Telugu Global
National

బిల్లు మీది, కానీ ఆ కల మాది - కాంగ్రెస్

ఇది తనకు ఉద్వేగభరిత క్షణం అని అన్నారు సోనియాగాంధీ. ఈ బిల్లును తీసుకురావడంతో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ స్వప్నం పూర్తిగా నెరవేరిందని చెప్పారు.

బిల్లు మీది, కానీ ఆ కల మాది - కాంగ్రెస్
X

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే 'నారీ శక్తి వందన్‌ అధినియమ్‌-2023' బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ బిల్లు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ సహా మిగతా పార్టీలు కూడా క్రెడిట్ పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. బిల్లు బీజేపీ తీసుకొచ్చినా, ఆ కల మాత్రం కాంగ్రెస్ దేనన్నారు సోనియా గాంధీ.

ఆ ఘనత మాదే- బీజేపీ

మహిళా బిల్లుని ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘావాల్‌ చర్చ మొదలు పెట్టారు. మహిళా బిల్లు తీసుకొచ్చిన ఘనత బీజేపీదేనన్నారు. పార్లమెంట్‌ తో పాటు అసెంబ్లీల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పారాయన. మహిళా రిజర్వేషన్‌ చట్టంతో మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. మహిళల గౌరవం పెరగడంతో పాటు వారికి సమాన అవకాశాలు వస్తాయని వివరించారు. పదిహేనేళ్ల పాటు ఈ రిజర్వేషన్లు అమలులో ఉంటాయని చెప్పారు. ఈ బిల్లుకు ఎన్డీయే ఎంపీలంతా మద్దతు తెలుపుతున్నారని అన్నారు మంత్రి మేఘావాల్.

అది రాజీవ్ కల..

మహిళా రిజర్వేషన్‌ బిల్లుని కాంగ్రెస్‌ పార్టీ సమర్థిస్తోందని తెలిపారు సోనియాగాంధీ. ఇది తనకు ఉద్వేగభరిత క్షణం అని అన్నారు. ఈ బిల్లును తీసుకురావడంతో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ స్వప్నం పూర్తిగా నెరవేరిందని చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలని రాజీవ్‌ గాంధీ ఆనాడు రాజ్యసభలో బిల్లు తీసుకొచ్చారని, అది 7 ఓట్ల తేడాతో వీగిపోయిందని గుర్తు చేశారు సోనియా. ఆ తర్వాత పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఆ బిల్లును చట్టంగా మార్చిందని చెప్పారు. ఆ చట్టం కారణంగానే స్థానిక సంస్థల్లో ఇప్పటివరకు దాదాపు 15 లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహించగలిగారని చెప్పారు సోనియా. ప్రస్తుతం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలులోకి తీసుకురావాలని కోరారు సోనియా. ఆలస్యమైతే మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు.


First Published:  20 Sep 2023 10:57 AM GMT
Next Story