Telugu Global
National

జాతీయ జెండాల‌ను అమ్ముకుంటున్న‌ బిజెపి !

బీజేపీ జాతీయ జెండాలను అమ్మే వ్యాపారం మొదలుపెట్టింది. ఇంటింటా త్రివ‌ర్ణ ప‌తాకం ఎగురవేయాలని ప్రధాని పిలుపునిచ్చిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ బీజెపి యూనిట్ తన కార్యాలయాల్లో జాతీయ జెండాల సేల్స్ కౌంటర్ లను ప్రారంభించింది.

జాతీయ జెండాల‌ను అమ్ముకుంటున్న‌ బిజెపి !
X

ఆజాదీ అమృతోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకుంటున్న వేళ ఇంటింటా త్రివ‌ర్ణ ప‌తాకం ఎగ‌రేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దీనికి బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున ప్ర‌చారం క‌ల్పిస్తూ ఆర్భాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ బిజెపి ప్ర‌ధాన కార్యాల‌యంలో త్రివ‌ర్ణ ప‌తాకాల అమ్మ‌కం కేంద్రం ప్రారంభించ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. ఇలా జాతీయ జెండాల‌ను పార్టీ కార్యాలయాల నుంచి విక్రయించడం 'క్షమించరాని రాజకీయ నేరం' అంటూ కాంగ్రెస్ పార్టీ మండిప‌డింది.

మ‌ద్య‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్యక్షుడు విష్ణు దత్ శర్మ భోపాల్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ 'సువిధ విక్రయ‌ కేంద్రం' (సేల్ ఫెసిలిటేషన్ సెంటర్)పేరిట సేల్స్ కౌంట‌ర్ ను ప్రారంభించారు .పార్టీలోని 1070 మండల (జోన్), 52 జిల్లా కార్యాలయాల్లో ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. "జాతీయ జెండా పౌరులందరికీ అందుబాటులో ఉంచేందుకే"ఈ కౌంట‌ర్లు ప్రారంభిస్తున్నామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ కేంద్రాలలో వివిధ సైజుల జాతీయ జెండాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కోటి రూ. 10 నుండి రూ. 950 వరకు ఉంటుందని చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో అధికారికంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించే కార్యక్రమంలో శర్మ స్వయంగా రూ. 250 విలువైన జెండాను కొన్నారు కూడా.

జెండాల అమ్మ‌కం సిగ్గు చేటు : కాంగ్రెస్

బీజేపీ కార్యాలయం నుంచి జెండాలను విక్రయించడంపై రాష్ట్ర కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. "దేశ స్వాతంత్య్రం, ప్ర‌జ‌ల ఆత్మగౌరవం, జాతి గౌరవానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాకాన్ని బీజేపీ వారు విక్రయించడం సిగ్గుచేటని, అభ్యంతరకరమని" పార్టీ మీడియా సెల్ చీఫ్ కె.కె. మిశ్రా అన్నారు. బీజేపీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించడం రాజకీయంగా క్షమించరాని పాపమని ఆయ‌న పేర్కొన్నారు. అదే భావజాలానికి చెందిన గురు గోల్వాల్కర్ ఒక‌ప్పుడు ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని పెట్టవద్దని విజ్ఞప్తి చేశారని, అలా చేయ‌డం అశుభంగా అభివ‌ర్ణించార‌ని గుర్తు చేశారు. ఇప్పుడు అదే జెండా నేడు బీజేపీకి ఆత్మగౌరవ చిహ్నంగా ఎలా మారిందని మిశ్రా ప్రశ్నించారు.

జాతీయ జెండాల కోసం వెయ్యి కోట్ల‌తో 11 కంపెనీల‌కు కేంద్ర ప్ర‌భుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిందని, వీటిలో ఏడు కంపెనీలు గుజ‌రాత్ కు చెందిన‌వేన‌ని అన్నారు. పైగా ఈ జెండాలు ఖాదీతో కాకుండా పాలిస్ట‌ర్ తో రూపొందిస్తున్నార‌ని అన్నారు. ఖాదీతో త‌యార‌య్యే జెండాలు రూ.30-40 ల‌కే వ‌స్తుండ‌గా కేంద్రం త‌యారుచేయించే జెండాలు ఖ‌రీదైన‌వ‌ని చెప్పారు. ప్ర‌చారం కోసం రూ.300 కోట్ల‌ను వెచ్చిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

"వివిధ రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బిజెపి లక్షల కోట్లలో ఖర్చు పెడుతోంది. కానీ ఇప్పుడు ఆ పార్టీ కార్యాలయంలోనే త్రివర్ణపతాకాల విక్రయ కేంద్రాలను ప్రారంభించేందుకు పూనుకుంది. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్ వారికి ఇన్‌ఫార్మర్లుగా పనిచేసిన వారు ఇప్పుడు 75వ జయంతి వేడుకల్లో జాతీయ జెండాను అమ్ముతూ తమ వంతు పాత్ర పోషించడం దురదృష్టకరం"అని మిశ్రా విమ‌ర్శించారు.

కాగా, కాంగ్రెస్ ఆరోపణలను 'మానసిక దివాళా కోరుత‌నానికి' నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు దత్ శర్మ కొట్టిపారేశారు. "రాష్ట్రం మొత్తం త్రివర్ణపతాకంలో ఉండేలా చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మా కార్యాలయాల నుంచి జాతీయ జెండాను అందుబాటులో ఉంచుతున్నాం. మంచి కార్య‌క్ర‌మాల ప్రచారాలతో కాంగ్రెస్‌కు సమస్యలు ఉంటాయి. కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ లో కూడా ఇలానే చేశారు" అని మండిప‌డ్డారు. దేశవ్యాప్త 'హర్ ఘర్ తిరంగా' ప్రచారానికి సంబంధించి కాంగ్రెస్‌కు నొప్పి ఎందుకు క‌లుగుతోందని శ‌ర్మ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీకి దేశభక్తి, జాతీయవాదంతో ఎప్పుడూ సమస్యగానే ఉంటుంద‌ని అన్నారు.

First Published:  6 Aug 2022 10:51 AM GMT
Next Story