Telugu Global
National

వాట్సప్ నే నమ్ముకున్న బీజేపీ...కర్నాటకలో ఊపందుకున్న పార్టీల ఫేక్ ప్రచారాలు

కర్నాటకలో ఎన్నికల పోరు రోడ్ షోలు.... ప్రచార ర్యాలీలలోనే కాదు సోషల్ మీడియాలో, అందులోనూ వాట్సప్ గ్రూపుల్లో కూడా వేడెక్కుతోంది.

వాట్సప్ నే నమ్ముకున్న బీజేపీ...కర్నాటకలో ఊపందుకున్న పార్టీల ఫేక్ ప్రచారాలు
X

ప్రముఖ జానపద పాట 'నోడ బన్ని, ఓడి బన్ని' (రండి చూడండి, రండి చదవండి) బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, చిన్న వీడియోల సమాహారంలో కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య జానపద నృత్యం చేయడం, మత్తులో ఉన్న డీకే శివకుమార్ జనం మధ్య నడుచుకుంటూ వెళ్ళడం, సోనియా గాంధీ డ్యాన్స్ చేస్తున్న మార్ఫింగ్ చిత్రం తో కూడిన, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన రెండు నిమిషాల ఓ వీడియో కర్నాటకలో ఇప్పుడు లక్షల మంది వాట్సప్ లలో చక్కర్లు కొడుతోంది.

కర్నాటకలో ఎన్నికల పోరు రోడ్ షోలు.... ప్రచార ర్యాలీలలోనే కాదు సోషల్ మీడియాలో, అందులోనూ వాట్సప్ గ్రూపుల్లో కూడా వేడెక్కుతోంది.

2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ప్రచారాన్ని వ్యాప్తి చేయడంలో బీజేపీకి వాట్సాప్ కీలక సాధనంగా మారితే, ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) లు కూడా సోషల్ మీడియాపై దృష్టి పెట్టాయి. చిన్న వీడియోలను రూపొందించడంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో తమ నాయకులను పొగడటం, తమ కార్యక్రమాలను ప్రచారం చేయడం వరకే పరిమితం కాకుండా తమ రాజకీయ ప్రత్యర్థులను ఎగతాళి చేయడం, అబద్దాలు ప్రచారం చేయడం , వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఇప్పుడు ప్రధాన ఎజెండాగా మారిపోయింది. అందుకు వాట్సప్ యూనివర్సిటీ ఉపయోగపడ్డట్టుగా మరే సోషల్ మీడియా ఉపయోగపడటంలేదు.

కర్నాటక‌లో ఉన్న మూడు ప్రధాన పార్టీలలో అతిపెద్ద సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న పార్టీ బిజెపి. ఒక్క కర్నాటక‌లోనే కాదు దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రచారంలో బీజేపీతో పోటీ పడగ‌ల పార్టీలు లేవంటే ఆశ్చ‌ర్యంలేదు.

కర్నాటకలో బీజేపీ సోషల్ మీడియా టీం మొత్తం కాంగ్రెస్ ను టార్గెట్ చేయడంపైనే తన ప్రచారాన్ని కేంద్రీకరిస్తోంది. "కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న‌ అబద్ధాలను, వారు దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లకు ఎలా ద్రోహం చేశారనే దానిని ప్రచారం చేయడంపై మేము కేంద్రీకరిస్తున్నాము" అని కర్ణాటక బిజెపి సోషల్ మీడియా బృందానికి నాయకత్వం వహిస్తున్న వికాస్ ఓ ప్రముఖ వెబ్ పోర్టల్ తో అన్నారు.

కర్నాటక బీజేపీ సోషల్ మీడియాలో అతిపెద్ద రీచ్‌ను కలిగి ఉంది, ట్విట్టర్‌లో 45 లక్షల మంది ఫాలోవర్లు, ఫేస్‌బుక్‌లో 94 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బీజేపీతో పోల్చితే కాంగ్రెస్ చాలా వెనకబడి ఉంది. కాంగ్రెస్ కర్ణాటక పేజీకి ట్విట్టర్‌లో 30 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 47 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బీజేపీకి రాష్ట్రంలోని ఓటింగ్ బూత్ స్థాయిలో 50,000 వాట్సాప్ గ్రూపుల నెట్‌వర్క్‌ ఉంది.

బీజేపీ షేర్ చేసే కొన్ని వీడియోలు ప్రతి రోజూ పదుల సంఖ్యలో , వందల సంఖ్యలో టెక్స్ట్ మెసేజ్ లతో వినియోగ‌దారుల వాట్సప్ లను నింపుతోంది. బీజేపీ నేతల గొప్ప తనాన్ని కీర్తిస్తూ , అభివృద్ధి పథకాలను ఎత్తిచూపుతూ, ఇతర పార్టీల నేతలపై తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేస్తూ...ఈ ప్రచారం సాగుతోంది. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌లు ఎన్నికల వేళ తప్పుడు సమాచారానికి కేంద్రంగా మారాయని రాజకీయ పార్టీల ఐటీ సెల్స్ పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు.

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) కమ్యూనికేషన్స్ చైర్ పర్సన్ ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత ప్రసంగాల రూపంలో తప్పుడు సమాచారాన్ని తాను తరచుగా చూస్తున్నానని అన్నారు. “మేము ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా డిపార్ట్‌మెంట్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నాము, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇతర ప్లాట్‌ఫారమ్లలో ప్రచారం అవుతున్న ద్వేషపూరిత ప్రసంగాలకు, ప్రచారాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా డిపార్ట్‌మెంట్‌ మాకు సహాయపడుతుంది. హానికరమైన, తప్పుడు సమాచారం, ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఖాతాలను మేము నిరంతరం ఫ్లాగ్ చేస్తూనే ఉంటాము, ”అని ప్రియాంక్ అన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో కాంగ్రెస్ కర్ణాటక పేజీ గణనీయమైన రీచ్‌ను కలిగి ఉంది, బీజేపీకి 59,000 మంది ఫాలోవర్లు ఉండగా కాంగ్రెస్ కు 87,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. "మేము ప్రత్యేకంగా Instagram, Facebook ల‌ కోసం హాస్యపూరిత‌మైన, వ్యంగ్య వీడియోలను రూపొందిస్తున్నాము" అని ప్రియాంక్ చెప్పారు.

అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై బీజేపీని అవహేళన చేసే ప్రచారాలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ‘‘గత మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం ఎంత అసమర్థంగా ఉందో ఎత్తి చూపడంపై దృష్టి సారిస్తున్నాం. మేము PayCM ప్రచారాన్ని నిర్వహించాము, ఇది భారీ విజయాన్ని సాధించింది. ' #నిమ్మహత్తిరఇదేయఉత్తర ఉందా?' అనే హ్యాష్ ట్యాగ్ తో మేము పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్రచారం చేగలిగాము అని ప్రియాంక్ అన్నారు. (నిమ్మహత్తిరఇదేయఉత్తర ఉందా? అనేది మేనిఫెస్టో వాగ్దానాలు ఎందుకు పూర్తి చేయలేదనే అంశంపై '#మీ దగ్గర‌ సమాధానాలు ఉన్నాయా?' అని చేసిన ప్రచారం)

ఇక JD(S) వాట్సాప్‌లో గ్రామీణ ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది.బీజేపీ, కాంగ్రెస్ లతో పోల్చితే, JD(S)కి సోషల్ మీడియాలో తక్కువ ఫాలోయింగ్ ఉంది, దాని ట్విట్టర్, ఫేస్‌బుక్ పేజీలలో ఒక్కోదానికి కేవలం 50,000 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు, అయితే ఆ పార్టీ సోషల్ మీడియా హెడ్ ప్రతాప్ కనగల్ మాట్లాడుతూ వాట్సాప్‌లో ఓటర్లను చేరుకోవడంపైనే తమ దృష్టి ఉందని అన్నారు. . “మేము బూత్ స్థాయిలో వాట్సాప్ గ్రూపులను సృష్టించాము. మా స్థానిక అభ్యర్థులకు, వారి టీంలకు వారి నియోజకవర్గంలోని సమస్యలను వాట్సాప్‌లో ఎలా ప్రచారం చేయాలో శిక్షణ ఇస్తున్నాము. అభ్యర్థులను ప్రకటించిన ప్రతి నియోజకవర్గంలో స్థానిక సోషల్ మీడియా టీమ్‌లను కూడా రడీ చేస్తున్నామని ప్రతాప్ తెలిపారు.

JD(S) పార్టీ రైతు అనుకూల భావజాలానికి అనుగుణంగా కంటెంట్‌ను రూపొందించేందుకు కంటెంట్ రైటర్‌లు, వీడియో, ఫోటో ఎడిటర్‌లతో సహా అనేక మంది నిపుణులతో బెంగళూరులో ఓ వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసింది. “మా ప్రత్యర్థుల బలాబలాలు మాకు తెలుసు. కాంగ్రెస్‌, బీజేపీలకు సహకరించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యక్తులు వస్తారు. మాకు వనరులు తక్కువ. అయినా సరే మేము మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. మా ప్రణాళికకు కట్టుబడి, గ్రామీణ కన్నడిగ ఓటరును చేరుకోవడంపైనే మా సోషల్ మీడియా దృష్టి ఉంది. ”అని ప్రతాప్ అన్నారు.

రాష్ట్ర ప్రధాన పాల బ్రాండ్ అయిన నందినిని గుజరాత్ కు చెందిన అమూల్‌లో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాద‌నకు వ్యతిరేకంగా తాము వీడియో తయారు చేశామని, దీని వల్ల కన్నడిగులు తమ హక్కులను ఎలా కోల్పోతారో చెప్పే వీడియో కంటెంట్‌ను పార్టీ రూపొందించిందని ఆయన అన్నారు. అమూల్ బ్రాండ్ పాలను నిర్వహిస్తున్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్‌లో విలీనం చేయడం ద్వారా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే నిరసనలు తప్పవని జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి ఇటీవల హెచ్చరించారు.

“సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ చాలా త్వరగా వ్యాపిస్తుందని మాకు తెలుసు… అది నిజమో కాదో, చెప్పాల్సిన బాధ్యత మామీద ఉంటుంది. అది కూడా సోషల్ మీడియా ద్వారానే చేయగలం . ”అని ప్రతాప్ పేర్కొన్నాడు.

మొత్తానికి ప్రస్తుతం కర్నాటకలో ఎన్నికల యుద్దం రోడ్డుపైన కన్నా ఎక్కువగా ఇంటర్ నెట్ లో సాగుతోంది. ఇక్కడిప్పుడు వాట్సప్ యూనివర్సిటీ పండితులదే హవా. నిజాలు అబద్దాలు అనేవి ఇక్కడ విషయమే కాదు. తమ వాట్స‌ప్ జ్ఞానాన్ని ఎంత మంది మెదళ్ళలోకి ఎక్కించగలిగామన్నదే విజయానికి తొలి, చివరి మెట్టు కూడా.

First Published:  28 Jan 2023 4:02 AM GMT
Next Story