Telugu Global
National

ఎంపీ డ్రైవర్ అమానుషం.. వ్యక్తిని కారు బానెట్ పై మూడు కి.మీ. లాక్కెళ్లాడు..!

ఈ ఘటన జరిగిన సమయంలో ఎంపీ చందన్ సింగ్ కారులో లేరని పోలీసులు నిర్ధారించారు. కాగా, కారు బానెట్ పై చేతన్ ను లాక్కెళుతున్న సమయంలో వెనుక నుంచి వాహనాల్లో వస్తున్న కొందరు వ్యక్తులు వీడియో తీశారు.

ఎంపీ డ్రైవర్ అమానుషం.. వ్యక్తిని కారు బానెట్ పై మూడు కి.మీ. లాక్కెళ్లాడు..!
X

ఢిల్లీలో ఓ ఎంపీ కారు డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు. ముందు వెళ్తున్న కారును పదేపదే తన కారుతో ఢీకొన్నాడు. ఎందుకు తన కారును ఢీకొడుతున్నావని సదరు వ్యక్తి ప్రశ్నించినందుకు అతడినే ఢీకొట్టబోయాడు. అత‌డు కారు బానెట్ ఎక్కగా అలాగే మూడు కిలోమీటర్ల పాటు లాక్కెళ్లాడు. చివరికి అతడిని పోలీసులు కాపాడారు.

ఆదివారం రాత్రి చేతన్ అనే వ్యక్తి తన కారులో ఆశ్రమ్ చౌక్ నుంచి నిజాముద్దీన్ దర్గాకు బయలుదేరాడు. ఆ కారు వెనకాలే బీహార్ ఎంపీ చందన్ సింగ్ కు చెందిన కారు వెళ్తోంది. ఆ కారు నడిపే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. అతడు పదేపదే ముందు వెళ్తున్న చేతన్ వాహనాన్ని ఢీ కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో చేతన్ తన కారు నుంచి దిగి వెనకాలే వస్తున్న ఎంపీ కారును ఆపాడు. ఎందుకు తన కారును పదే పదే ఢీకొడుతున్నావంటూ ప్రశ్నించాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఎంపీ డ్రైవర్ అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. చేతన్ పై కారు ఎక్కించే ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన చేతన్ ఎంపీ కారు బానెట్ పైకి ఎక్కాడు. అయినప్పటికీ ఎంపీ డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు.

ప్రాణభయంతో చేతన్ కారు ఆపాలంటూ ప్రాధేయపడినప్పటికీ అతడు పట్టించుకోలేదు. సుమారు మూడు కిలోమీటర్ల పాటు అలాగే వెళ్ళాడు. గస్తీలో ఉన్న కొందరు పోలీసులు కారు బానెట్ పై వ్యక్తి ఉండడాన్ని గమనించి ఆ కారును వెంబడించి ఆపారు. ఆ తర్వాత చేతన్ జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎంపీ కారు డ్రైవర్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటన జరిగిన సమయంలో ఎంపీ చందన్ సింగ్ కారులో లేరని పోలీసులు నిర్ధారించారు. కాగా, కారు బానెట్ పై చేతన్ ను లాక్కెళుతున్న సమయంలో వెనుక నుంచి వాహనాల్లో వస్తున్న కొందరు వ్యక్తులు వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. ఇంత జరిగినప్పటికీ సదరు ఎంపీ కారు డ్రైవర్ మాత్రం తాను ఎవరినీ కారు బానెట్ పై లాక్కెళ్ల‌లేదని బుకాయించడం గమనార్హం.

First Published:  1 May 2023 1:28 PM GMT
Next Story