Telugu Global
National

రేపిస్ట్ ల విడుదలపై సుప్రీం కోర్ట్ విచారణ..

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బిల్కిస్ బానో రేప్ కేసు నిందితుల వ్యవహారం సుప్రీంకోర్ట్ కి చేరింది.

రేపిస్ట్ ల విడుదలపై సుప్రీం కోర్ట్ విచారణ..
X

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బిల్కిస్ బానో రేప్ కేసు నిందితుల వ్యవహారం సుప్రీంకోర్ట్ కి చేరింది. రేప్ కేసు నిందితులకు క్షమాభిక్ష పెట్టడం ఏంటని, వారిని ఎలా విడుదల చేస్తారంటూ సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారణ కు స్వీకరించింది. దీనిపై విచారణ చేపడుతున్నట్టు తెలిపింది. నిందితుల రిలీజ్ ను రద్దు చేయాలంటూ మ‌హిళా హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు సుభాషిణి అలీ, రేవ‌తి లౌల్‌, రూపా రేఖా వ‌ర్మ‌ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు.

రేపిస్ట్ లు తిరిగి జైలుకెళ్లడం ఖాయమేనా..?

బిల్కిస్ బానో రేప్ కేసులో యావజ్జీవ ఖైదు అనుభవిస్తున్న 11మంది నిందితులకు గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. అయితే ఇలా క్షమాభిక్ష పెట్టే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గతంలో కొన్ని కేసుల్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. రేపిస్ట్ లకు ముంబైలోని సీబీఐ న్యాయస్థానం శిక్ష విధించిందని, ఆ లెక్కన వారికి క్షమాభిక్ష పెట్టే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని అంటున్నారు. ఈ లాజిక్ కరెక్ట్ అయితే మళ్లీ రేపిస్ట్ లు కటకటాల వెనక్కు వెళ్లడం ఖాయం.

దేశవ్యాప్త నిరసనలు..

బిల్కిస్ బానో రేప్ కేసు నిందితుల క్షమాభిక్షకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. గుజరాత్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తూ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, మహిళా సంఘాల నేతలు కేంద్రానికి లేఖలు రాశారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకున్న వేళ, ఇలా రేప్ కేసు నిందితుల్ని వదిలిపెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇది దేశవ్యాప్త చర్చకు తావిచ్చింది. నిందితులకు కొంతమంది బీజేపీ నేతలు స్వాగతం పలకడం, వారు అమాయక బ్రాహ్మణులు అనడంతో మరో వివాదం మొదలైంది. ఇప్పుడీ వ్యవహారం సుప్రీంకోర్టుకి చేరింది. సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

First Published:  23 Aug 2022 6:52 AM GMT
Next Story