Telugu Global
National

రెండు భాగాలుగా విడిపోయిన రన్నింగ్ ట్రైన్.. ప్రాణభయంతో కిందకు దూకేసిన ప్రయాణికులు

రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఇంజిన్ నుంచి దాదాపు పది బోగీలు విడిపోయాయి. దీంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

రెండు భాగాలుగా విడిపోయిన రన్నింగ్ ట్రైన్.. ప్రాణభయంతో కిందకు దూకేసిన ప్రయాణికులు
X

ఒడిశా రాష్ట్రంలో ఈనెల ఆరంభంలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో సుమారు 290 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘ‌ట‌న తర్వాత కూడా దేశంలో ప‌లు చోట్ల వరుసగా రైలు ప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు గువహటి నుంచి జమ్మూకు వెళ్తున్న లోహిత్ ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా వెళ్తున్న సమయంలో రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిన్ నుంచి సుమారు 10 బోగీలు విడిపోవడంతో ప్రాణభయంతో కదులుతున్న ట్రైన్ నుంచే ప్రయాణికులు కిందకు దూకేశారు. ఈ సంఘటన కటిహార్ జిల్లాలో జరిగింది.

మంగళవారం ఉదయం లోహిత్ ఎక్స్ ప్రెస్ రైలు గువహటి నుంచి జమ్మూకు బయల్దేరింది. సాయంత్రం కటిహార్ జిల్లా దల్ఖోలా స్టేషన్ స‌మీపంలో ప్రమాదానికి గురైంది. రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఇంజిన్ నుంచి దాదాపు పది బోగీలు విడిపోయాయి. దీంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైలు నుంచి బోగీలు విడిపోయిన తర్వాత చాలామంది ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ర‌న్నింగ్ ట్రైన్ నుంచే కిందకు దూకేశారు.

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, దల్ఖోలా స్టేషన్ మాస్టర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపేశారు. ఆ తర్వాత విడిపోయిన రైలు బోగీలను మళ్ళీ ఇంజిన్‌కు అమర్చిన తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలింది. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో చాలామంది ప్రయాణికులు రైలు నుంచి కిందకు దూకేశారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

First Published:  22 Jun 2023 6:00 AM GMT
Next Story