Telugu Global
National

చిక్కుల్లో ఝార్ఖండ్ సీఎం...మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ డిమాండ్

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీజేపీ మధ్యంత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.

చిక్కుల్లో ఝార్ఖండ్ సీఎం...మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ డిమాండ్
X

మైనింగ్ స్కామ్ కేసుకు సంబంధించి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ని శాసన సభ్యత్వానికి అనర్హునిగా ఎన్నికల సంఘం సిఫారసు చేయడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సొరేన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఇక ఇక్కడ మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ నిషి కాంత్ దూబే డిమాండ్ చేశారు. సొరేన్ అనర్హతకు సంబంధించి ఈసీ, గవర్నర్ రమేష్ బయాస్ కి మళ్ళీ లేఖ రాసిందని, అందువల్ల నైతిక కారణాలపై సొరేన్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సిందేనన్నారు. అసెంబ్లీని రద్దు చేసి.. మొత్తం 81 నియోజకవర్గాల్లోనూఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు. ఈసీ రాసిన లేఖ గవర్నర్ కార్యాలయానికి అందిందని, ఈ నెలలోగానే ఎన్నికలు జరగాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. సొరేన్ సొంతంగా తనే అక్రమంగా మైనింగ్ లీజు హక్కుల్ని పొందినందున శాసన సభ్యత్వానికి అనర్హునిగా ఆయనను ప్రకటించాలని రాష్ట్రంలో విపక్షంగా ఉన్న బీజేపీ డిమాండ్ చేసింది. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఈసీ అభిప్రాయాన్ని కోరుతూ లేఖ రాయగా.. ఆ సంస్థ తిరిగి రాసిన లేఖలో ఈ మేరకు సిఫారసు చేసింది. ఇది వాస్తవమేనని ప్రభుత్వ ఉన్నత వర్గాలు ధృవీకరించినా.. వివరాలు తెలిపేందుకు నిరాకరించాయి.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న గవర్నర్ రమేష్ బయాస్.. ఈ తాజా సమాచారం గురించి తనకు తెలియదని, చికిత్స కోసం తాను ఎయిమ్స్ కి వెళ్లానని.. ఈ రాత్రికి రాంచీ చేరుకున్నాకే దీనిపై స్పందిస్తానని చెప్పారు. ఇక-ఎన్నో ఆశలతో ప్రజలు ఝార్ఖండ్ ముక్తి మోర్ఛాకు అధికారమిచ్చారని.. కానీ పవర్ లోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం సహజ వనరులను దోపిడీ చేయడం ప్రారంభించిందని మాజీ సీఎం రఘుబర్ దాస్ ఆరోపించారు. హేమంత్ సొరేన్ తన పదవిని దుర్వినియోగం చేశారన్నారు.

కాగా ఈ విషయంపై తమకు ఈసీ నుంచి గానీ, గవర్నర్ కార్యాలయం నుంచి గానీ ఎలాంటి సమాచారం లేదని సీఎం కార్యాలయం ప్రకటించింది.

మాకు ముప్పేమీ లేదు .. జెఎంఎం ధీమా

తాజా పరిణామాలపై స్పందించిన అధికార జెఎంఎం నేతలు తమ ప్రభుత్వానికి ఇప్పట్లో వచ్చే ముప్పేమీ లేదని చెప్పారు. తమ సీఎంకి వ్యతిరేకంగా గవర్నర్ ఉత్తర్వులు వచ్చిన పక్షంలో తాము దానిపై కోర్టులో అప్పీలు దాఖలు చేస్తామని ఓ మంత్రి తెలిపారు. హేమంత్ సొరేన్ కూడా అప్పుడే తన సలహాదారులు, అడ్వొకేట్ జనరల్ రాజీవ్ రంజన్ తో సంప్రదింపులు ప్రారంభించారు. బీజేపీ ఎంపీ నిషి కాంత్ దూబే, ఆయన చేతిలో కీలుబొమ్మల్లా ఉన్న కొందరు జర్నలిస్టులు తామంతట తామే ఈసీ రిపోర్టును తయారు చేశారని, లేకపోతే సీల్డ్ కవర్ లేకుండా లేఖ ఎలా వస్తుందని హేమంత్ సొరేన్ వ్యాఖ్యానించారు.

First Published:  25 Aug 2022 2:09 PM GMT
Next Story