Telugu Global
National

ఉత్తరాఖండ్ 'వ్యాపామ్' స్కామ్ లో బీజేపీ నేత అరెస్ట్

ఉత్తరాఖండ్ లో సెలెక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్ష పత్రాన్ని లీక్ చేసిన కేసులో బీజేపీ నేత హకం సింగ్ రావత్ అనే బీజేపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కాంలో ఓ కుక్ (వంటవాడు), బస్సు కండక్టర్, ఓ ఆటో డ్రైవర్, ఓ కార్మికుడు, స్కూల్ టీచర్ కూడా సూత్రధారులని పోలీసులు తెలిపారు.

ఉత్తరాఖండ్ వ్యాపామ్ స్కామ్ లో బీజేపీ నేత అరెస్ట్
X

ఉత్తరాఖండ్ లో జరిగిన 'వ్యాపామ్' స్కామ్ లో ఓ బీజేపీ నేత హస్తం బయటపడింది. ఈ కేసులో ఉత్తరకాశీకి చెందిన హకం సింగ్ రావత్ అనే బీజేపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఇతని ఆధ్వర్యాన యూపీలోని ఓ మాఫియా సభ్యుడు, మరికొందరు కలిసి ఉత్తరాఖండ్ లో ఆ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్ష పత్రాన్ని లీక్ చేసినట్టు తేలింది. ఈ ముఠా ఒక్కో ప్రశ్న పత్రాన్ని 10 నుంచి 15 లక్షలకు సుమారు 200 మంది అభ్యర్థులకు అమ్మారట.. ఇది దాదాపు 200 కోట్ల స్కామ్ అని పోలీసులు తెలిపారు. హకం సింగ్ రావత్ నిర్వాకం బయటపడడంతో అతడిని పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. 2013 లో మధ్యప్రదేశ్ లో జరిగిన 'వ్యాపామ్' కుంభకోణాన్ని ఇది గుర్తుకు తెస్తోంది. ప్రవేశ పరీక్ష స్కామ్ లలో అది నాడు దేశంలో సంచలనం సృష్టించింది.

ఈ కుంభకోణంలో ఓ మాజీ కుక్ (వంటవాడు), బస్సు కండక్టర్, ఓ ఆటో డ్రైవర్, ఓ కార్మికుడు, స్కూల్ టీచర్ ఒకరు కూడా సూత్రధారులని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. వీరితో బాటు 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హకం సింగ్ రావత్ సహా లక్నోలోని టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ సంస్థ యజమాని, అందులో పని చేసే ఓ ఉద్యోగి కూడా ఈ బడా కుంభకోణంలో పాలు పంచుకున్నారని తెలిసింది. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో వీరంతా యూపీ, తదితర ప్రాంతాల్లో 50 కోట్ల విలువైన ఆస్తులను కొన్నారట. దాదాపు పదేళ్లుగా వీరంతా ఓ ముఠాగా ఏర్పడి ఈ దందా కొనసాగిస్తూ వచ్చారని పోలీసులు తెలిపారు. పరీక్ష పత్రాల లీకేజీలో మరికొంతమంది బడా నేతల హస్తం కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు మొదలుపెట్టారు.

First Published:  3 Sep 2022 11:55 AM GMT
Next Story