Telugu Global
National

బీజేపీ "అరాచకీయం"... ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే కుట్ర‌

కేంద్ర బీజేపీ సర్కార్ రాష్ట్రాలను బలహీన పర్చడానికి, ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, టీఆరెస్ లాంటి పార్టీలను బలహీనపర్చేందుకు యత్నిస్తోందని రాజకీయ విశ్లేషకుల భావన.

బీజేపీ అరాచకీయం... ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే కుట్ర‌
X

రాజకీయ పార్టీలకు అధికారం శాశ్వతం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును బట్టి ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలను మెప్పించడం కోసం సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల్లో తమ పట్టును నిలుపుకోవడానికి కృషిచేస్తాయి. అదే క్రమంలో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ చేస్తున్న తప్పిదాలను ఎండగడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందించగలమో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాయి. ఎన్నికలప్పుడూ ఈ రెండు అంశాలను బేరీజు వేసుకొని ఏ పార్టీకి అధికారం కట్టబెట్టాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజాస్వామ్యంలో ఇది నిత్యం జరిగే ప్రక్రియ. కానీ ఇప్పుడు ఇది చరిత్ర కాబోతుంది.

దురదృష్టవశాత్తూ.. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ముప్పు ఏర్పడ్డది. కేంద్రంలో తమ అధికారాన్ని నిలుపుకోవడం కోసం మరియు రాష్ట్రాల్లో పై చేయి సాధించడం కోసం బీజేపీ అవలంబిస్తున్న విధానాలు దేశంలో సమాఖ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అడ్డదారిన అధికారం చేపట్టడం ఒకవైపు ఉంటె మరోవైపు ప్రాంతీయ పార్టీలను తమ చెప్పుచేతల్లో ఉన్న ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో బెదిరిస్తూ.. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది.

ఇప్పటికే దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఈడీ సంస్థలతో వేధించి ఫలవంతమైన బీజేపీ ఇప్పుడు అదే ఫార్ములాను ప్రాంతీయ పార్టీల మీద ప్రయోగిస్తోంది. ప్రాంతీయ పార్టీల్లో బలంగా ఉన్న నేతలను బుజ్జగించి తమ దారికి తెచ్చుకుంటున్న బీజేపీ తమ మాట వినని నేతలను కేసుల పేరుతో బెదిరించి మరీ తమ దారికి తెచ్చుకోవాలనుకుంటోంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విషయంలో ఇదే జరిగింది. చివరకు శివసేన పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అయ్యేలా చేసింది బీజేపీ పార్టీ. అంతకు ముందు పశ్చిమ బెంగాల్లో కూడా ఈడీ పేరుతో అక్కడి నాయకులను బెదిరించింది. తమిళనాడులో సైతం డీఎంకే నేతలను కేసుల పేరుతో తమ దారికి తెచ్చుకోవాలని విశ్వప్రయత్నం చేసింది.

ఇప్పుడు తాజాగా బీజేపీ దేశ రాజధానిలో కొరకరాని కొయ్యగా మారిన ఆప్ నాయకుల మీద మరొక్కసారి సీబీఐ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. మద్యం కుంభకోణం విచారణ పేరుతో ఆప్ సర్కార్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సింగ్ సిసోడియాను ఇరికించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈసారి బీజేపీ ఈ విషయంలో కొత్త ఎత్తుగడ వేసింది. ఒక్కో ప్రాంతీయ పార్టీ మీద ఒక్కో సారి ఈడీ, సీబీఐ లను ప్రయోగించే బదులు, ఇదే కేసులో పలు ప్రాంతీయ పార్టీల నేతలను ఇరికించాలని తద్వారా ఒక్క దెబ్బకు వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలను ఒకేసారి ఇబ్బందులు పెట్టాలని చూస్తోంది. అందులో భాగంగానే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు మరియు ఏపీ రాజ్యసభ సభ్యుడు విజ్జయసాయి రెడ్డి పేర్లను తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది.

అయితే విచిత్రంగా ఇలాంటి ఆరోపణలను, విచారణలను ఎదుర్కొంటున్న ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకులు.. బీజేపీ తీర్థం తీసుకున్న వెంటనే విచారణ సంస్థలు తమ విచారణను ఉన్నపళంగా నిలిపివేస్తున్నాయి. దీనికి ఉదాహరణ టిడిపి పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరీ, సీఎం రమేష్ అని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ నేతల మీద ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం, ఏ బీజేపీ నాయకుడు విచారణ ఎదుర్కోక పోవడం బీజేపీ ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెబుతోంది. ఏది ఏమైనా దేశంలో ప్రాంతీయ పార్టీల ఉనికిని దెబ్బతీయడానికి దర్యాప్తు సంస్థల ముసుగులో బీజేపీ వేస్తున్న ఎత్తుగడలు దేశంలో ప్రజాస్వామ్య ఉనికిని ప్రశ్నార్థకం చేసేవిధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  22 Aug 2022 8:30 AM GMT
Next Story