Telugu Global
National

బీసీసీఐ ఎన్నికలకు మోగిన నగారా

బీసీసీఐలోని అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పోస్టులకు ఎన్నికలు జరుగుతాయి. దీంతో పాటు అపెక్స్ కౌన్సిల్‌కు ఓ ఎగ్జిక్యూటీవ్ సభ్యుడిని, గవర్నింగ్ కౌన్సిల్‌కు ఇద్దరు సభ్యులను ఎన్నుకుంటారు.

బీసీసీఐ ఎన్నికలకు మోగిన నగారా
X

ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ ఎన్నికలకు నగారా మోగింది. బీసీసీఐలో పదవులకు సంబంధించిన కీలకమైన కేసు గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నది. ఇటీవలే సుప్రీంకోర్టు బోర్డు రాజ్యాంగంలో సవరణకు అంగీకరించడంతో ఎన్నికలకు మార్గం సుగమమం అయ్యింది. అక్టోబర్ 18 బోర్డులోని కీలక పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎలక్షన్ కమిషన్ మాజీ కమిషనర్ ఏకే జోటి ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఎన్నికలు జరిగిన రోజే బోర్డు సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించనున్నారు.

బీసీసీఐలోని అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పోస్టులకు ఎన్నికలు జరుగుతాయి. దీంతో పాటు అపెక్స్ కౌన్సిల్‌కు ఓ ఎగ్జిక్యూటీవ్ సభ్యుడిని, గవర్నింగ్ కౌన్సిల్‌కు ఇద్దరు సభ్యులను ఎన్నుకుంటారు. అక్టోబర్ 11, 12న నామినేషన్లు స్వీకరించి.. 18న జరిగే ఏజీఎంలో కొత్త పాలకులను ఎన్నుకోనున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఇప్పటికే బీసీసీఐ అనుబంధ రాష్ట్ర అసోసియేషన్లకు సమాచారం పంపించారు. ఎన్నికల్లో అసోసియేషన్ తరపున ఎవరు ఓటు వేస్తారో, ఎవరు ఎన్నికల్లో నిలబడతారో ముందుగానే తెలియజేయాలని బోర్డు కోరింది.

ఇక బీసీసీఐ, అనుబంధ రాష్ట్ర అసోసియేషన్లలో వరుసగా రెండు టర్మ్స్ (ఆరేళ్లు) పని చేసిన తర్వాత కూలింగ్ ఆఫ్ పిరియడ్ ఉంటుందని బోర్డు రాజ్యాంగంలో పొందు పరిచారు. ఈ నేపథ్యంలో బెంగాల్, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్లలో ఐదేళ్లు పని చేసిన సౌరవ్ గంగూలీ, జై షాలు బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శ పదవుల్లో తిరగి కొనసాగడానికి వీలు లేకుండా పోయింది. దీంతో కేవలం బీసీసీఐలో పరిపాలించిన సమయాన్నే పరిగణలోకి తీసుకోవాలని బోర్డు సుప్రీంకోర్టులో కేసు వేసింది. అప్పటి నుంచి గంగూలీ గౌరవ అధ్యక్షుడిగా, జై షా గౌరవ కార్యదర్శిగా మాత్రమే కొనసాగుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు దీనిపై కీలక ఆదేశాలు ఇవ్వడంతో బీసీసీఐ ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు.

గంగూలీ, జై షా తిరిగి అవే పదవులకు పోటీ చేస్తారా? లేదంటే ఇద్దరిలో ఒకరు ఐసీసీకి వెళ్తారనే విషయంపై సందిగ్దత నెలకొన్నది. సౌరవ్ గంగూలీ ఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావిస్తుండగా.. అదే జరిగితే జై షా బీసీసీఐ అధ్యక్ష బరిలో దిగడం ఖాయమే. అయితే ఏ విషయం తెలియాలంటే అక్టోబర్ 18 వరకు ఆగాల్సిందే.

First Published:  27 Sep 2022 2:56 AM GMT
Next Story