Telugu Global
National

ముస్లిం మంత్రిని హిందూ దేవాలయానికి తీసుకువెళ్లిన బీహార్ సీఎం... రచ్చ చేస్తున్న బీజేపీ

బీహార్ లో బీజేపీకి రచ్చచేయడానికి మరో అస్త్రం దొరికింది. ఓ హిందూ దేవాలయానికి ముస్లిం మంత్రిని తీసుకొని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెళ్ళడంపట్ల బీజేపీ రచ్చ మొదలుపెట్టింది. ఇది హిందువులను అవమానించడమే అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ముస్లిం మంత్రిని హిందూ దేవాలయానికి తీసుకువెళ్లిన బీహార్ సీఎం... రచ్చ చేస్తున్న బీజేపీ
X

బీహార్ సీఎం నితీష్ కుమార్ తన కేబినెట్ లోని ఓ ముస్లిం మంత్రిని హిందూ ఆలయానికి తీసుకువెళ్లి రాజకీయ దుమారం రేపారు. పైగా హిందువులు కానివారికి ఆ ఆలయంలో ప్రవేశం నిషిద్ధం కూడా.. గయలోని విష్ణుపాద్ గుడికి నితీష్ తన కేబినెట్ ముస్లిం మంత్రి మహమ్మద్ ఇజ్రాయెల్ మన్సూరీని వెంటబెట్టుకుని వెళ్లారు. ఈ మంత్రి ఈ ఆలయ గర్భగుడిలోనూ ప్రవేశించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గయ జిల్లాలో అతి పెద్దదైన ఈ గుడి బయటే హిందూయేతరులకు ప్రవేశం నిషిద్ధం అన్న బోర్డు రాసి ఉంటుంది. కానీ ఇది తెలిసి కూడా నితీష్ కుమార్ మంత్రి మన్సూరీతో బాటు గుడిలోకి అడుగు పెట్టారు. దీనిపై అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. నితీష్ తీరుపై బీజేపీ విరుచుకుపడింది. ముస్లిం మంత్రితో ఈ ఆలయంలోకి వచ్చిన సీఎం మన చట్టాలను అతిక్రమించారని, గుడిలోకి హిందువులు కానివారి ప్రవేశం నిషిద్ద‌మని స్పష్టంగా రాసి ఉన్నా..దాన్ని ఉల్లంఘించారని విష్ణుపాద ఆలయ కార్యదర్శి గజాధర్ లాల్ పాఠక్ ఆరోపించారు.ఇలా చేసి కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బ తీశారన్నారు. ఆయన ప్రతివారికీ క్షమాపణ చెప్పాల్సిందే.. ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమైన తరువాత మేం దీనిపై ఏ చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తాం అని ఆయన చెప్పారు.

నితీష్ కుమార్ పెద్ద అపచారం చేశారని తప్పు పట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. హరిభూషణ్ ఠాకూర్ బచౌల్.. మంత్రి మన్సూరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆలయ గర్భగుడిలోకి సీఎంతో బాటు ప్రవేశించిన తాను అదృష్టవంతుడినని మహమ్మద్ ఇజ్రాయెల్ మన్సూరీ చెప్పారు. కానీ ఇది కాకతాళీయమేనన్నారు. నితీష్ కేబినెట్లో ఈయన సమాచార, టెక్నాలజీ శాఖ మంత్రిగా ఉన్నారు. తన చర్యతో వివాదాన్ని రేపిన నితీష్ కుమార్ మాత్రం దీనిపై స్పందించలేదు.

అయితే బీహార్ లోని చంపారన్ జిల్లా కైత్వాలియా ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం.. 'విరాట్ రామాయన్ మందిర్' నిర్మాణానికి సుమారు రెండున్నర కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఓ ముస్లిం కుటుంబం లోగడ విరాళంగా ఇచ్చింది. పైగా ఈ ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించింది. బహుశా అది నితీష్ కుమార్ కి గుర్తుండి ఉండవచ్చు.




First Published:  23 Aug 2022 6:00 AM GMT
Next Story