Telugu Global
National

సీఎం ప్రసంగిస్తుండగా నిద్రపోయిన ఆఫీసర్‌పై సస్పెన్షన్ వేటు

సీఎం ఎదురుగా ప్రసంగిస్తున్న సమయంలో అలర్ట్ గా ఉండకుండా నిద్రపోతుండడంతో ఆ అధికారిపైన మీడియా ఫోకస్ పెట్టింది. అతడు నిద్రపోతున్న దృశ్యాలను వీడియో తీసింది.

Bhuj civic official suspended for sleeping at Gujarat CM Bhupendra Patels event
X

సీఎం ప్రసంగిస్తుండగా నిద్రపోయిన ఆఫీసర్‌పై సస్పెన్షన్ వేటు

ముఖ్యమంత్రి పర్యటన అంటే ఎంతో హడావుడి ఉంటుంది. ఇక అధికారుల్లో అయితే ఒక రకమైన టెన్షన్. ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా.. లేదా.. లేకపోతే తన శాఖకు సంబంధించి ఏవైనా వివరాలు అడుగుతారా.. ఏదైనా నిర్లక్ష్యం బయటపడితే చర్యలు ఏమైనా తీసుకుంటారా..? అనే ర‌క‌ర‌కాల భయాలు ఉద్యోగుల్లో ఉంటాయి. అందుకే ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారంటే ఉద్యోగుల్లో ఒక రకమైన ఆందోళన ఉంటుంది.

కానీ, ఇవేమీ పట్టని ఓ అధికారి ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలోనే హాయిగా కునుకు తీశాడు. అలా కొంతసేపు అతడు నిద్రపోవడంతో మీడియా కెమెరాలు అతడిపై ఫోకస్ పెట్టాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు టీవీల్లో పదేపదే ప్రసారమయ్యాయి. సోషల్ మీడియాలో కూడా వీడియోలు వైరల్ కావడంతో ఆ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది.

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శనివారం కచ్ జిల్లా భుజ్ లో పర్యటించారు. కచ్ జిల్లాలో 2001లో సంభవించిన భూకంపం కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు పునరావాసంలో భాగంగా 14 వేల ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి అందజేశారు. అనంత‌రం సీఎం భూపేంద్ర‌ ప్రసంగిస్తున్న సమయంలో ముందు వరుసలో కూర్చున్న భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ కునుకు తీశాడు. సీఎం ఎదురుగా ప్రసంగిస్తున్న సమయంలో అలర్ట్ గా ఉండకుండా నిద్రపోతుండడంతో ఆ అధికారిపైన మీడియా ఫోకస్ పెట్టింది. అతడు నిద్రపోతున్న దృశ్యాలను వీడియో తీసింది.

ఈ వీడియో మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ దృష్టికి వెళ్ళింది. ఆ వీడియోను పరిశీలించిన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు సీఎం ప్రసంగిస్తున్న సమయంలో సదరు ఉద్యోగి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించారు. జిగర్ పటేల్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిబద్ధతా లోపం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి కారణాల వల్ల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

First Published:  1 May 2023 6:21 AM GMT
Next Story