Telugu Global
Editor's Choice

నెహ్రూ చరిత్రను చెరిపేస్తోన్న బీజేపీ

నెహ్రూ జీవితాన్ని చదివితే భారతదేశానికి ఆయన ఎంత ముఖ్యమైన వ్యక్తి అన్నది తెలుస్తుంది. ఆయన రాసిన పుస్తకాలు, వ్యాసాలు, ఉత్తరాలు, ఆయన ప్రసంగాలు ఒక వ్యక్తి తన జీవితంలో ఇంత పరిశ్రమిస్తాడా అని ఆశ్చర్యపోయేలా చేస్తాయి.

X

''చరిత్ర అంటే మాది..వాళ్ళది బురద జాతి. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. వాళ్ళెంత బ్లడీ ఫూల్స్‌''. ప్ర‌ముఖ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాలోని డైలాగులు ఇవి. అయితే సరిగ్గా భారత రాజకీయాల్లోనూ అటువంటి దృశ్యమే కనబడుతోంది. చరిత్ర అంటే చరిత్రే ! దాన్ని ఎట్లా మార్చగలరు? కొత్తగా ఎట్లా చెప్పగలరు ? ఎట్లా వక్రీకరించగలరు. 'చరిత్ర అంటే మాదే ! మేము లేకపోతే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేది కాదు. సావర్కర్ లేకపోతే దేశం విముక్తి కాగలదా'? అని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంటుంటే ఎవరు నిలువరించగలరు? ప్రచారం వేరు. దుష్ప్రచారం వేరు. దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ రెండవ దాన్ని నమ్ముకుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు పెద్ద ఎత్తున పత్రికలలో గుప్పించిన అడ్వర్టైజ్ మెంట్లలో ఎక్కడా నెహ్రూ ఫొటో లేదు. ఇది కాకతాళీయంగా జరగలేదు. నెహ్రూ అంటే మోడీకి గిట్టదు. కనుక ఆయన వందిమాగధ ముఖ్యమంత్రులంతా ఆయా ప్రకటనలలో నెహ్రూ ఊసు లేకుండా జాగ్రత్త పడ్డారు.

"ఆధునిక భారత నిర్మాత" అని దేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1964లో మరణించినప్పుడు న్యూయార్క్ టైమ్స్‌ నివాళులర్పించింది. "నెహ్రూలేని ప్రపంచం" అంటూ 'ఎకనమిస్ట్' పత్రిక ముఖపత్ర కథనంలో విషాదం ప్రకటించింది. భారతదేశంపైనే కాదు, తమ పైన కూడా చెరగని ముద్ర వేసిన చారిత్రక వ్యక్తిగా జవహర్ లాల్ నెహ్రూను ప్రపంచదేశాలు గుర్తిస్తాయి. "కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లుగా నెహ్రూ వల్ల దేశానికి స్వాతంత్య్రం రాలేదు" అని పార్లమెంటు వేదికగా ప్రధాని మోడీ అన్నారు. రాజస్థాన్‌లో 8వ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి నెహ్రూ పాఠాన్ని తొలగించిన సంగతి చాలామందికి తెలియదు.

క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన జాతీయ పురావస్తు ప్రదర్శనలో ఆయన ప్రస్తావన లేదు. నెహ్రూ అధికారిక నివాసం వద్ద ఉన్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీని ప్రస్తుత సాంస్కృతిక శాఖ పేరు మార్చిపారేసింది. మాజీ ప్రధానులందరి జీవిత చరిత్రలను ప్రదర్శించే కాంప్లెక్సుగా మార్చింది. మహాత్మాగాంధీ హత్యానంతరం నెహ్రూ ఆర్‌ఎస్‌ఎస్ ను నిషేధించడంపై ఆర్‌ఎస్‌ఎస్ ఎంతో కాలంగా ప్రతీకారం కోసం కాచుకొని ఉన్నది. అందువల్లనే నెహ్రూ అంటే తీవ్రమైన వ్యతిరేకతను బీజేపీ ప్రదర్శిస్తోంది. నెహ్రూ సెక్యులరిజం అంటే ఆర్‌ఎస్‌ఎస్‌కు అసహ్యం.

నెహ్రూ జీవితాన్ని చదివితే భారతదేశానికి ఆయన ఎంత ముఖ్యమైన వ్యక్తి అన్నది తెలుస్తుంది. ఆయన రాసిన పుస్తకాలు, వ్యాసాలు, ఉత్తరాలు, ఆయన ప్రసంగాలు ఒక వ్యక్తి తన జీవితంలో ఇంత పరిశ్రమిస్తాడా అని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. చరిత్రకారుడు జూడిత్ ఎం.బ్రౌన్ 2003లో రాసిన నెహ్రూ జీవితచరిత్ర "నెహ్రూ: ఏ పొలిటికల్ లైఫ్‌" చదివితే ఈ గొప్పదనం కొంతవరకు అర్థమవుతుంది. నెహ్రూ తన జీవితంలో దాదాపు తొమ్మిది సంవత్సరాలు జైల్లోనే ఉన్నారు. నెహ్రూ అనేక విషయాలను చదివేవారని నెహ్రూ జీవిత చరిత్ర రాసిన బ్రౌన్ చెప్పారు. దేశాల మధ్య సమానత్వంతో పాటు దేశంలోని ప్రజల మధ్య సమానత్వం కోరుకునేవారు. విజ్ఞాన శాస్త్రానికి చాలా ప్రాముఖ్యం ఇచ్చేవారు. మతానికి ఆయనెప్పుడు ప్రాముఖ్యం ఇవ్వలేదు. జాతి నిర్మాణంలో మహిళలకు ప్రముఖపాత్ర ఉండాలని భావించేవారు. ప్రపంచపటంలో భారతదేశానికి ప్రత్యేక స్థానం కోసం పరితపించారు.

"నిస్సందేహంగా మన ప్రజాస్వామ్యసౌధానికి ప్రధాన వాస్తుశిల్పి నెహ్రూ. ఆయనే అందరికీ ఓటు హక్కు, బహుళ పార్టీ వ్యవస్థలకు పునాదులేశారు." అని చరిత్రకారుడు రామచంద్రగుహ "పాట్రియాట్స్ అండ్ పార్టిసాన్స్‌" లో రాశారు. అందుకే రామచంద్రగుహను నెహ్రూ బానిసగా ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు ముద్రవేశాయి. సోషలిస్టు పంథా పరిపాలనతో, మిశ్రమ ఆర్థిక విధానాలను అవలంబిస్తూ ఆయన చేసిన ప్రయత్నాలను ఇప్పుడు కొందరు విమర్శించవచ్చు. ఇలాంటి విధానాల వల్ల ప్రగతి దెబ్బతిన్నట్టు కొందరు వాదించవచ్చు.

కానీ, సోవియట్ పారిశ్రామికీకరణ వేగం పుంజుకోవడం అమితంగా తనను ఆకర్షించినందుకే భారతదేశంలోనూ అలాంటి ప్రగతిని కాంక్షించారు. భారత దేశంగా స్వేచ్ఛగా ప్రయాణం ప్రారంభించినప్పుడు దేశంలో అక్షరాస్యత కేవలం 14 శాతం. ఎటు చూసినా పేదరికం తాండవిస్తున్న కాలం. కనుక అనేక రంగాల్లో ప్రభుత్వం కలుగజేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తొలి ప్రధాని గుర్తించారు. ఆ దిశగా ఆయన వేసిన అడుగుల కారణంగా చెప్పుకోదగ్గ ఫలితాలు కూడా లభించాయి. ముఖ్యంగా అణుశక్తి రంగంలోను, రోదసీ రంగంలోనూ ఈ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి.

నెహ్రూ దూరదృష్టితోనే ఐఐటీ, ఐఐఎంలు వచ్చాయి. భాక్రానంగల్, నాగార్జున సాగర్ వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం జరిగాయి. ఇంకా అనేక పథకాలు వచ్చాయి. నవభారత నిర్మాణంలో నెహ్రూ పోషించిన క్రియాశీలపాత్రను మరిచిపోవడం ముమ్మాటికీ సంకుచిత చర్య. నెహ్రూకు అవమానం జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రావలసినంత ప్రతిఘటన రాకపోవడం ఒక విషాదం. అసలు స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన ఆ పార్టీ స్వాతంత్య్ర 'వజ్రోత్సవాల'లో అడ్రసు కానరాలేదు. మొక్కుబడిగా మాత్రమే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నది. జాతీయోద్యమంతో సంబంధం లేదనే విమర్శలను ఎదుర్కుంటున్న బీజేపీ 'అమృత్ మహోత్సవాల 'ను సొంతం చేసుకున్నది. ఇంటింటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అద్భుతమైన పథకాన్ని అమలుచేసింది.

ప్రధాని నరేంద్రమోడీతో విధానాలు, సిద్ధాంతాలు, పాలనా వైఫల్యాలపై నిరంతరం ఘర్షణకు దిగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 16న అబిడ్స్‌లో జవహర్ లాల్ నెహ్రూ విగ్రహం సాక్షిగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించి సంచలనం సృష్టించారు. బహుశా దేశంలో మరే ముఖ్యమంత్రి ఇలాంటి ప్రయోగం చేయలేదు. నెహ్రూ విగ్రహం దగ్గరే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కన్నా మోడీతో పోరాటానికి సింబాలిక్ సన్నివేశం ఇంకేముంటుంది?

First Published:  19 Aug 2022 1:00 AM GMT
Next Story