Telugu Global
National

నా కిడ్నీలు అమ్మేశారు.. డాక్టర్ కిడ్నీ తీసి నాకు పెట్టండి

తన పరిస్థితికి కారణమైన డాక్టర్ ని వెంటనే అరెస్ట్ చేయాలని, అతని కిడ్నీ తీసి తనకు అమర్చాలని డిమాండ్ చేస్తున్నారు సునీత. ఈ బాధ్యత ప్రభుత్వానిదేనంటున్నారామె.

నా కిడ్నీలు అమ్మేశారు.. డాక్టర్ కిడ్నీ తీసి నాకు పెట్టండి
X

తనకు తెలియకుండా, తనకు సమాచారం ఇవ్వకుండా తన రెండు కిడ్నీలు తొలగించారని, ఆ పని చేసిన డాక్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడ్ని పట్టుకుని అతని కిడ్నీ తనకు అమర్చాలని డిమాండ్ చేశారు బీహార్ కి చెందిన సునీతాదేవి అనే మహిళ. డాక్టర్ చేసిన తప్పుకి తాను జీవచ్ఛవంలా మారానని అంటున్నారామె. డాక్టర్ ని అరెస్ట్ చేసి, అతని కిడ్నీ తనకు పెట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు సునీతా దేవి.

అసలేం జరిగిందంటే..?

ముజఫర్ పూర్ ప్రాంతానికి చెందిన సునీతకు కిడ్నీ సమస్య ఉంది. ఆమె వయసు 38 సంవత్సరాలు, ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. ఆమె డయాలసిస్ పేషెంట్. అయితే ఇటీవల హిస్టెరెక్టమీ ఆపరేషన్ కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు సునీత. అక్కడ ఆమెకు రెండు కిడ్నీలు తొలగించారు. కానీ, ఆ విషయం ఆమెకు తెలియదు. ఆపరేషన్ తర్వాత ఇంటికెళ్లిన సునీత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సునీత ముజఫర్‌ పూర్‌ లోని రాష్ట్ర ప్రభుత్వ శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (SKMCH)లో చేరారు. ఆమెకు రెండు కిడ్నీలు లేవని గుర్తించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు రెఫర్ చేస్తూ పాట్నాలోని ఇందిరా గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ కు పంపించారు. అక్కడ ఆమెను పరిశీలించిన వైద్యులు.. కిడ్నీలు అందుబాటులోకి వచ్చినప్పుడు కబురు పంపిస్తామని అప్పుడు ఆమెకు ఆపరేషన్ చెస్తామని చెప్పి వెనక్కు పంపించేశారు. ప్రస్తుతం ఆమె ముజఫర్ పూర్ లోని SKMCH ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తన పరిస్థితికి కారణమైన డాక్టర్ ని వెంటనే అరెస్ట్ చేయాలని, అతని కిడ్నీ తీసి తనకు అమర్చాలని డిమాండ్ చేస్తున్నారు సునీత. ఈ బాధ్యత ప్రభుత్వానిదేనంటున్నారామె. ఈమేరకు స్థానికంగా మీడియాకు తన గోడు చెప్పుకున్నారు సునీత. డాక్టర్ కిడ్నీ కావాల్సిందేనంటున్న సునీత డిమాండ్ ప్రస్తుతం బీహార్ లో సంచలనంగా మారింది.

First Published:  17 Nov 2022 2:17 AM GMT
Next Story