Telugu Global
National

శానిటరీ న్యాప్కిన్స్ ప్రశ్నకు సమాధానం దొరికింది..

పిల్లలకు యూనిఫామ్ సహా ఇతర అనేక ఉచితాలు అందించే ప్రభుత్వాలు పేద బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్ ఉచితంగా ఇవ్వొచ్చుకదా అని అడిగిన బీహారీ ధైర్యం పేరు రియా కుమారి.

శానిటరీ న్యాప్కిన్స్ ప్రశ్నకు సమాధానం దొరికింది..
X

ఇటీవల బీహార్‌లో ఓ విద్యార్థిని శానిటరీ న్యాప్కిన్స్ ఉచితంగా ఇవ్వొచ్చు కదా అంటూ ఓ ఐఏఎస్ ఆఫీసర్‌కి వేసిన ప్రశ్న సంచలనంగా మారింది. ఆ ప్రశ్నకు సదరు మహిళా ఐఏఎస్ తలతిక్క సమాధానం చెప్పడంతో ఆమెపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధపడింది. అయితే ఆ ప్రశ్నకు వచ్చిన సమాధానమే హైలెట్ అయింది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్న అడిగిన బాలిక ధైర్యం వెలుగులోకి వచ్చింది. అసలా ప్రశ్న ఎవరడిగారు..? ఆ అమ్మాయికి ఇప్పుడు దొరికిన సమాధానం ఏంటి..?

పిల్లలకు యూనిఫామ్ సహా ఇతర అనేక ఉచితాలు అందించే ప్రభుత్వాలు పేద బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్ ఉచితంగా ఇవ్వొచ్చుకదా అని అడిగిన బీహారీ ధైర్యం పేరు రియా కుమారి. సశక్త్ బేటీ - సమృద్ధి బీహార్‌ పేరుతో జరిగిన వర్క్ షాప్‌లో రియా కుమారి ఈ ప్రశ్న వేశారు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఏడాది పాటు శానిటరీ ప్యాడ్‌లను అందించడానికి ముందుకొచ్చింది ఢిల్లీకి చెందిన పాన్‌ హెల్త్‌ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. అంతే కాదు.. ఆమె గ్రాడ్యుయేషన్‌ చదువుకు అ‍య్యే ఖర్చును కూడా తామే భరిస్తామని చెప్పారు ఆ సంస్థ సీఈవో చిరాగ్. ఈ విషయాల గురించి మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రారని, కానీ ఆమె ధైర్యం చేసి మాట్లాడిందని ప్రశంసించారు.

మేడమ్ మరోలా అర్థం చేసుకున్నారు..

ఐఏఎస్ అధికారిణి సమాధానం సరిగా లేదంటూ అందరూ విమర్శిస్తుంటే.. ఆ బాలిక మాత్రం ఐఏఎస్‌ ఆఫీసర్ హర్ జోత్‌ కౌర్‌ తన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారని చెబుతోంది. ప్రతిదానికీ ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం ఆధారితంగా ఉండాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా హర్ జోత్‌ కౌర్‌ తనకు అలా సమాధానం చెప్పి ఉండొచ్చని అంటున్నారు రియా.

కన్యా ఉత్థాన్ పథకం దాని కోసమే..

బీహార్ ఉప ముఖ్యమత్రి తేజస్వీ యాదవ్ ఈ వ్యవహారంపై మరింత వివరణ ఇచ్చారు. బీహార్‌లో అమలులో ఉన్న 'కన్యా ఉత్థాన్‌' పథకం ద్వారా ప్రతి అమ్మాయికి ఏడాదికి రూ.300లు ఆర్థిక సాయం అందుతోందని, అంటే నెలకు 25 రూపాయలు శానిటరీ న్యాప్కిన్స్ కోసమే చెల్లిస్తున్నామని చెప్పారు. బహుశా ఆ పథకంపై అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రశ్న, సమాధానం వినిపించాయని అన్నారాయన.

First Published:  1 Oct 2022 3:57 PM GMT
Next Story