Telugu Global
National

ఢిల్లీ వాయు కాలుష్యం మాటున రాజకీయ కాలుష్యం

పంజాబ్ లో కాంగ్రెస్, బీజేపీకి ఊహించని షాకిచ్చిన ఆప్.. ఇప్పుడు గుజరాత్ ని కూడా ఆక్రమిస్తే బీజేపీ తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. దాని ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది.

ఢిల్లీ వాయు కాలుష్యం మాటున రాజకీయ కాలుష్యం
X

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అది ఏమాత్రం తగ్గడంలేదు. దీంతో ఢిల్లీలో స్కూళ్లకు, ఆఫీస్ లకు సెలవులిచ్చేశారు. స్టడీ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలయ్యాయి. ఈ దశలో ఇప్పుడీ వ్యవహారాన్ని రాజకీయం చేయాలని చూస్తోంది బీజేపీ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పొలిటికల్ టూరిస్ట్ లా మారారని, ఆయన ఢిల్లీని అస్సలు పట్టించుకోవడంలేదని విమర్శించారు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి. అలాంటి పార్ట్ టైమ్ సీఎం ఢిల్లీకి అవసరం లేదంటూ ధ్వజమెత్తారు.

ఆప్ ని చూసి భయపడుతోందా..?

మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీకి గట్టిపోటీదారుగా తయారైందని ఇప్పటికే స్పష్టమైంది. ఇక్కడ కాంగ్రెస్ కూడా బలంగానే ఉన్నా.. ఆమ్ ఆద్మీ వల్ల బీజేపీ చాలా చోట్ల బలహీనపడే అవకాశాలున్నాయి. రాజకీయంగా కేజ్రీవాల్ ని నిలువరించలేని స్థితికి బీజేపీ వచ్చేసింది. అందుకే ఇలా ఢిల్లీని అడ్డు పెట్టుకుని విమర్శలు గుప్పిస్తోంది. పంజాబ్ లో కాంగ్రెస్, బీజేపీకి ఊహించని షాకిచ్చిన ఆప్.. ఇప్పుడు గుజరాత్ ని కూడా ఆక్రమిస్తే బీజేపీ తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. దాని ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది. అందుకే ఇప్పుడే ఆప్ ని నిలువరించాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. రహస్య మిత్రుడు గులాం నబీ ఆజాద్ వంటి వారితో గుజరాత్ లో ఆప్ ప్రభావం శూన్యం అనే స్టేట్ మెంట్లు ఇప్పిస్తోంది. తాజాగా ఢిల్లీ వాయు కాలుష్యాన్ని అడ్డు పెట్టుకుని కేజ్రీవాల్ ని టార్గెట్ చేస్తున్నారు బీజేపీ నేతలు.

పర్యాటక సెస్ కింద ప్రజలనుంచి వసూలు చేస్తున్న సొమ్ముని కాలుష్య నియంత్రణకు ఎందుకు వాడటం లేదని ప్రశ్నిస్తున్నారు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి. ఢిల్లీలో స్మాగ్ టవర్లు నిర్మిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. పిల్లలు, పెద్దలు శ్వాస కోశ సమస్యలతో సతమతం అవుతుంటే, సీఎం కేజ్రీవాల్ మాత్రం పొలిటికల్ టూరిస్ట్ లా మారి ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని మండిపడ్డారామె. ఆమె ఆవేదనకు ప్రధాన కారణం గుజరాత్ ఎన్నికలే అని తేలిపోయింది. గుజరాత్ లో ఆప్ దెబ్బని తట్టుకోలేక ఇప్పుడిలా కేజ్రీవాల్ పాలనపై దాడులు చేయడం మొదలు పెట్టింది బీజేపీ. ఢిల్లీ వాతావరణ కాలుష్యాన్ని హైలెట్ చేస్తోంది.

First Published:  10 Nov 2022 1:42 AM GMT
Next Story