేషిపై ఐపీసీ సెక్షన్స్ 376, 323, 506 సెక్షన్ల కింద జులై 16న కేసు నమోదు చేశారు.

అయితే ఆ తర్వాతే అసలు కుట్ర బైటపడింది. కేసు పెట్టిన రాధ వైద్య పరీక్షలకు వెళ్లేందుకు నిరాకరించింది. పైగా కోర్టులో భయపడిపోయి అసలు నిజాన్ని కక్కేసింది. ఎలాగైనా నిజం బైటపడుతుందని, అలా జరిగితే తనకు తీవ్ర శిక్ష పడుతుందని భావించిన రాధ జడ్జి ముందుకెళ్ళి అసలు ఖురేషీకి తనకు పరిచయమే లేదని అమన్ చౌహాన్, ఆకాష్ సోలంకీలే తనతో ఈ లవ్ జీహాదీ ఆరోపణలు చేయించారని బైటపెట్టింది.

విషయం బైటపడటంతో చౌహాన్, సోలంకి, రాధల‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ప్రస్తుతం వాళ్ళు ముగ్గురు బెయిల్ పై విడుదలయ్యారు.

తాము ఈ కేసుపై విచారిస్తున్నప్పుడే ఆ యువతి అబద్దాలు చెప్తోందని అర్దమయ్యిందని చివరకు ఆమే అసలు విషయం బైటపెట్టిందని కస్‌గంజ్ ఎస్పీ బీబీజీటీఎస్ మూర్తి అన్నారు. బీజేపీ నేత చౌహాన్, అతని అనుచరుడు సోలంకిలకు ఖురేషికి మధ్య ఆర్థికపరమైన గొడవ‌లున్నాయని, అందుకే ఖురేషీని దెబ్బకొట్టడానికి రాధతో కలిసి ఫేక్ లవ్ జీహాదీ కుట్రకు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు.

కాగా అమన్ చౌహాన్ పై కేసు నమోదు కాగానే అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తూ బిజెపి జిల్లా అధ్యక్షుడు కెపి సింగ్ ప్రకటన జారీ చేశారు. అయితే లవ్ జీహాదీ పేరుతో ఆరోజు పోలీసు స్టేషన్ ముందు రచ్చ చేసిన 200 మంది గుంపు ఇప్పుడేం చేస్తున్నది తెలియరాలేదు.

First Published:  24 July 2022 12:29 PM GMT
Next Story