Telugu Global
National

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా

జాతీయ స్థాయి పదవి నుంచి తనను ఒక రాష్ట్రానికే పరిమితం చేశారని మనస్తాపం చెంది అప్పుడే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తాజాగా పార్టీ నుంచే బయటకు వెళ్లిపోతున్నట్లు ఆయన వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా
X

కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీలోని అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం నాలుగు పేజీల రాజీనామా లేఖను ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. కాంగ్రెస్ పార్టీలో పలు మార్పులు చేయాలని గతంలో నిర్వహించిన మేధోమథనంలో సూచించినా.. ఇప్పటి వరకు వాటిని పట్టించుకోలేదని అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కాగా, కాంగ్రెస్‌లో మిగిలిన అతి కొద్ది మంది సీనియర్ నేతల్లో గులాం నబీ ఆజాద్ ఒకరు. జీ-23లో సభ్యుడు కూడా అయిన ఆజాద్.. ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయనను జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ బాధ్యుడిగా నియమించారు. జాతీయ స్థాయి పదవి నుంచి తనను ఒక రాష్ట్రానికే పరిమితం చేశారని మనస్తాపం చెంది అప్పుడే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తాజాగా పార్టీ నుంచే బయటకు వెళ్లిపోతున్నట్లు ఆయన వెల్లడించారు.

కశ్మీర్‌లోని భలెస్సా జిల్లా సోతి గ్రామంలో జన్మించిన ఆజాద్.. శ్రీనగర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ నుంచి జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఆజాద్.. బ్లాక్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ స్థాయి నుంచి జాతీయ రాజకీయాల వరకు ఎదిగారు. 1975లో జమ్ము కశ్మీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1980లో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నామినేట్ అయ్యారు. అదే ఏడాది లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని వాసిమ్ నుంచి తొలి సారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1984లో జరిగిన ఎన్నికల్లో కూడా లోక్‌సభ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆయన లోక్‌సభకు పోటీ చేయలేదు.

1990 నుంచి 2006 వరకు రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్ తరపున ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చారు. ఆయనకు 2008 వరకు పదవీ కాలం ఉన్నా.. 2005లో జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో.. 2006లో రాజీనామా చేశారు. 2008లో పీడీపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక 2009 నుంచి 2021 వరకు వరుసగా రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 నుంచి ఏడేళ్ల పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అయితే 2021లో ఆయన ఎంపీ పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వలేదు.

ఒకవైపు ఎంపీగా కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోవడం.. క్రమంగా పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తుండటంతో గులాం నబీ ఆజాద్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. రాజ్యసభ ప్రతిపక్ష నేతగా రిటైర్ అయ్యే సమయంలో గులాం నబీ ఆజాద్ తనకు గుజరాత్ అల్లర్ల సమయంలో ఎలా హెల్ప్ చేసింది ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి దూరమవుతూ వచ్చిన ఆజాద్‌ను ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి చేస్తారనే వార్తలు వచ్చాయి. పార్టీకి వ్యతిరేక గళం వినిపించడమే కాకుండా అప్పుడప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఆజాద్ పొగుడుతూ ఉండటం అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది.

దీంతో ఇటీవల ఆజాద్‌ను కశ్మీర్‌కే పరిమితం చేస్తూ పదవి కట్టబెట్టింది. జాతీయ స్థాయిలో పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టులో కట్టబెట్టింది. గతంలో ఉమ్మడి ఏపీ, కర్నాటక వంటి పెద్ద రాష్ట్రాలకు ఇంచార్జిగా పని చేసిన తనను పార్టీ పూర్తిగా సైడ్ చేస్తున్నదని భావించడం వల్లే ఆజాద్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. 73 ఏళ్ల ఆజాద్ ఇక రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమిస్తారా? లేదంటే వేరే పార్టీలో జాయిన్ అవుతారా అనేది తెలియాల్సి ఉన్నది.

Next Story