Telugu Global
National

రైలంటే వందే భారత్ ఒక్కటేనా..? కేంద్రం అతిపై విమర్శల వెల్లువ

ఇటీవల వందే భారత్ రైలు ప్రమాదాలతో వార్తల్లో నిలుస్తుండటంతో కేంద్రం ఇబ్బంది పడుతోంది. ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఈ రైలు తరచూ ప్రమాదాలకు గురవుతోందంటూ రైల్వే శాఖను ఫెన్సింగ్ వేయాలంటూ ఆదేశించింది.

రైలంటే వందే భారత్ ఒక్కటేనా..? కేంద్రం అతిపై విమర్శల వెల్లువ
X

ఎనిమిదేళ్ల పాలనలో మోదీ సాధించిన ఘనత ఏంటి అనే ప్రశ్నకు.. వందే భారత్ రైలు తెచ్చామని కేంద్రం సమాధానం చెప్పేలా ఉంది. ఆ రైలు పేరుతో ఇప్పటికే కేంద్రం చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. గతంలోనూ హై స్పీడ్ రైళ్లున్నాయి. వందే భారత్ కంటే ఎక్కువ సౌకర్యాలుండేవి కూడా ఉన్నాయి. కానీ వందే భారత్ తమ మానస పుత్రిక అన్నట్టుగా బిల్డప్ ఇస్తోంది కేంద్రం. ఈ క్రమంలో రైల్వే శాఖతో కూడా ఓవర్ యాక్షన్ చేయిస్తోంది. దీనిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వందే భారత్ కు కాపలానా..?

వందే భారత్ రైలు పట్టాలపైకి వస్తున్నప్పుడు సిగ్నల్ లేని లెవల్ క్రాసింగ్ లు, ప్రయాణికులు పట్టాలు దాటే దగ్గర.. రైల్వే పోలీసులు కాపలాగా ఉంటున్నారు. విజయవాడలో కూడా వందే భారత్ వచ్చే సమయానికి ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు పట్టాలకు అటు ఇటు నిలబడి ఉంటున్నారు. ఆ రైలు స్టేషన్ దాటిపోగానే తమ డ్యూటీ అయిపోయినట్టు పక్కకు వచ్చేస్తారు. మిగతా రైళ్లు వస్తున్నా కూడా ప్రయాణికులు పట్టాలు దాటొచ్చనమాట, వందే భారత్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఎక్కడోళ్లక్కడే ఆగిపోవాలి. ఇదెక్కడి లాజిక్. ప్రమాదం కేవలం వందే భారత్ రైలుతోనే జరుగుతుందా, ఇతర రైళ్లతో ప్రమాదాలు జరిగితే అవి లెక్కలోకి రావా..? ఇదే ప్రశ్న సామాన్యుల నుంచి వినపడుతోంది. మిగతా ప్రమాదాలన్నీ జనం పట్టించుకోవట్లేదని, వందే భారత్ కింద ఆవు, గేదె పడినా కూడా అది వార్తవుతుందనేది రైల్వే వివరణ. అంత మాత్రాన వందే భారత్ కి సెక్యూరిటీ పెట్టడం ఏంటని, మిగతా సమయాల్లో ఆ సెక్యూరిటీ ఎటు పోతోందని విమర్శిస్తున్నారు ప్రజలు.




వందే భారత్ కోసం ఫెన్సింగ్..

ఇటీవల వందే భారత్ రైలు ప్రమాదాలతో వార్తల్లో నిలుస్తుండటంతో కేంద్రం ఇబ్బంది పడుతోంది. ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఈ రైలు తరచూ ప్రమాదాలకు గురవుతోందంటూ రైల్వే శాఖను ఫెన్సింగ్ వేయాలంటూ ఆదేశించింది. ఇంకేముంది వందే భారత్ రూట్లలో కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కేవలం ఈ రైలు కోసమే ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. కొత్త రైళ్లకు దిక్కులేదు, ఉన్న రైళ్లలో సౌకర్యాలకు డబ్బుల్లేవు, వృద్ధులకు రాయితీలడిగితే కుదరదు పొమ్మంటారు.. మరి వందే భారత్ కోసం ఇంత అతి అవసరమా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. రైల్వే శాఖని పరుగులు పెట్టిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

First Published:  30 Jan 2023 2:11 AM GMT
Next Story