Telugu Global
National

బిల్కిస్ బానో కేసు: ఆ 11 మంది రేపిస్టులు మిస్సింగ్

బిల్కిస్ బానో కేసులో దోషులైన 11 మంది జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి గ్రామం నుంచి మాయమయ్యారు. ఆ 11 మంది రేపిస్టులను గుజరాత్ ప్రభుత్వ విడుదల చేయడం పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు రావడం, సుప్రీం కోర్టులో పిటిషన్ లు దాఖలవడంతో ఆ 11 మంది అజ్ఞాతంలోకి వెళ్ళారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బిల్కిస్ బానో కేసు: ఆ 11 మంది రేపిస్టులు మిస్సింగ్
X

గుజరాత్ లో బిల్కిస్ బానోను సామూహిక అత్యాచారం చేసి ఏడుగురిని హత్య చేసిన 11 మంది రేపిస్టుల ఆచూకీ తెలియడం లేదు. బిల్కిస్ బానో కేసులో యావజ్జీవ శిక్షపడ్డ వాళ్ళను ఆగస్టు 15 న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత వాళ్ళకు పలు హిందూ సంఘాలు సన్మానాలు చేయడం, వారి కుటు‍ంబాలు ఘనస్వాగతం పలికి వేడుకలు చేయడం తేలిసిందే.రంధిక్‌పూర్ గ్రామంలో వాళ్ళు చేసిన హడావుడికి దాదాపు 200 ముస్లిం కుటుంబాలు గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. అయితే ఇప్పుడు ఆ 11 మంది మిస్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళారో తెలియటం లేదు.

Advertisement

ఆ 11 మందిని విడుదల చేయడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వచ్చాయి. వాళ్ళను మళ్ళీ జైలుకు పంపాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. దీనిపై సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఒక పిటిషన్ సీపీఐఎం పార్లమెంటు సభ్యురాలు సుభాషిణీ అలీ, జర్నలిస్టు రేవతీ లౌల్, ప్రొఫెసర్ రూపా రేఖ వర్మ దాఖలు చేయగా మరో పిటిషన్ ను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వేశారు.

ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ బర్ఖా దత్ ఎడిటర్ గా ఉన్న 'మోజో స్టోరీ డాట్ కామ్' బృందం ఆ రేపిస్టుల గ్రామమైన రంధిక్‌పూర్ గ్రామం వెళ్ళింది. వాళ్ళ నివేదిక ప్రకారం ఆ 11 మంది వాళ్ళ ఇళ్ళల్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు. ఎప్పుడు తిరిగి వస్తారనే విషయాన్ని కూడా కుటుంబ సభ్యులు చెప్పలేదు. కొన్ని ఇళ్ళైతే తాళాలు వేసి ఉన్నాయి.

Advertisement

జైలు నుంచి విడుదలైన‌ దోషులు జస్వంత్ నాయ్, గోవింద్ నాయ్, శైలేష్ భట్, మితేష్ భట్, రాధేశ్యామ్ షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహానియా, బకాభాయ్ వోహానియా, రాజుభాయ్ సోనీ, ప్రదీప్ మోర్ధియా, రమేష్ చందనా లు వీరంతా గుజరాత్‌లోని దౌద్ జిల్లాలో ఉన్న రంధిక్‌పూర్ గ్రామ నివాసితులు. వారందరూ బిల్కిస్ బానోకు, ఆమె కుటుంబ సభ్యులకు బాగా తెలిసిన వాళ్ళు. కొందరు పొరుగువారు కాగా, మరికొందరు ఆమె కుటుంబంతో వ్యాపారం చేశారు.

మోజో స్టోరీ బృందం పదకొండు మంది దోషుల్లో ఏడుగురి ఇళ్లకు వెళ్లి చూడగా వారు ఇంట్లో లేరని గుర్తించారు. అన్నదమ్ములైన మిథిలేష్, శైలేష్ భట్‌ల ఇంటి తలుపుకు తాళం వేసి ఉండగా, రాధేశ్యామ్ షా కుటుంబం అతను రాజస్థాన్‌లో యాత్ర (మత తీర్థయాత్ర)లో ఉన్నాడని, అతను ఎప్పుడు తిరిగి వస్తాడో తమకు తెలియదని చెప్పారు. అదేవిధంగా అన్నదమ్ములైన మరో ఇద్దరు కేసర్‌భాయ్ వోహానియా, బకాభాయ్ వోహానియా కుటుంబం కూడా వారు వేరే ఊరు వెళ్ళారని, ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదని చెప్పారు. జస్వంత్ నాయ్, గోవింగ్ నాయ్ కుటుంబం కూడా వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో, ఎప్పుడు తిరిగి వస్తారనే విషయాన్ని చెప్పేందుకు నిరాకరించింది.

రంధిక్‌పూర్ గ్రామంలోని ఒక దుకాణదారుడు మోజో స్టోరీతో మాట్లాడుతూ, "వారు (విడుదల చేసిన ఖైదీలు) ఇక్కడ లేరు. విడుదలైనప్పటి నుండి వారు కనిపించడం లేదు.'' అని చెప్పారు. ఖైదీలలో ఒకరి ఇంటి పక్కనే దుకాణం ఉన్న మరో దుకాణదారు ఇలా అన్నాడు, "నేను నా దుకాణాన్ని ఉదయం 7 గంటలకు తెరిచి, రాత్రి 7 గంటలకు నా షట్టర్‌ని మూస్తాను. నేను అతనిని ఒక్కసారి కూడా చూడలేదు, అతను అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటాడని ఊహిస్తున్నాను అని చెప్పాడు.

కాగా దోషుల తరఫు న్యాయవాది రిషి మల్హోత్రా మాత్రం వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లారనే వార్తలను ఖండించారు, మోజో స్టోరీతో ఆయన మాట్లాడుతూ, "వారు ఖచ్చితంగా అజ్ఞాతంలో లేరు. నాతో టచ్‌లో ఉన్నారు. వాళ్ల గ్రామాల్లోనే ఉన్నారు. పారిపోయే ఉద్దేశ్యం వారికి లేదు." అని చెప్పాడు.అయితే గ్రామాన్ని విడిచి వెళ్లడానికి, ప్రయాణించడానికి దోషులకు హక్కు ఉందని న్యాయవాది మల్హోత్రా అన్నారు.

అయితే ఆ 11 మంది జైలు నుండి బైటికి వచ్చిన రోజు నుండి దేశ వ్యాప్తంగా వచ్చిన నిరసనలు, వాళ్ళను మళ్ళీ అరెస్టు చేయాలన్న డిమాండ్లు, సుప్రీం కోర్టులో పిటిషన్లతో , వాళ్ళను మళ్ళీ జైలుకు పంపుతారనే భయంతో గ్రామం నుంచి మాయమయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story