Telugu Global
National

బీజేపీ నెత్తిన భస్మాసుర హస్తం.. త్వరలో మహా సంక్షోభం

150 సీట్లు మిత్రపక్షాలకు పోతే రేపు బీజేపీకి మిగిలేవి 138. అంటే బీజేపీ పోటీ చేసిన ప్రతి సీటూ గెలిచినా అధికారంలోకి రావాలంటే ఎవరో ఒకరి దయ కావాల్సిందే. అలాంటి క్లిష్టపరిస్థితుల్లోకి మారిపోయింది బీజేపీ.

బీజేపీ నెత్తిన భస్మాసుర హస్తం.. త్వరలో మహా సంక్షోభం
X

అటు శివసేనను చీల్చారు, ఇటు ఎన్సీపీని చిందరవందర చేశారు. మహా వికాస్ అఘాడీని కకావికలం చేసి వికటాట్టహాసం చేస్తోంది మహారాష్ట్ర బీజేపీ. కానీ ఇది డేంజర్ పొలిటికల్ గేమ్ అని అతి త్వరలోనే కమలదళానికి అర్థమవుతుందని అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ మొదలు పెట్టిన ఈ డేంజర్ గేమ్ లో చివరకు ఆ పార్టీయే మట్టికరిచేలా కనిపిస్తోంది. తన నెత్తిన తానే భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టవుతోంది బీజేపీ పరిస్థితి.

మహారాష్ట్ర అసెంబ్లీ సీట్లు 288

ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే గెలవాల్సిన స్థానాలు 145

ప్రస్తుతం బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 105

షిండే వర్గం 40మందితో బొటాబొటి మెజార్టీతో గద్దనెక్కిన బీజేపీ.. ఇప్పుడు కొత్తగా అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ చీలిక వర్గాన్ని దగ్గరకు తీసుకుంది. ఎన్సీపీకి 46మంది ఎమ్మెల్యేలుండగా అందులో 40మంది తమతోనే ఉన్నారని అజిత్ పవార్ వర్గం చెబుతోంది. ఇందులో ఎంత మంది చివరి వరకూ ఉంటారో తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి 9మంత్రిపదవులిచ్చారు కాబట్టి.. నికరంగా వారు మాత్రం బీజేపీని వదిలిపెట్టి పోరు అనుకోవాలి.

కుమ్ములాట మొదలు..

తమదే అసలైన ఎన్సీపీ అని చెప్పుకుంటున్న అజిత్ పవార్ వచ్చే ఎన్నికల్లో 90 సీట్లలో పోటీ చేస్తామంటున్నారు. షిండే సేన 60 సీట్లకు ఒప్పుకుంటుందా లేక అంతకు మించి అడుగుతుందా అనేది తేలాల్సి ఉంది. 150 సీట్లు మిత్రపక్షాలకు పోతే రేపు బీజేపీకి మిగిలేవి 138. అంటే బీజేపీ పోటీ చేసిన ప్రతి సీటూ గెలిచినా అధికారంలోకి రావాలంటే ఎవరో ఒకరి దయ కావాల్సిందే. అలాంటి క్లిష్టపరిస్థితుల్లోకి మారిపోయింది బీజేపీ.

ముంచుకొస్తున్న సంక్షోభం..

షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే, అజిత్ పవార్ సీఎం అవుతారనే ఊహాగానాలు బలంగా వినపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎన్సీపీతో క్షేత్ర స్థాయిలో పోరాటం చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేల చేరికతో సర్దుకుపోవాలంటే కుదరట్లేదు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో బీజేపీ తరపున ఇప్పటి వరకు పోరాటం చేస్తున్న నేతలు ఇటీవల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం వస్తుందో లేదో అని బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫడ్నవీస్ కోసం తాము ఏదైనా చేస్తామని, అంతే కానీ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో మాత్రం కలసి ఉండలేమని కుండబద్దలు కొడుతున్నారు.

ఈ కలగాపులగం కాపురం ఎన్నాళ్లు సక్రమంగా ఉంటుందో చూడాలి. ట్రిపుల్ ఇంజిన్ అని గొప్పగా చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు, మూడు వర్గాల్ని సమన్వయం చేసుకోవడం తలకు మించిన భారమే. ఒకరకంగా షిండే, అజిత్ పవార్ ఇద్దరినీ కలుపుకొని బీజేపీ పెద్ద తప్పు చేసిందనే చెప్పాలి. వచ్చే ఎన్నికలనాటికి అది బీజేపీకి భస్మాసుర హస్తంలా మారే అవకాశముంది.

First Published:  7 July 2023 9:22 AM GMT
Next Story