Telugu Global
National

బీజేపీ, జేడీఎస్ పొత్తు.. సౌత్‌పై కమలనాథుల స్పెషల్‌ ఫోకస్‌..!

కాంగ్రెస్‌, టీఎంసీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, డీఎంకే, శివసేన ఉద్ధవ్‌ వర్గం లాంటి పార్టీలన్ని కూటమిగా ఉన్న ఇండియాను ఎదుర్కోవాలంటే బీజేపీ కూడా ఈ పొత్తు కీలకమే.

బీజేపీ, జేడీఎస్ పొత్తు.. సౌత్‌పై కమలనాథుల స్పెషల్‌ ఫోకస్‌..!
X

సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్న వేళ.. దక్షిణాదిన కొత్త పొత్తు పొడిచింది. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో జేడీఎస్‌తో బీజేపీ పొత్తుపై ఓ ఒప్పందానికి వచ్చింది. ఈ మేరకు బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప క్లారిటీ ఇచ్చారు. జేడీఎస్‌ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. ఈ ఒప్పందం కర్ణాటకలో బీజేపీ 25 నుంచి 26 ఎంపీ సీట్లు గెలిచేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.

మాండ్యా, హాసన్‌, బెంగళూరు రూరల్‌, చిక్‌బళ్లాపూర్‌ స్థానాలను జేడీఎస్‌ కోరుతున్నట్లు సమాచారం. ఈ నాలుగు స్థానాల్లో జేడీఎస్‌ కేవలం హాసన్‌లో మాత్రమే విజయం సాధించింది. అక్కడి నుంచి ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత హెచ్‌డీ దేవెగౌడ తుమకూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దేవెగౌడ మనవడు, కుమారస్వామి కొడుకు.. నిఖిల్‌ కుమారస్వామి మాండ్యా నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో 25 స్థానాలను బీజేపీ సొంతంగా గెలుచుకుంది. ఓ స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతునివ్వగా ఆయన కూడా విజయం సాధించారు. మొత్తంగా బీజేపీ 26 ఎంపీ సీట్లు గెలిచినట్లయింది. ఇక కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమయింది. ఆ ఎన్నికల్లో జేడీఎస్‌ 10 శాతం కంటే తక్కువ ఓట్‌ షేర్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ కేవలం 14 శాతం ఓట్‌షేర్‌కు పరిమితమైంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు జేడీఎస్‌కు కీలకంగా మారనుంది. కాంగ్రెస్‌, టీఎంసీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, డీఎంకే, శివసేన ఉద్ధవ్‌ వర్గం లాంటి పార్టీలన్ని కూటమిగా ఉన్న ఇండియాను ఎదుర్కోవాలంటే బీజేపీ కూడా ఈ పొత్తు కీలకమే.

అయితే గత సార్వత్రిక ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ సాధించిన విజయాలను చూపి కొంతమంది బీజేపీ నేతలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో గత మే నెల వరకు బీజేపీ అధికారంలో ఉంది. మే నెల‌లో కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి.. అధికారం ద‌క్కించుకుంది. మొత్తం 225 అసెంబ్లీ స్థానాలకు గానూ 135 స్థానాల్లో గెలిచింది. కర్ణాటకలో ఓడిన తర్వాత బీజేపీకి దక్షిణాన ప్రాతినిథ్యం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు సౌత్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది బీజేపీ.

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏఐడీఎంకే-బీజేపీ మధ్య మళ్లీ ఇటీవలే పొత్తు చిగురించింది. కేరళలోనూ చిన్నపార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక పుదుచ్చేరిలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది.

*

First Published:  8 Sep 2023 10:50 AM GMT
Next Story