Telugu Global
National

ఇక దేనికైనా బర్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు.. అక్టోబర్ 1 నుంచి అమలు.. నోటిఫికేషన్ జారీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ (అమెండ్‌మెంట్) యాక్ట్ - 2023 బిల్లును పార్లమెంట్ పాస్ చేసింది. ఆ బిల్లును ఆగస్టు 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో చట్ట రూపం దాల్చింది.

ఇక దేనికైనా బర్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు.. అక్టోబర్ 1 నుంచి అమలు.. నోటిఫికేషన్ జారీ
X

డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, పాస్‌పోర్టుకు అప్లయ్ చేయాలన్నా, వివాహ రిజిస్ట్రేషన్ల కోసమైనా రకరకాల ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతాయి. ఏ అధికారి ఏ సర్టిఫికెట్ అడుగుతాడో అర్థం కాదు. ఇకపై ఇలాంటి గందరగోళానికి తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఈ చట్టం ప్రకారం జన్మ ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుంది. స్కూల్‌లో జాయిన్ కావడానికి, డ్రైవింగ్ లైసెన్సుల జారీకి, ఆధార్, పాస్‌పోర్ట్ అప్లయ్ చేయడానికి బర్త్ సర్టిఫికెట్‌ను సమర్పిస్తే సరిపోతుందని కేంద్రం చెప్పింది. అక్టోబర్ 1 నుంచి ఈ చట్టం అమలులోకి వస్తుందని రిజిష్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ (అమెండ్‌మెంట్) యాక్ట్ - 2023 బిల్లును పార్లమెంట్ పాస్ చేసింది. ఆ బిల్లును ఆగస్టు 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో చట్ట రూపం దాల్చింది. ఇక ఈ చట్టం అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ యాక్ట్ రూపొందించిన దగ్గరి నుంచి దానికి సవరణలు చేయలేదు. అయితే మారిన పరిస్థితులు, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఆధారంగా మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంతే కాకుండా పౌరులకు మరింత సులభంగా సేవలు అందించేందుకు గాను ఈ చట్టానికి సవరణ చేశారు.

అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చే చట్టం వల్ల భారత పౌరులు ఇకపై సులభంగా పలు ఇతర ధ్రువీకరణ పత్రాలు పొందే అవకాశం ఉన్నది. జన్మ ధ్రువీకరణనే ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని కేంద్ర స్పష్టం చేసింది. స్కూల్ అడ్మిషన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ నమోదు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల్లో చేరడానికి జన్మ ధ్రువీకరణ పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోనున్నారు. గతంలో టెన్త్ క్లాస్ సర్టిఫికెటన్‌ను పలు శాఖలు ఆమోదించేవి. కానీ ఇకపై జన్మ ధ్రువీకరణ పత్రమే అన్నింటికీ ప్రామాణికం కానున్నది.

ఈ కొత్త చట్టం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణీత డేటాబేస్‌ను మెయింటైన్ చేసే అవకాశం ఏర్పడింది. దీని ద్వారా జనన, మరణాలను కచ్చితంగా నమోదు చేసే వీలు ఉంటుంది. అంతే కాకుండా పౌరులకు పారదర్శకమైన సేవలు అందించడానికి, సామాజిక, సంక్షేమ పథకాలు సక్రమంగా చేరవేయడానికి, డిజిటల్ రిజిస్ట్రేషన్లకు ఉపయోగపడుతుందని కేంద్ర చెబుతున్నది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను 30 రోజుల్లోపే పొందే వీలు ఈ చట్టం ద్వారా కలుగుతుంది. ఒక వేళ ప్రభుత్వ సంస్థలు జాప్యం చేస్తే అప్పిలేట్ అధికారిని సంప్రదించవచ్చు.

First Published:  15 Sep 2023 3:57 AM GMT
Next Story