Telugu Global
National

క్యాష్ ఆన్ డెలివ‌రీల‌తో మోసం చేస్తున్న అంత‌ర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌

సాధారణంగా ఈ-కామర్స్ కంపెనీలు వస్తువులను అవుట్ సోర్సింగ్ కంపెనీలకు విక్రయిస్తాయి. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ డేటాను బహిర్గతం చేయకూడదని నిబంధన ఉంది.

క్యాష్ ఆన్ డెలివ‌రీల‌తో మోసం చేస్తున్న అంత‌ర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌
X

ఆన్‌లైన్‌లో వివిధ కంపెనీల నుంచి వినియోగ‌దారులు క్యాష్ ఆన్ డెలివ‌రీ ద్వారా వ‌స్తువులు కొనుగోలు చేసే విష‌యం తెలిసిందే. అయితే దీనిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటూ వినియోగ‌దారుల‌కు న‌కిలీ వ‌స్తువుల‌ను అంట‌గ‌డుతున్న ముఠా గుట్టును బెంగ‌ళూరు పోలీసులు ర‌ట్టు చేశారు. మొత్తం 21 మందితో కూడిన అంత‌ర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు.

ఈ ముఠా చేస్తున్న‌దేమిటంటే.. ఈ-కామర్స్ కంపెనీల నుంచి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ల డేటాను దొంగిలించి.. వారు ఆర్డర్ చేసిన వస్తువులకు బదులు నకిలీవి పంప‌డం.. వినియోగదారులు ఆర్డర్ చేసిన తేదీ కన్నా ముందే వారి అడ్రస్‌కు నకిలీ వస్తువులు పంపించి డబ్బులు వసూలు చేసుకోవ‌డం. అయితే, అవి నకిలీవని గ్రహించిన వినియోగదారులు.. వాటిని ఈ-కామర్స్ కంపెనీలకు రిటర్న్ చేసేవారు. ఫలితంగా ఆ కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయి.

సాధారణంగా ఈ-కామర్స్ కంపెనీలు వస్తువులను అవుట్ సోర్సింగ్ కంపెనీలకు విక్రయిస్తాయి. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ డేటాను బహిర్గతం చేయకూడదని నిబంధన ఉంది. ఆ కంపెనీల్లో పనిచేసే కొందరు సిబ్బంది.. ఈ ముఠా స‌భ్యుల‌ నుంచి డబ్బులు తీసుకుని డేటా విక్రయిస్తున్నారు. నకిలీ వస్తువులను అంటగట్టినందువల్ల తమకు 2021 జూన్ నుంచి రూ.70 లక్షల నష్టం వాటిల్లిందని ఒక కంపెనీ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ముంబై, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం 21 మంది నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారి నుంచి రూ.26.95 లక్షల నగదు, 11 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ శివప్రకాశ్ వెల్ల‌డించారు.

First Published:  30 Aug 2023 2:56 AM GMT
Next Story