Telugu Global
National

అసెంబ్లీ సమావేశాలకోసం 144 సెక్షన్..

ఈ ఏడాది కర్నాటక అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచే బెలగావిలో మొదలయ్యాయి. ఈ సమావేశాలకు ముందే సరిహద్దు వివాదం మరోసారి భగ్గుమంది. దీంతో బెలగావిలో 144 సెక్షన్ విధించారు.

అసెంబ్లీ సమావేశాలకోసం 144 సెక్షన్..
X

కర్నాటక రాష్ట్రానికి బెంగళూరులో శాసన సభ ఉన్నా కూడా.. శీతాకాల సమావేశాలు మాత్రం బెలగావిలోని సువర్ణ విధాన సౌధలో జరుగుతాయి. ఇది పాత సంప్రదాయమేమీ కాదు, 2012లో ఇక్కడ నూతన అసెంబ్లీ ఏర్పాటు చేశారు. మహారాష్ట్రతో ఉన్న సరిహద్దు వివాదాన్ని అలా కర్నాటక రెచ్చగొట్టింది. అయితే ఆ తర్వాత ప్రతి ఏడాదీ ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజున మహారాష్ట్ర ఏకీకరణ సమితి(ఎంఈఎస్) నిరసన తెలియజేస్తోంది. ఈ ఏడాది సమావేశాలు ఈరోజు నుంచే బెలగావిలో మొదలయ్యాయి. 10రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయి. అయితే ఈ సమావేశాలకు ముందే సరిహద్దు వివాదం మరోసారి భగ్గుమంది. దీంతో బెలగావిలో 144 సెక్షన్ విధించారు.

బెలగావి మాది.. షోలాపూర్ మాది..

మహారాష్ట్ర, బెలగావి మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం నలుగుతూనే ఉంది. 1956లో రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటినుంచి ఆ రెండు ప్రాంతాల మధ్య గొడవలు మొదలయ్యాయి. కర్నాటకలో ఉన్న బెలగావి మాదేనంటుంది మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉన్న షోలాపూర్ తమదేనంటుంది కర్నాటక. తాజాగా కర్నాటక సీఎం బొమ్మై చేసిన వ్యాఖ్యలతో మరోసారి మంట మొదలైంది. మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో జాత్ తహశీల్ కి చెందిన కొన్ని గ్రామాలు కర్నాటకలో విలీనం అయ్యేందుకు తీర్మానం చేశాయని బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. దీనికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కౌంటర్ ఇచ్చారు. తమ రాష్ట్రంలోని ఏ గ్రామం కూడా కర్నాటకలో కలిసేందుకు సుముఖంగా లేదని చెప్పారు. కర్నాటకలో ఉన్న మరాఠీ మాట్లాడే గ్రామాలను తాము కలిపేసుకుంటామన్నారు. దీంతో మరోసారి వివాదం చెలరేగింది. రెండు రాష్ట్రాల మధ్య కొన్నిరోజులపాటు రాకపోకలు స్తంభించాయి. సరిహద్దుల్లో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి.

గొడవలు ముదరడంతో ఇప్పుడు బెలగావిలో 144 సెక్షన్ అమలు చేయాల్సి వచ్చింది. దాదాపుగా 5వేల మంది పోలీసులను కర్నాటక ప్రభుత్వం మోహరించింది. ఆరుగురు ఎస్పీలు, 11 మంది ఏఎస్పీలు, 43 మంది డీఎస్పీలు, 95 మంది సీఐలు, 241 మంది ఎస్ఐలు అక్కడ విధుల్లో ఉన్నారు. శివసేన ఎమ్మెల్యేలను బెలగావిలోకి అనుమతించడం లేదు. అసలీ సమస్య అంతా బీజేపీతోనేనని శివసేన, ఎన్సీపీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

First Published:  19 Dec 2022 2:56 PM GMT
Next Story