Telugu Global
National

అయినా సరే.. అదానీ గోడ కిందే నిలుచుంటాం అంటున్న బ్యాంక్ ఆఫ్ బరోడా

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన బ్యాంకు చీఫ్ సంజీవ్ చద్దా స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్ల ఒడిదుడుకుల్ని తాము పట్టించుకోబోమని చెప్పారు. పూచికత్తు పత్రాలు సరిగా ఉంటే మునుముందు కూడా అదానీ గ్రూప్ కు రుణాలు అందిస్తామన్నారు.

అయినా సరే.. అదానీ గోడ కిందే నిలుచుంటాం అంటున్న బ్యాంక్ ఆఫ్ బరోడా
X

ఒక సినిమాలో హాస్య నటుడు అలీ తాను బలశాలిని అని నమ్మించేందుకు బెలూన్లలో గాలి నింపుకొని, వాటిని శ‌రీరానికి చుట్టి చొక్కా వేసుకొని బిల్డప్ ఇస్తూ ఉంటాడు. హీరో ఒక్క గుండు సూదితో అలీ గాలి మొత్తం తీసేస్తాడు. ఇప్పుడు అదానీ పరిస్థితి కూడా దాదాపు అదే. ప్రభుత్వ పెద్దల అండతో గత కొన్నేళ్లుగా పేట్రేగిపోయిన అదానీ గాలి బెలూన్ ను హిండెన్ బర్గ్ నివేదిక గుండు సూదితో పొడిచేసింది.

అదానీ కంపెనీలకు రుణాలు ఇచ్చిన స్టేట్ బ్యాంక్ తో సహా అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు కుదేలైపోయాయి. ఎల్ఐసి లాంటి సంస్థ కూడా భారీ నష్టాలను చూసింది. అదానీ షేర్లు చెత్తతో సమానమని అనేకమంది భావిస్తూ ఉంటే మన దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు మాత్రం ఇంకా క‌నువిప్పు క‌లిగిన‌ట్టు కనిపించడం లేదు.

అదానీ సంస్థకు రుణాల అందజేత కార్యక్రమం కొనసాగుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చారు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన బ్యాంకు చీఫ్ సంజీవ్ చద్దా స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్ల ఒడిదుడుకుల్ని తాము పట్టించుకోబోమని చెప్పారు. పూచికత్తు పత్రాలు సరిగా ఉంటే మునుముందు కూడా అదానీ గ్రూప్ కు రుణాలు అందిస్తామన్నారు. ముంబైలో అతి పెద్ద మురికివాడైన ధారావి అభివృద్ధి ప్రాజెక్టును అదానీ గ్రూప్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు విలువ ఐదు వేల కోట్లు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రుణాలను అదానీకి ఇచ్చేందుకు తమ బ్యాంకు పరిశీలన చేస్తుందని కూడా చద్దా వివరించారు.

ఒకవైపు అదానీ గ్రూప్ పతనం కొనసాగుతూ ఉండగానే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ సంస్థకు మరిన్ని రుణాలు ఇస్తామని చెప్పడం చర్చనీయాంశమైంది. అటు సోమవారం నాటికి అదానీ సంపద విలువ 50 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 49.1 బిలియన్ డాలర్లుగా అదానీ సంపద విలువ ఉంది. నెల క్రితం అదానీ సంపద 120 బిలియన్ డాలర్లు. నెల క్రితం ప్రపంచ ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అదానీ ప్రస్తుతం 25 స్థానానికి పడిపోయారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ 83.6 బిలియన్ డాలర్లుగా ఉంది.

First Published:  20 Feb 2023 11:37 AM GMT
Next Story