Telugu Global
National

కాషాయదళంలో వారసులు.. బీజేపీ గురివింద నీతులు

2019 సార్వత్రిక ఎన్నికల్లో 303మంది ఎంపీలు బీజేపీ తరపున గెలిస్తే వారిలో 45మంది వివిధ రాజవంశాలకు చెందినవారు, రాజకీయ కుటుంబాలకు చెందినవారు ఉన్నారు.

కాషాయదళంలో వారసులు.. బీజేపీ గురివింద నీతులు
X

కాంగ్రెస్ పై వారసత్వ పార్టీ అనే ముద్రవేసి ఎన్నికల్లో లాభపడింది బీజేపీ. టీ అమ్ముకునే ఓ సామాన్యుడు బీజేపీలో ప్రధాని కాగలరని నిరూపించామని కబుర్లు చెప్పుకుంటోంది. కానీ బీజేపీ వారసత్వ రాజకీయాలు మేడిపండులాంటివి. పొట్టవిప్పి చూస్తే అందరూ వారసులే. అయితే ఆమధ్య వారసత్వ రాజకీయాలపై మోదీ చేసిన ప్రసంగం మాత్రం ఆశ్చర్యం కలిగించక మానదు. వారసత్వ రాజకీయాలు విడనాడాలంటున్న మోదీ, అసలు తమ పార్టీలోని వారసుల విషయంలో ఎందుకు నోరు మెదపరు అని ప్రశ్నిస్తున్నారు చాలామంది.

ఆర్ఎస్ఎస్ వారసత్వం లేకపోతే పదవులు వస్తాయా..?

ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే బీజేపీలో పదువులు రావు, మోదీ అయినా, అమిత్ షా అయినా.. కర సేవకులకే అనంతర కాలంలో కర్రపెత్తనం లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం బయటి వ్యక్తి అధ్యక్షుడు కావొచ్చని తాజాగా మరోసారి రుజువు చేశారు మల్లికార్జున్ ఖర్గే. కానీ బీజేపీలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని వారికి పార్టీపై పెత్తనం ఇవ్వరుగాక ఇవ్వరు.

రుజువులివే..

రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కానీ బీజేపీలో రాజవంశీకులకు పెద్దపీట వేస్తారు. వారి వారసులు బీజేపీలో తిరిగి నాయకులుగా ఎదుగుతారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 303మంది ఎంపీలు బీజేపీ తరపున గెలిస్తే వారిలో 45మంది వివిధ రాజవంశాలకు చెందినవారు, రాజకీయ కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. అంటే బీజేపీ ఎంపీల్లో 15శాతం మంది వారసులే. అయితే కాషాయదళం ఎదుటివారిపై వారసత్వ బురదజల్లాలనుకుంటుంది.

మోదీ కేబినెట్ లో ఉన్న 15మంది మంత్రులు వారసులే. ఏరికోరి వారసులకు ప్రాధాన్యమిచ్చారు మోదీ. ఇదే మోదీ జాతీయ జెండా ఎగురవేసి, వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలని పిలుపునివ్వడం ఆశ్చర్యం. వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రుల్లో చాలామంది వారసులే కావడం మరో విశేషం. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులకు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఒక డిప్యూటీ సీఎం కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవారే.

ఎన్డీఏతో పొత్తుపెట్టుకున్న పార్టీలు కూడా వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించేవే కావడం విశేషం. శివసేన షిండే వర్గం, లోక్ జనశక్తి పార్టీ, అప్నాదల్, నేషనల్ పీపుల్స్ పార్టీ, పీఎంకే, టీఎంసీ, శిరోమణి అకాలీదళ్.. ఇలా కూటమి పార్టీలు కూడా కుటుంబ రాజకీయాల్లో మునిగి తేలినవే. ఇక బీజేపీ నేతల విషయానికొస్తే, ఉత్తర భారత్ లోనే కాదు, దక్షిణాదిన, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వారసులకే ఏరికోరి సీట్లు ఇచ్చింది బీజేపీ. అన్నదమ్ములు, తండ్రీ కొడుకులు, భార్యా భర్తలు.. చాలామంది బీజేపీ తరపున పదవుల్లో ఉన్నారు. ఇంతమంది వారసులు తమవైపే ఉన్నా కూడా మోదీ గురివింద తరహాలో తమ తప్పు తెలియదన్నట్టుగా నీతివాక్యాలు చెబుతారు. వారసత్వ రాజకీయాలతోనే దేశం నాశనమైపోయిందని అంటారు. మొత్తమ్మీద భారత్ లో వారసత్వ రాజకీయాలు అంటే ఇప్పుడు బీజేపీ పేరే ముందు వరుసలో ఉంటుంది.

First Published:  23 Nov 2022 3:54 PM GMT
Next Story