Telugu Global
National

ప్రచారం కావాలా.. ఆదిపురుష్‌పై రాయి వేసెయ్..

వరుసగా బీజేపీ నేతలు ఆదిపురుష్‌పై స్పందించడంతో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. సినిమా విషయంలో రాజకీయ జోక్యం దేనికంటూ ప్రశ్నిస్తున్నారు.

ప్రచారం కావాలా.. ఆదిపురుష్‌పై రాయి వేసెయ్..
X

ఉచిత ప్రచారంలో బీజేపీ నేతలది అందెవేసిన చేయి. ట్రెండింగ్ సబ్జెక్ట్‌ని పట్టుకుని దానిపై విమర్శలు చేసి ఎక్కడలేని హైప్ క్రియేట్ చేసుకుంటారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా తమ స్థాయి మరచి మరీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటారు. తాజాగా ఆదిపురుష్‌పై బీజేపీ వైపు నుంచి మరో రాయి పడింది. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్, ఆదిపురుష్ టీజర్‌పై మండిపడ్డారు. ఆ టీజర్‌లో దేవుళ్ల పాత్రల్ని చూపించిన తీరు బాగాలేదన్నారు. చాలామంది సాధువులు ఇప్పటికే అభ్యంతరాలు తెలిపారని, ఆ సినిమాని నిషేధించాలని కోరారని, అది న్యాయమైన డిమాండేనని అంటున్నారు సాక్షి మహరాజ్.

రావణుడు కాదు, ఖిల్జీ..

ముఖ్యంగా ఈ సినిమా టీజర్‌లో రావణుడిగా కనిపించిన సైఫ్ అలీఖాన్ గడ్డంతో ఉండటం వివాదానికి కారణం అవుతోంది. అది రావణ పాత్రగా లేదని, ఖిల్జీలా ఉందని అంటున్నారు సాక్షి మహరాజ్. హనుమంతుడి పాత్రను మరీ గుర్తించలేనంతగా వక్రీకరించారని మండిపడ్డారు. హనుమంతుడికి మీసం లేకుండా గడ్డం పెట్టారని, తోలు బెల్ట్ వేసుకునేలా చూపించారని విమర్శించారు. రామాయణం విషయంలో సినిమాటిక్ లిబర్టీ సరికాదన్నారు. భారతీయ సంస్కృతిని అపహాస్యం చేశారని, సీతాదేవిని బాలీవుడ్ హీరోయిన్‌లా చూపించారని అన్నారు. ఈ సినిమా విడుదలను అడ్డుకునే విషయంలో తాము సాధువులకు పూర్తి మద్దతిస్తున్నామని అన్నారు సాక్షి మహరాజ్.

ఇప్పటికే మధ్య ప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా కూడా ఈ టీజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజర్‌ లో అభ్యంతరకమైన సన్నివేశాలున్నాయని, మతపరంగా కొందరి మనోభావాల్ని దెబ్బతీసే ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. హిందూ పురాణ పురుషుల్ని తప్పుగా చూపించే సీన్లను తొలగించకపోతే చట్టపరమైన చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. వరుసగా బీజేపీ నేతలు ఆదిపురుష్‌పై స్పందించడంతో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. సినిమా విషయంలో రాజకీయ జోక్యం దేనికంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్.. ఈ సినిమాని త్రీడీలో చూడాలని, ఇది మొబైల్ ప్రేక్షకుల కోసం కాదని సెటైర్లు పేల్చారు. ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారే అవకాశముందని అంటున్నారు సినీ విమర్శకులు.

First Published:  6 Oct 2022 8:26 AM GMT
Next Story