Telugu Global
National

బావమరిదికి సంఘీభావంగా వాద్రా పోస్టు.. పెడార్థాలు తీస్తున్న బీజేపీ

ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా.. రాహుల్‌కు సంఘీభావంగా ఓ పోస్టు పెట్టారు. కేవలం ఓ అభిమాని రూపొందించిన ఒక ఫ్లెక్సీ ఫొటోను పెట్టి.. 'భారత్ జోడో' అనే క్యాప్షన్ పెట్టారు. అయితే ఆ అభిమాని రూపొందించిన ఫ్లెక్సీలో రాబర్డ్ వాద్రా ఫొటో కూడా ఉంది.

బావమరిదికి సంఘీభావంగా వాద్రా పోస్టు.. పెడార్థాలు తీస్తున్న బీజేపీ
X

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్రను కాసేపటి క్రితం కన్యాకుమారిలో ప్రారంభించారు. 'భారత్ జోడో యాత్ర' పేరుతో 150 రోజుల పాటు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌లోని శ్రీనగర్ వరకు ఈ యాత్ర చేస్తున్నారు. దేశంలో ఎలాంటి ద్వేషాలకు తావు లేదని.. దాని కారణంగా దేశం విచ్ఛిన్నం కావడాన్ని తాను కోరుకోవట్లేదని రాహుల్ గాంధీ `జోడో యాత్ర` లక్ష్యాన్ని చెప్పారు. తమకు సేవ చేసిన చరిత్ర, త్యాగాలు చేసిన వారసత్వం ఉంది. ఇప్పుడు వారి బాటలోనే తాను దేశ ప్రజలను ఐక్యం చేయడానికి ఈ యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు.

కాగా, మొదటి నుంచి 'భారత్ జోడో యాత్ర'పై బీజేపీ విమర్శలు చేస్తోంది. ఎంకే స్టాలిన్ వంటి ఇతర పార్టీ నేతలు స్వయంగా మొదటి రోజు వచ్చి యాత్రకు సంఘీభావం తెలిపారు. బీజేపీ మాత్రం రాహుల్ యాత్ర తప్పకుండా ప్రభావం చూపిస్తుందని భావిస్తోంది. తాజాగా ఈ యాత్రపై బీజేపీ నేత షెహజాద్ పూనావాలా అనవసరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది 'భారత్ జోడో యాత్ర' కాదని.. పరివార్ జోడో యాత్ర అని ఎద్దేవా చేశారు. బుధవారం యాత్ర ప్రారంభం సందర్భంగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా.. రాహుల్‌కు సంఘీభావంగా ఓ పోస్టు పెట్టారు. కేవలం ఓ అభిమాని రూపొందించిన ఒక ఫ్లెక్సీ ఫొటోను పెట్టి.. 'భారత్ జోడో' అనే క్యాప్షన్ పెట్టారు. అయితే ఆ అభిమాని రూపొందించిన ఫ్లెక్సీలో రాబర్డ్ వాద్రా ఫొటో కూడా ఉంది.


ఇప్పుడు ఈ ట్వీట్‌పైనే బీజేపీ ట్రోల్ చేస్తోంది. ఇది కుటుంబాన్ని ఏకం చేసే యాత్రని.. భారత్‌ను ఏకం చేసేది కాదని విమర్శిస్తోంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ ఫొటో చూడండి అంటూ వాద్ర పెట్టిన పోస్టును ఉదహరించింది. గతంలో కూడా రాబర్ట్ వాద్రా లక్ష్యంగా బీజేపీ పలు విమర్శలు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీని ఈడీ అధికారులు విచారించిన తర్వాత రోజే బీజేపీ ఈ ప్రచారాన్ని మొదలు పెట్టింది. అయితే వాద్రా ఏనాడూ రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పలేదు. ఇప్పటి వరకు కుటుంబ వ్యవహారాల విషయంలో తప్ప కాంగ్రెస్ పార్టీ విషయంలో ఏనాడూ జోక్యం చేసుకోలేదు. తాజాగా బావమరిదికి సంఘీభావంగా ఓ పోస్టు పెడితే బీజేపీ పెడార్థాలు తీయడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. 'భారత్ జోడో యాత్ర' వల్ల బీజేపీలో భయం పట్టుకుందని.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని మండి పడుతున్నారు.

First Published:  7 Sep 2022 3:09 PM GMT
Next Story