Telugu Global
National

ప్రధానమంత్రి వంటి బాధ్యతాయుత పదవుల్లో ఉండి ఆత్మహత్యల గురించి ఇంత చౌకబారు జోక్సా?

ప్రధానమంత్రి చేసిన ఈ జోక్ ఆత్మహత్యలు చేసుకునే వారిపట్ల, వారి కుటుంబాల పట్ల‌ చుకలకన భావం, చౌకబారు హాస్యంతో కూడుకున్నదనే విమర్శలు వస్తున్నాయి. మోడీ ఈ మాటలు మాట్లాడినప్పుడు ఆసమ్మిట్ లో పాల్గొన్న పలువురు ఆగ్రహం వ్యక్తం చేయగా, అర్నబ్ గోస్వామి వంటి మరికొందరు మాత్రం ప్రధాని వేసిన జోక్ కు నవ్వులు చిందించారు.

ప్రధానమంత్రి వంటి బాధ్యతాయుత పదవుల్లో ఉండి ఆత్మహత్యల గురించి ఇంత చౌకబారు జోక్సా?
X

ఏప్రిల్ 26, బుధవారం, న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ టీవీ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ఒక చీప్ జోక్ వినిపి‍ంచారు. రిపబ్లిక్ టీవీ ఛీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి హిందీ గతంలో కన్నా చాలా మెరుగుపడిందని చెప్పడానికి మోడీ వినిపించిన జోక్ ఏంటంటే... ''ఒక ప్రొఫెసర్ కూతురు తన జీవితంపై నిరాశతో ఆత్మహత్య చేసుకుంటుంది. దానికి ముందు సూసైడ్ లేఖను రాసి తన మంచం దగ్గర పెడుతుంది. అందులో...తాను గుజరాత్ అహ్మదాబాద్‌లోని కంకారియా అనే సరస్సులో దూకి చనిపోతున్నట్టు పేర్కొంటుంది. మరుసటి రోజు ప్రొఫెసర్ కూతురు ఆత్మహత్య లెటర్ ను చూసి తాను చాలా కాలంగా ప్రొఫెసర్‌గా ఉండి ఎంతో మందికి చదువునేర్పించాను. అయితే నా కూతురు మాత్ర‍ం కంకారియా అనే పదాన్ని తప్పుగారాసింది.'' అని బాధపడతాడట.

ప్రధానమంత్రి చేసిన ఈ జోక్ ఆత్మహత్యలు చేసుకునే వారిపట్ల, వారి కుటుంబాల పట్ల‌ చుకలకన భావం, చౌకబారు హాస్యంతో కూడుకున్నదనే విమర్శలు వస్తున్నాయి. మోడీ ఈ మాటలు మాట్లాడినప్పుడు ఆసమ్మిట్ లో పాల్గొన్న పలువురు ఆగ్రహం వ్యక్తం చేయగా, అర్నబ్ గోస్వామి వంటి మరికొందరు మాత్రం ప్రధాని వేసిన జోక్ కు నవ్వులు చిందించారు.

రోజు రోజుకు దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యల పట్ల ఆందోళన చెందాల్సిన, అవి జరక్కుండా చూడాల్సిన వారే వాటిపై జోక్స్ వేసుకోవడాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ?

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం, 2017 నుండి 2021 మధ్య, దేశంలో ఆత్మహత్యల రేటు క్రమంగా పెరుగుతోంది. 2017లో ఈ సంఖ్య 1,29,887గా ఉండగా, 2021లో 12% పెరిగి 1,64,033కి చేరుకుంది. 2021లో, పరీక్షల్లో ఫెయిల్ అయిన‌ కారణంగా 18 ఏళ్లలోపు వయస్సు గల 864 మంది ఆత్మహత్యలు చేసుకొని మరణించారు. 2022లో కనీసం 25 మంది ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారిలో ఎక్కువ మంది కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటిలలో (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) జరిగినవేనని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏప్రిల్ 3, 2023న లోక్‌సభకు తెలియజేశారు.

దేశంలో చదువుల ఒత్తిడితో చనిపోతున్న విద్యార్థుల‌ శాతం ప్రతి ఏడూ పెరుగుతూ వస్తున్నది. కార్పోరేట్ స్కూళ్ళు, కాలేజీలు అనబడే జైళ్ళలో చిన్నారుల‌ ఆత్మహత్యలు ప్రతి రోజూ మనం చూస్తూనే ఉన్నాం. అయితే విద్యార్థుల్లో మనోధైర్యం కల్పించే పేరిట 'పరీక్షా పే చర్చ పేరిట' కార్యక్రమం నిర్వహించే ప్రధాని ఓ విద్యార్థి ఆత్మహత్యపై జోక్స్ వేయడం బాధ్యతతో కూడుకున్నదేనా ? ఇలాంటి చౌకబారు జోకులు ఆయన 'పరీక్షా పే చర్చ' అనే కార్యక్రమాన్ని చుకలకన చేయడంలేదా ?

సామాజిక ఒత్తిడి, వయస్సు, కులం, వర్గం, లింగం వంటి వ్యవస్థాగత అడ్డంకులు, పరీక్ష స్కోర్ లే విద్యార్థి విలువను నిర్ణయించే సమాజంలో వారి ఆత్మహత్యలకు బాధ్యతవహించాల్సిన‌ వారు ఆత్మహత్య చేసుకున్నవారిని అపహాస్యం చేయడాన్ని సమర్దిద్దామా ?

అర్నాబ్ గోస్వామి హిందీ నిజంగానే మెరుగుపడి ఉండవచ్చు, కానీ దాన్ని చెప్పడానికి ఒక యువతి సూసైడ్ నోట్‌లోని స్పెల్లింగ్ మిస్టేక్ ను ఎగతాళి చేయడాన్ని ఎలా అర్దం చేసుకోవాలి?


కాగా, నరేంద్ర మోడీ ఆత్మహత్యల గురించి చేసిన హాస్యంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.

ఆత్మహత్యల కారణంగా వేలాది కుటుంబాలు తమ పిల్లలను కోల్పోతున్నాయని, వారిని ప్రధాని ఎగతాళి చేయవద్దని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో అన్నారు.

భారత్‌లో అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకోవడం విషాదమని, జోక్ కాదని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు.

“యువతలో డిప్రెషన్, ఆత్మహత్యలు నవ్వించే విషయం కాదు. NCRB డేటా ప్రకారం, 2021లో 1,64,033 మంది భారతీయులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో అత్యధిక శాతం మంది 30 ఏళ్లలోపు వారే. ఇది జోక్ కాదు విషాదం.

రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ మనోజ్ కుమార్ ఝా ట్వీట్ లో..

‘ఆత్మహత్య’ వంటి సున్నితమైన అంశంపై దేశ ప్రధాని జోక్ చేయడం మానసిక దౌర్బల్యం. కానీ ఆ జోక్ కు నవ్వడం , చప్పట్లు కొట్టడం మరింత భయంకరం. మన సమాజం జబ్బుపడింది.'' అన్నారు.

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది 2021 ఎన్‌సిఆర్‌బి డేటాను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఇది ఆత్మహత్యల భారతం అని వ్యాఖ్యానించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో, “ఆత్మహత్యల‌పై జోక్ లు వేస్తున్న‌ మన ప్రధానమంత్రి మానవ జీవితాన్ని ఎలా చూస్తారో ఊహించండి!?!?” అని కామెంట్ చేసింది.

Next Story