Telugu Global
National

ఎమ్మెల్యేకి 50 కోట్లు.. గోవా డీల్ ఎలా సెట్టైందంటే..?

కేవలం డబ్బులతో ఎరవేయడంతో సరిపెట్టలేదట. డబ్బులకు లొంగకపోతే సీబీఐని ఉసిగొల్పుతామనే భయం కూడా వారిలో కల్పించారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర ఏజెన్సీల పేరుతో భయపెట్టి తమ ఎమ్మెల్యేలను లాగేసుకున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యేకి 50 కోట్లు.. గోవా డీల్ ఎలా సెట్టైందంటే..?
X

పార్టీ మారేందుకు ఎమ్మెల్యేలకు బీజేపీ కట్టే రేటు రూ.25 కోట్లు అనేది హాట్ టాపిక్. ఢిల్లీ, పంజాబ్‌లో ఎమ్మెల్యేలకు బీజేపీ ఆఫర్ చేసిన రేటు ఇదేనని అంటారు. కానీ గోవాలో అంతకు మించి ఆఫర్ లభించిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకంగా రూ.50 కోట్లకు అమ్ముడుపోయారనేది తాజా సమాచారం. అవును గోవాలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వారి వారి డిమాండ్‌ని బట్టి రూ.40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు బీజేపీ ముట్టజెప్పిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

గోవాలో ఇటీవల 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా బీజీపీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలతో బాగానే బేరసారాలు జరిగాయట. గోవా కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దినేష్ గుండూరావు, గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమిత్ పాట్కర్.. ఈ బేరసారాల విషయాలను బయటపెట్టారు. 8 మందిలో ఒకరికి ముందుగా రూ.30 కోట్లు ఆఫర్ చేశారట బీజేపీ నేతలు, అతను ఆ ఆఫర్ తిరస్కరించాడట. రెండు గంటల తర్వాత అదనంగా రూ.10 కోట్లు ఇస్తామంటూ కబురు పంపారట. అప్పటికీ ఆ ఎమ్మెల్యే మనసు మార్చుకోకపోతే.. అదనంగా మరో రూ.5 కోట్లు ఇచ్చి.. మొత్తం రూ.45 కోట్లకు ప్యాకేజీ సెట్ చేశారట. ఇదీ ఓ ఎమ్మెల్యే విషయంలో జరిగిన బేరం అని చెప్పారు జీపీసీసీ అధ్యక్షుడు పాట్కర్.

సీబీఐ భయం కూడా..

కేవలం డబ్బులతో ఎరవేయడంతో సరిపెట్టలేదట. డబ్బులకు లొంగకపోతే సీబీఐని ఉసిగొల్పుతామనే భయం కూడా వారిలో కల్పించారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర ఏజెన్సీల పేరుతో భయపెట్టి తమ ఎమ్మెల్యేలను లాగేసుకున్నారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలతో బీజేపీ వస్తోందని, కేంద్ర ఏజెన్సీల ద్వారా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను వెంబడిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన మైఖేల్ లోబో సింహం అనుకున్నామని, కానీ అతను ఎలుకలాంటివాడని, అందుకే పార్టీ మారాడని విమర్శించారు కాంగ్రెస్ నేతలు.

డబ్బుకోసం కాదు, అభివృద్ధి కోసం..

కాంగ్రెస్‌ ఆరోపణలను బీజేపీ గోవా యూనిట్‌ అధ్యక్షుడు సదానంద్‌ షెట్‌ తనవాడే తోసిపుచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే 8మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని చెప్పారు. డబ్బులు ఎవరికీ ఇవ్వలేదని, ఎలాంటి షరతులు లేకుండా వారంతా బీజేపీలో చేరారని చెప్పుకొచ్చారు.

First Published:  16 Sep 2022 5:49 AM GMT
Next Story