Telugu Global
National

మహారాష్ట్ర కేబినెట్ లో థాక్రే వారసుడు..

అటు ఎమ్మెల్యే, ఇటు ఎమ్మెల్సీ కాని ఓ యువ నాయకుడు మంత్రి మండలిలో ఆశీనుడయ్యే అవకాశముందని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది

మహారాష్ట్ర కేబినెట్ లో థాక్రే వారసుడు..
X

మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా కొలువుతీరినా ఇంకా మంత్రిమండలి ఏర్పడలేదు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు.. చాలామంది మంత్రి పదవుల్ని ఆశిస్తున్నారు. అయితే వీరితోపాటు అటు ఎమ్మెల్యే, ఇటు ఎమ్మెల్సీ కాని ఓ యువ నాయకుడు మంత్రి మండలిలో ఆశీనుడయ్యే అవకాశముందని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఆ యువ నాయకుడి పేరే అమిత్ థాక్రే. ఆయన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధినేత రాజ్ థాక్రే కొడుకు. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు వ్యవహారం తర్వాత రాజ్ థాక్రే కూడా వార్తల్లోకి వచ్చారు. ఆయన ఆశీస్సులు కూడా ఏక్ నాథ్ షిండేకు ఉన్నాయని అంటున్నారు. అటు బీజేపీతో కూడా రాజ్ థాక్రే సన్నిహితంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం రాజ్ థాక్రే వారసుడు అమిత్ థాక్రేని మహారాష్ట్ర కేబినెట్ లోకి తీసుకోవాలనే ఆలోచన బీజేపీ చేస్తోంది.

బీజేపీకి ఉపయోగం ఏంటి..?

బీజేపీ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చుకోవాలి కానీ, MNS విషయంలో ఆ పార్టీ అంతగా ఎందుకు తొందరపడుతుందనేదే ఆలోచించాల్సిన విషయం. కానీ బీజేపీ బాగా ముందు చూపుతో ఆలోచిస్తోంది. మహారాష్ట్రలో ప్రస్తుతానికి శివసేన చీలిపోయినా పార్టీపై, కేడర్ పై థాక్రే వారసులకే పట్టు ఉంటుంది. శివసేనలో ఉద్ధవ్ థాక్రేకి కూడా లేని క్రేజ్ ఆయన కొడుకు ఆదిత్య థాక్రేకి ఉంది. రాబోయే రోజుల్లో ఆదిత్య చేతుల్లోనే శివసేన భవిష్యత్ ఉంటుందని అంటున్నారు. మరి ఆదిత్యకు పోటీగా అదే కుటుంబానికి చెందిన అమిత్ థాక్రేని ప్రోత్సహిస్తే అటు శివసేనకు చెక్ పెట్టినట్టు ఉంటుంది, ఇటు థాక్రే వారసుడు మన చెప్పుచేతల్లో కూడా ఉంటాడనేది బీజేపీ ఆలోచన. అందుకే అమిత్ కి మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నారు బీజేపీ నాయకులు.

రాజ్ థాక్రే నిర్ణయం ఏంటి..?

శివసేన నుంచి వేరుపడి MNS స్థాపించిన తర్వాత 2009 అసెంబ్లీ ఎలక్షన్‌లో మెరుపులు మెరిపించినా, ఆ తర్వాత మాత్రం నవనిర్మాణ సేన బాగా వెనకపడింది. రాజ్ థాక్రే కనీసం వార్తల్లోకి వచ్చేవారు కాదు. ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే రాజీనామా తర్వాత మళ్లీ రాజ్ థాక్రే వెలుగులోకి వచ్చారు. బీజేపీకి సానుకూలంగా ఉన్నా, ఆ పార్టీ గుప్పెట్లోకి వెళ్లాలని అనుకోవట్లేదు రాజ్ థాక్రే. ఏక్ నాథ్ షిండే సర్కారులో తనకి మంత్రి పదవి ఇస్తానన్నా ఆయన కాదన్నారట, అయితే ఇప్పుడు ఆయన కొడుకుకి ఆఫర్ ఇచ్చి బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంది. కనీసం కొడుకు భవిష్యత్ కోసమైనా రాజ్ థాక్రే ఒప్పుకుంటారేమో చూడాలి. అమిత్ ఎంట్రీ ఇస్తే శివసేనకు మరోసారి వారసత్వ పోరు తప్పదు. ఏక్ నాథ్ షిండే, బాల్ థాక్రే అనుచరుడే కానీ, వారసుడు కాదు. కానీ అమిత్ థాక్రే ఎంట్రీ ఇస్తే మాత్రం ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేన బలహీనపడే అవకాశాలున్నాయి.

First Published:  14 July 2022 5:54 AM GMT
Next Story