Telugu Global
National

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... 11మంది రేపిస్టులను జైలు నుంచి విడుదల చేసిన బీజేపీ సర్కార్

2002 గుజరాత్ మత దాడుల సందర్భంగా ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఏడుగురిని హత్య‌ చేసి ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్ననేరస్తులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... 11మంది రేపిస్టులను జైలు నుంచి విడుదల చేసిన బీజేపీ సర్కార్
X

గుజరాత్ లో 2002 లో జరిగిన ఓ భయంకర ఘటనకు క్లైమాక్స్ ఇది.. ఆ నాడు గోద్రా అల్లర్ల అనంతరం బిల్కిస్ బానో అనే మహిళను గ్యాంగ్ రేప్ చేసి.. ఆమె కుటుంబంలో ఏడుగురిని దారుణంగా హతమార్చిన 11 మంది నిందితులు జైలు నుంచి విడుదలయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీళ్లకు గోధ్రా సబ్ జైలు నుంచి నిన్న లభించిన వరమిది ! ఖైదీల పట్ల తన క్షమాభిక్ష పాలసీలో భాగంగా గుజరాత్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. సుమారు 20 ఏళ్ళ క్రితం జరిగిన ఘోర ఘటన నేటికీ సంచలనమే.. 2002 ఫిబ్రవరి 27 న గోద్రాలో శబర్మతి ఎక్స్ ప్రెస్ రైలుకు దుండగులు నిప్పు పెట్టగా 59 మంది కరసేవకులు సజీవ దహనమయ్యారు. దీంతో పెద్దఎత్తున అల్లర్లు జరిగాయి. ప్రతీకార దాడులు, గృహదహనాలు ముమ్మరమయ్యాయి. నాడు 5 నెలల గర్భిణీ అయిన బిల్కిస్ బానో అనే మహిళ.. తన చిన్నారిబాలికతోను, మరో 15 మందితో కలిసి ప్రాణభయంతో తన గ్రామం నుంచి పారిపోయి ఓ పొలంలో దాక్కుంది. కానీ కర్రలు, కొడవళ్లు, కత్తులతో సుమారు 20 నుంచి 30 మంది వారిని వెతుక్కుంటూ వచ్చి వారిపై దాడికి దిగారు. గర్భిణీ అని కూడా చూడకుండా బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిపారు. అంతటితో ఆగక ఆమె కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా చంపారు. వీరికి చిక్కకుండా బాధితురాలి కుటంబంలోని ఆరుగురు పరారయ్యారు.

ఈ ఘోర ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. 2004 లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తనకు ప్రాణహాని ఉందని బిల్కిస్ బానో ఆందోళన వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు ఈ కేసును అదే ఏడాది ఆగస్టులో ముంబైకోర్టుకు బదిలీ చేసింది. విచారణ సుదీర్ఘంగా సాగింది. ఈ కేసులో 11 మంది గ్యాంగ్ రేప్ కి పాల్పడి.. బాధితురాలి కుటుంబంలో ఏడుగురిని పొట్టన బెట్టుకున్నందుకు గాను దోషులని, వీరికి జీవిత ఖైదు విధించాలని 2008 జనవరి 21 న స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. సాక్ష్యాధారాలు లేవంటూ మరో ఏడుగురు నిందితులను విడిచిపెట్టింది

ఈ తీర్పు సక్రమమేనని 2018 లో బాంబేహైకోర్టు నిర్ధారించింది. బాధితురాలైన బిల్కిస్ బానోకు 50 లక్షల పరిహారం, ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని 2019 ఏప్రిల్ లో సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే నిందితులు కోర్టుల్లో న్యాయపోరాటానికి దిగారు. వీరిలో ఒకడు తాము ఇప్పటికే 15 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవించామని, తమకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సుప్రీంకోర్టుకెక్కాడు. ఇతని పిటిషన్ పై గుజరాత్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలంటూ అత్యున్నత న్యాయస్థానం కూడా ఆదేశించడంతో.. ప్రభుత్వం క్షమాభిక్ష పాలసీని పాటించింది. వీరిని జైలు నుంచి రిలీజ్ చేయాలని ఉత్తర్వులివ్వడంతో 11 మంది నిందితులూ బాహ్యప్రపంచంలోకి అడుగు పెట్టారు.

మోడీ ప్రభుత్వంపై మండిపడిన ఆర్జేడీ

ఈ కేసులో నిందితులంతా విడుదల కావడంపై ఆర్జేడీ.. నేతలు ..ప్రధాని మోడీపై ధ్వజమెత్తారు. మోడీ తన స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో.. నారీ సమ్మాన్ (మహిళల గౌరవం) గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని, కానీ కొన్ని గంటల్లోనే ఈ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు జైలు నుంచి బయటపడ్డారని ఆర్జేడీ అధికార ప్రతినిధి ఇజాజ్ అహ్మద్ అన్నారు. మీరు చెబుతున్నది ఒకటి, చేస్తున్నది మరొకటి.. ఇంతకన్నా దురదృష్టం మరొకటి లేదు అని ఆయన విమర్శించారు. మీ గుజరాత్ ప్రభుత్వం, మీ బీజేపీ.. మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పుకుంటాయని, కానీ స్వాతంత్య్ర దినోత్సవం నాడు జరిగిన ఈ నిర్వాకమేమిటని ఆయన ప్రశ్నించారు. 19 ఏళ్ళ వయస్సులో.. 5 నెలల గర్భిణీ అయిన బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరగడం, ఆమె కుటుంబంలోని ఏడుగురి హత్య.. ఈ దేశ హత్యా రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. 2002-2003 లో బిల్కిస్ బానో ఫిర్యాదును స్వీకరించడానికి స్థానిక పోలీసులు నిరాకరించడాన్ని,దాంతో ఆమె మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడాన్ని ఆయన గుర్తు చేశారు.

బిల్కిస్ బానో, గ్యాంగ్ రేప్ కేసు, గోధ్రా జైలు, విడుదల, గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష, 11 మంది నిందితులు,

bikis bano gang rape case, gujarat, godhra jail, release, 11 accused, rjd, pm modi

11 lifers convicted in bilkis bano case released in gujarat

First Published:  16 Aug 2022 6:12 AM GMT
Next Story