Telugu Global
National

బీజేపీ డైవర్షన్ గేమ్.. హర్యానాలో బుల్డోజర్ పాలిటిక్స్

హర్యానాలో అల్లర్లకు కారణం అయ్యారనే ఆరోపణలతో 250 గుడిసెలను బుల్డోజర్లతో కూల్చేసింది ప్రభుత్వం. నూహ్ జిల్లాలో తావుడు ప్రాంతంలో ఈ అక్రమ నిర్మాణాలున్నాయని ఆరోపిస్తోంది. వీరంతా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ అక్రమంగా నివశిస్తున్నారని, హర్యానా మున్సిపల్ శాఖ చెబుతోంది.

బీజేపీ డైవర్షన్ గేమ్.. హర్యానాలో బుల్డోజర్ పాలిటిక్స్
X

మణిపూర్ లో హింసాత్మక ఘటనలతో బీజేపీ ఇమేజ్ బాగా డ్యామేజీ అయింది. ఇప్పుడు హర్యానాలో కూడా అల్లర్లు మొదలు కావడంతో డబుల్ ఇంజిన్ అనేది కేవలం ట్రబుల్ ఇంజిన్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఈ అపవాదుని పోగొట్టుకోడానికి ఇప్పుడు బుల్డోజర్లను తెరపైకి తెచ్చింది స్థానిక బీజేపీ ప్రభుత్వం. హర్యానాలో అల్లర్లకు కారణం అయ్యారనే ఆరోపణలతో 250 గుడిసెలను బుల్డోజర్లతో కూల్చేసింది. నూహ్ జిల్లాలో తావుడు ప్రాంతంలో ఈ అక్రమ నిర్మాణాలున్నాయని ఆరోపిస్తోంది ప్రభుత్వం. వీరంతా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ అక్రమంగా నివశిస్తున్నారని, హర్యానా మున్సిపల్ శాఖ చెబుతోంది. పోలీసుల బందోబస్తుతో ఈరోజు బుల్డోజర్లతో అక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేసింది.


అప్పుడు నిద్రపోతున్నారా..?

నాలుగేళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి భూములు కబ్జా చేసుకుని నివశిస్తుంటే ఇప్పటి వరకు చర్యలు తీసుకోకుండా హర్యానా ప్రభుత్వం, అధికారులు నిద్రపోతున్నారా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. అల్లర్లను అదుపు చేయలేక, సమాధానం చెప్పుకోలేక ఇలా బుల్డోజర్లను తీసుకుని రోడ్డుపైకి వచ్చారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

మేం కాపలాకే వచ్చాం..

పోలీసులు కూడా ఈ కూల్చివేతల్లో పాల్గొన్నారనే విమర్శలు వినిపిస్తున్నవేళ, తాము కేవలం కాపలాకి మాత్రమే వచ్చామంటున్నారు నూహ్ జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లా. నూహ్ అల్లర్ల వెనక 50మంది కుట్రదారుల్ని గుర్తించామని చెప్పారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా కీలక సమాచారం సేకరించిన పోలీసులు.. దాడులకు పాల్పడిన వారి ఫొటోలు, వీడియోలు విడుదల చేశారు. 45 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. కూల్చివేతల్లో తాము పాల్గొనడంలేదని, స్థానిక మున్సిపల్ శాఖల అధికారులు కూల్చివేతలు చేపట్టారని, తాము వారికి భద్రత కల్పిస్తున్నామని అన్నారు. ఎస్పీ వరుణ్ సింగ్లాపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయన్ను బదిలీ చేసింది.

ఇంటర్నెట్ పై ఆంక్షలు..

హర్యానాలోని 4 జిల్లాల్లో రేపటి వరకు మొబైల్ ఇంటర్నెట్ పై ఆంక్షలున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టిం గ్ లు పెట్టారంటూ, పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కూడా కేసులు పెట్టారు. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మాత్రం దీని వెనక పెద్ద కుట్రకోణం ఉందంటున్నారు. తప్పంతా ప్రతిపక్షాలపై నెట్టేశారు.

First Published:  4 Aug 2023 6:56 AM GMT
Next Story