Telugu Global
National

ప్రధాని రేసులో లేను లేనంటూనే.. స్కెచ్ వేస్తున్న నితీష్

వచ్చే ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో రాణించాలని నితీష్ ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రధాని రేసులో లేను లేనంటూనే.. స్కెచ్ వేస్తున్న నితీష్
X

ప్రధానమంత్రి పదవి రేసులో లేను లేనంటూనే జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పటి నుంచే పదవి కోసం స్కెచ్ లు వేస్తున్నారు. నిజానికి దాదాపు పదేళ్ల కిందటే ప్రధానమంత్రి పదవి అందుకునే క్రేజ్ ఉన్న వ్యక్తులుగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నిలిచారు. ఒక దశలో దేశవ్యాప్తంగా మోడీతోపాటు దాదాపు సమాన స్థాయిలో నితీష్ కు గుర్తింపు దక్కింది.

అయితే మోడీ తన రాజకీయ చతురతతో అద్వానీ వంటి నాయకులను కాదని ప్రధానమంత్రి పదవిని అధిరోహించారు. వరుసగా రెండు దఫాలపాటు ప్రధానమంత్రి అయ్యారు. అయితే అదే సమయంలో నితీష్ మాత్రం ప్రధానమంత్రి పదవి అటుంచితే సొంత రాష్ట్రంలో సొంతంగా పార్టీని అధికారంలోకి తీసుకురాలేని స్థితికి చేరుకుని బలహీనపడ్డారు. ఆర్జేడీ పొత్తుతో కొన్నేళ్లు.. మరో కొన్నేళ్లు ఎన్డీఏ పొత్తుతో సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఆర్జేడీ మద్దతుతో సీఎంగా కొనసాగుతున్నారు.

అయితే వచ్చే ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో రాణించాలని నితీష్ ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నితీష్ పలు పార్టీల అధినేతలను కలిసి ప్రత్యేక ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. దేశవ్యాప్తంగా ఉన్న అగ్రనేతలందరినీ కలుస్తున్న నితీష్ ప్రధాని రేసులో మాత్రం తాను లేను అనే చెబుతున్నారు. తాజాగా మరోసారి ఈ విషయంపై నితీష్ స్పష్టత ఇచ్చారు. విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రధానమంత్రి పదవి పోటీలో మాత్రం లేనని ప్రకటించారు.

తాజాగా ఆయన త‌న పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేస్తే విధ్వంసాన్ని కొనితెచ్చుకున్నట్లే అని వ్యాఖ్యానించారు. బీజేపీ మతపరంగా సమాజాన్ని చీల్చడం తప్ప దేశానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తన లక్ష్యమని నితీష్ ప్రకటించారు.

ఇందుకోసం విపక్షాలను ఐక్యం చేసే విధంగా ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులతో భేటీలు జరిపినట్లు తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా పర్యటించి అన్ని పార్టీల నేతలతో మాట్లాడనున్నట్లు నితీష్ కుమార్ ప్రకటించారు. ఒకవైపు అన్ని పార్టీల నాయకులను కలిసి ఒకతాటి పైకి తెచ్చేందుకు నితీష్ ప్రయత్నిస్తుండగా.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ నాయకులంతా విపక్షానికి తామే సారథ్యం వహిస్తామని పోటీపడతారో.. లేకపోతే బీజేపీని ఓడించేందుకు ఒక్కటవుతారో వేచి చూడాలి.

First Published:  15 April 2023 4:13 AM GMT
Next Story