Telugu Global
National

బీహార్‌లో పరువు హత్యలు : వేరే కులస్తులతో ప్రేమ.. ఇద్దరు కూతుళ్లను చంపిన తల్లిదండ్రులు

హజీపూర్ కు చెందిన నరేష్ బైతా, రింకూ దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు వేరే కులానికి చెందిన యువకులను ప్రేమించారు.

బీహార్‌లో పరువు హత్యలు : వేరే కులస్తులతో ప్రేమ.. ఇద్దరు కూతుళ్లను చంపిన తల్లిదండ్రులు
X

సమాజంలో చదువుకున్న వారి సంఖ్య ఎంతో పెరిగిందని చెప్పుకుంటున్నాం.. అభివృద్ధి పథంలో నడుస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఈ చదువు, అభివృద్ధి మనుషుల్లో ఎటువంటి మార్పు తేవడం లేదు. సమాజంలో ఇంకా కుల, మత వివక్ష కొనసాగుతూనే ఉంది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. తాజాగా బీహార్ లో జరిగిన సంఘటన కుల జాడ్యం ఇంకా సమాజంలో ఉందని నిరూపిస్తోంది. వేరే కులానికి చెందిన యువకులను ప్రేమించిన పాపానికి ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులే దారుణంగా చంపేశారు. వారి వయసు కూడా ఒకరికి 18 ఏళ్లు, మరొకరికి 16 ఏళ్లే. ఈ పరువు హత్యల సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

హజీపూర్ కు చెందిన నరేష్ బైతా, రింకూ దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు వేరే కులానికి చెందిన యువకులను ప్రేమించారు. వీరి ప్రేమ విష‌యం ఇంట్లో తెలిసింది. వాళ్ళను మరిచిపోవాలని తల్లిదండ్రులు చెప్పినా కూతుళ్లు పట్టించుకోలేదు. దీంతో శనివారం రాత్రి నిద్రపోతున్న ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులే దారుణంగా హత్య చేశారు.

ఇద్దరు అమ్మాయిలు హత్యకు గురైనట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ మృతదేహాల వద్ద తల్లి కూర్చుని ఉండగా.. తండ్రి కూతుళ్లను హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ హత్యలపై పోలీసులు రింకూ దేవిని విచారించారు. తమ కుమార్తెలు వేరే కులానికి చెందిన యువకులను ప్రేమించారని.. వద్దని చెప్పినా వారు వినలేదని రింకూ దేవి పోలీసులకు చెప్పింది. ఇంట్లో చెప్పకుండా ఇద్దరు కుమార్తెలు పదే పదే యువకులతో తిరుగుతుండటంతో నిద్రపోయే సమయంలో వారిని తండ్రి హత్య చేసినట్లు రింకూ దేవి తెలిపింది.

కాగా, ప్రాథమిక విచారణ తర్వాత బాలికలను తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి హత్య చేసినట్లు గుర్తించామని సదర్ డి.ఎస్.పి ఓం ప్రకాష్ మీడియాకు తెలిపారు. రింకూ దేవిని అదుపులోకి తీసుకొని, పరారీలో ఉన్న నరేష్ బైతా కోసం గాలింపు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. పరువు కోసం ఇద్దరు కుమార్తెలను తల్లిదండ్రులే దారుణంగా హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

First Published:  16 April 2023 11:47 AM GMT
Next Story