Telugu Global
National

గుజ‌రాత్ లో క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డుతున్న బిజెపి !

ప్ర‌ధాని సొంత రాష్ట్రంలోనే బిజెపి పాల‌న‌తో ప్ర‌జ‌ల‌కు ఒరిగిందేమీ లేద‌నే వాద‌న విన‌బ‌డుతోంది. ఇందుకు గురువారం జ‌రిగిన పోలింగ్ లో కొన్ని చోట్ల ప్రజలు బ‌హిరంగంగా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డ‌మే నిద‌ర్శ‌నం.

గుజ‌రాత్ లో క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డుతున్న బిజెపి !
X

దాదాపు రెండు ద‌శాబ్దాలుగా గుజ‌రాత్ లో అధికారంలో ఉన్న బిజెపి క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డుతోంది. తొలిసారి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టినుంచి ఎంతో అభివృద్ధి చేశామంటూ జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్న బిజెపి కి ఆ త‌ర్వాత జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ క్ర‌మంగా సీట్ల సంఖ్య‌ త‌గ్గుతూనే వ‌చ్చింది. అయితే ప్ర‌చార ఆర్భాటాల్లో అందెవేసిన చేయిగా ఉన్న బిజెపి న‌రేంద్ర మోడీని ఐకాన్ గా చూపుతూ గుజ‌రాత్ మోడ‌ల్ అభివృద్ధి, డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్‌ అంటూ ఊద‌ర‌గొడుతోంది. ఆయ‌న ప్ర‌ధాని అయినా దేశ‌మంతా గుజ‌రాత్ మోడ‌ల్ అభివృద్ధి చూపుతామంటూనే అర‌చేతిలో వైకుంఠం చూపెడుతోంది.

ప్ర‌ధాని సొంత రాష్ట్రంలోనే బిజెపి పాల‌న‌తో ప్ర‌జ‌ల‌కు ఒరిగిందేమీ లేద‌నే వాద‌న విన‌బ‌డుతోంది. ఇందుకు గురువారం జ‌రిగిన పోలింగ్ లో కొన్ని చోట్ల ప్రజలు బ‌హిరంగంగా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డ‌మే నిద‌ర్శ‌నం. ధ‌రాభారాన్ని మోయాల్సి వ‌స్తోందంటూ గ్యాస్ సిలిండ‌ర్లు భుజాన మోసుకుని ఓటు వేసేందుకు వ‌చ్చిన సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

గ‌ట్టి పోటీ ఎదుర్కొంటున్న బిజెపి..

బిజెపి బ‌లం త‌గ్గుతోంద‌న‌డానికి గురువారం జ‌రిగిన తొలిద‌శ ఎన్నిక‌ల్లో పోలింగ్ శాతం త‌గ్గ‌డం ఒక నిద‌ర్శ‌నం కాగా 2002 నుంచి జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల నాటి నుంచి 2017 లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కూ క్ర‌మంగా బిజెపి సీట్ల సంఖ్య త‌గ్గుతూనే వ‌స్తోంది. ఈ ఎన్నిక‌ల‌ల్లో బిజెపి నేరుగా కాంగ్రెస్ తోనే త‌ల‌ప‌డిన‌ప్ప‌టికీ సీట్ల సంఖ్య త‌గ్గుతుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా 2022 లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఈ సారి కాంగ్రెస్ పార్టీ స‌హా ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్‌), బిఎస్పీ, ఎంఐఎం పార్టీల‌తో పాటు అధిక సంఖ్య‌లో(339) ఉన్న ఇండిపెండెంట్ల‌ను కూడా బిజెపి ఎదుర్కొంటోంది. తొలిద‌శ‌లో 89 సీట్ల‌కు జ‌రిగిన పోలింగ్ లో స‌రాస‌రిన 60.23 శాతం ఓటింగ్ జ‌రిగింద‌ని అధికారులు తెలిపారు. అయితే 2017లో జ‌రిగిన తొలిద‌శ పోలింగ్ లో 66.75 శాతం పోలింగ్ అయింది. అంటే దాదాపు 6 శాతం ఓటింగ్ త‌గ్గింది. పైగా ఈ సారి ఆప్‌, కాంగ్రెస్, త‌దిత‌ర పార్టీల దూకుడు మీద ఉండటంతో పోలింగ్ జ‌రిగిన సౌరాష్ట్ర-కచ్‌లోని 19 జిల్లాలు, దక్షిణ ప్రాంతాల‌లో బిజెపి సీట్ల సంఖ్య బాగా త‌గ్గే అవ‌కాశం ఉందంటున్నారు విశ్లేష‌కులు.

తిరోగ‌మ‌న క్ర‌మం..

ప్ర‌దాని న‌రేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా సొంత‌ రాష్ట్ర‌మైనందున గుజ‌రాత్ ఎన్నిక‌ల పై అంద‌రి దృష్టీ నిలుస్తోంది. పైగా దేశంలో నెల‌కొన్న విప‌త్క‌ర ప‌రిస్థితుల నేపథ్యంలో ఈ సారి జ‌రుగుతున్న ఎన్నిక‌లు కీల‌కంగా మారాయి. నాలుగు సార్లు వ‌ర‌స‌గా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుస్తూ వ‌చ్చినప్ప‌టికీ మెజారిటీ కోల్పోతూనే ఉంది. 2002లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 127 సీట్లు, 2007లో 117 సీట్లు, 2012లో 115సీట్లు, 2017 లో కేవ‌లం 99 సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది బిజెపి. ఇలా క్ర‌మంగా సీట్ల సంఖ్య‌ త‌గ్గిపోతోంది. ఈ సారి ఎన్నిక‌ల్లో ఆప్‌, కాంగ్రెస్ పార్టీలు గ‌ట్టి పోటీ ఇస్తుండ‌గా బ‌రిలో నిలిచిన ఎంఐఎం, బిఎస్పీలు కూడా ఎంతో కొంత ప్ర‌భావం చూప‌గ‌ల‌వు. పార్టీల నుంచి ఎదుర‌వుతున్న సవాళ్ళు ఇలా ఉండ‌గా బిల్కిస్ బానో కేసులో నిందితుల విడుద‌ల అంశం, దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం, మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు త‌దిత‌ర స‌మ‌స్య‌లు ఈ సారి బిజెపిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఐదో సారి కూడా అధికారంలోకి రావాల‌ని ఉవ్విళ్ళూరుతున్న బిజెపి ఆశ‌లు నెర‌వేర‌డం క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది.

First Published:  2 Dec 2022 6:45 AM GMT
Next Story