Telugu Global
National

బీజేపీతో తెగదెంపులు.. సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ బీజేపీకి షాక్ ఇచ్చారు. రెండు పార్టీల మధ్య కొద్ది రొజులుగా సాగుతున్న పరోక్ష యుద్దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన ఇవ్వాళ్ళ ఎన్డీఏ నుంచి బైటికి రావడమే కాక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

బీజేపీతో తెగదెంపులు.. సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా
X

బీహార్ సీఎం నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి షాకిచ్చారు. మంగళవారం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ఫగు చౌహాన్ ని కలిసి తన రాజీనామా సమర్పించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నామని, తమ జేడీ-యూకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారని ఆయన ఆ తరువాత ప్రకటించారు. తమ పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించిన ఆయన.. ఇక జాప్యం చేస్తే పార్టీకి ముప్పు తప్పదని భావించామని అన్నారు. ఇదే సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీని ప్రశంసించారు. 160 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఓ జాబితాను గవర్నర్ కి సమర్పించినట్టు ఆయన తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించవలసిందిగా ఆయన గవర్నర్ ని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. . నూతన ప్రభుత్వంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం కావచ్చునని భావిస్తున్నారు. కాంగ్రెస్.. ఆర్జేడీ తో కలిసి బీహార్ లో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

'ఎన్డీయే నుంచి వైదొలగాలని సమిష్టిగా నిర్ణయించుకున్నాం.. మా పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్థించారు' అని నితీష్ చెప్పారు. 2020 నుంచి బీజేపీతో అంటకాగిన ఫలితంగా మన పార్టీ బలహీనపడిందని జేడీ-యూ ఎమ్మెల్యేలు తన వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అటు తమ పార్టీ నేత తేజస్వి యాదవ్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆర్జేడీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమర్థించారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల శాసన సభ్యులు సైతం తమ మద్దతును నితీష్ కుమార్ కి ప్రకటించారు. ఈ పరిణామాలకు ముందే లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య.. రాష్ట్రంలో పెద్ద మార్పు జరగబోతోందని ట్వీట్ చేశారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని నితీష్ కుమార్ బహిష్కరించినప్పుడే జేడీ-యూ, బీజేపీ మైత్రి బీటలు వారిందని ఆమె పేర్కొన్నారు. ఇక నితీష్ కుమార్ తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా తాము సమర్థిస్తామని ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ నెల 7 న నితీష్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఫోన్ లో మాట్లాడినప్పుడే.. జరగబోయే పరిణామాలకు నాంది పలికినట్టయింది. పాట్నాలో తలెత్తిన సరికొత్త రాజకీయ మార్పులతో బీజేపీ సంకటంలో పడింది.


ప్రస్తుతం 240 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో బీజేపీకి చెందిన 77మంది, ఆర్జేడీ 79, జేడీ-యూ 45, కాంగ్రెస్ 19, సీపీఐ ఎంఎల్ నేతృత్వంలోని లెఫ్ట్ పార్టీలకు చెందిన 16 మంది సభ్యులు ఉన్నారు.

నితీష్ కుమార్ మూల్యం చెల్లించుకుంటారు.. బీజేపీ

నితీష్ కుమార్ తమకు ద్రోహం చేశారని, ఇందుకు ఓటర్లు ఆయనకు గుణపాఠం చెబుతారని బీహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ అన్నారు. ఎన్డీయే కింద 2020 లో మేం కలిసికట్టుగా పోటీ చేశాం.. జేడీ-యూ-బీజేపీకూటమికి కి అనుకూలంగా ప్రజలు తీర్పునిచ్చారు. మా పార్టీకి (బీజేపీకి) ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ కుమార్ ని సీఎం చేశాం..కానీ ఈ రోజు జరిగిన పరిణామాలు ఈ రాష్ట్ర ప్రజలకు, మా పార్టీకి జరిగిన ద్రోహమే అని ఆయన వ్యాఖ్యానించారు.

మాజీ సీఎం జితన్ రామ్ మంజీ ఆధ్వర్యాన గల హిందుస్థాన్ అవామీ పార్టీ కూడా నితీష్ కుమార్ కి , మహాఘట్ బంధన్ కి బేషరతుగా మద్దతు ప్రకటించడం విశేషం. 2017 లో జరిగిన పరిణామాలను మరిచిపోదామని, కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దామని నితీష్.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో వ్యాఖ్యానించడం చూస్తే తేజస్వికి కీలకమైన హోం శాఖను లేదా ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టవచ్చునన్న ఊహాగానాలు సాగుతున్నాయి.

Next Story