Telugu Global
National

బెంగళూరులో 24/7 హోటళ్లు, రెస్టారెంట్లు ఓపెన్...!

ఇరవై నాలుగు గంటలూ హోటళ్లు తెరుచుకునే అవకాశం కల్పించాలని బెంగళూరు హోటల్స్‌ అసోసియేషన్‌ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తోంది. తాజాగా ఇదే విషయంపై అసోసియేషన్‌ సభ్యులు కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చర్చించారు. హోటల్స్‌ నిర్వాహకుల అభ్యర్థన పట్ల ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

బెంగళూరులో 24/7 హోటళ్లు, రెస్టారెంట్లు ఓపెన్...!
X

బెంగళూరులో 24/7 హోటళ్లు, రెస్టారెంట్లు ఓపెన్...!

24 గంటలు వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌కు సవరణలు చేస్తూ 24x7 వ్యాపార సంస్థల్ని నడుపుకునే అవకాశం కల్పించింది. ఇప్పుడు ఇంచుమించు ఇలాంటి వెసులుబాటుపై కర్నాటక సర్కారు కూడా కసరత్తు చేస్తోంది. ఐటీ క్యాపిటల్‌ బెంగళూరులో 24 గంటలూ హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకునే అవకాశం కల్పించనుంది.

ఇరవై నాలుగు గంటలూ హోటళ్లు తెరుచుకునే అవకాశం కల్పించాలని బెంగళూరు హోటల్స్‌ అసోసియేషన్‌ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తోంది. తాజాగా ఇదే విషయంపై అసోసియేషన్‌ సభ్యులు కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చర్చించారు. హోటల్స్‌ నిర్వాహకుల అభ్యర్థన పట్ల ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తమ డిమాండ్‌ పట్ల సానుకూలంగా ఉందని, వీలైనంత త్వరలోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశముందని అసోసియేషన్‌ ప్రతినిధులు ప్రకటించారు.

ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరు సిటీలో నైట్‌ షిఫ్ట్‌ల్లో పనిచేసే ఉద్యోగులు, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు రాత్రి సమయాల్లో ఎక్కువ పనిచేస్తుంటారు. అలాంటివారికి అవసరమైన ఆహారాన్ని అందించేందుకు రాత్రిపూట హోటళ్లు, రెస్టారెంట్లు అందుబాటులో ఉండాల్సిన అవసరముందనేది అసోయేషన్‌ సభ్యుల వాదన. ప్రస్తుతం బెంగళూరులో 24 వేలకుపైగా చిన్న, పెద్ద హోటళ్లు ఉన్నాయి. వాటిలో దాదాపు మూడు వేల హోటళ్లు 24x7 పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం రాత్రి వేళ‌ కూడా హోటళ్లు నడుపుకునే అవకాశం ఇవ్వడం వల్ల బెంగళూరు ఇమేజ్‌ కూడా పెరుగుతుందని అసోసియేషన్‌ సభ్యులు అంటున్నారు. మరోవైపు హోటల్‌ రంగాన్ని పారిశ్రామిక రంగంగా గుర్తించాలని అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. లైసెన్సుల ప్రక్రియను సరళతరం చేయాలని డీకే శివ కుమార్‌ను కోరారు.

First Published:  10 July 2023 7:22 AM GMT
Next Story