Telugu Global
National

తెలంగాణకు వెళ్ళిపోతామన్న బెంగుళూరు ఐటీ కంపెనీలు...అక్కసు వెళ్ళగక్కిన‌ బీజేపీ నేత‌

బెంగుళూరులో వర్షం పడ్డప్పుడల్లా తలెత్తుతున్న‌ వరద పరిస్థితులను ప్రభుత్వం అరికట్టలేక పోతే తాము తెలంగాణ వెళ్ళిపోతామని ఐటీ కంపెనీలు చెప్తున్నాయి. దీనిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణకు వెళ్ళిపోతామన్న బెంగుళూరు ఐటీ కంపెనీలు...అక్కసు వెళ్ళగక్కిన‌ బీజేపీ నేత‌
X

బెంగుళూరు లో ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, నగరాన్ని ముంచెతుతున్న వరదల వల్ల జన జీవనం అస్తవ్యస్తమైపోయింది. అనేక కాలనీలు, బస్తీలు నీట మునిగిపోయాయి. అనేక కంపెనీల్లోకి వరద నీరు చేరింది. ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహించలేని దుస్థితిలోకి నెట్టబడ్డాయి. ఈ నేపథ్యంలో అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్ షిఫ్ట్ అవుదామనే ఆలోచనలో ఉన్నాయి.

ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్,వ్యవస్థాపకుడు టివి మోహన్‌దాస్ పాయ్ సోషల్ మీడియాలో పది రోజులుగా 'సేవ్ బెంగళూరు' అనే క్యాంపెయిన్ నడుపున్నారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేఖ రాశారు.ఈ వరద పరిస్థితులను ప్రభుత్వం అరికట్టలేక పోతే తాము తెలంగాణ వెళ్ళిపోతామని ఐటీ కంపెనీలు చెప్తున్నాయి.

ఐటి కంపెనీల దోరణి పట్ల కర్నాటక ప్రభుత్వం, బీజేపీ నాయకులు మంట మీదున్నారు. ఐటీ కంపెనీలు బెంగుళూరును అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలు రాకుండా అరికట్టడం ఎలా అని ఆలోచించే బదులు ఐటి కంపెనీలపై ఒంటికాలిపై లేస్తున్నారు. అసలీ వరదలకు మీరే కారణమంటూ వాళ్ళ‌ మీదే తిరిగి ఆరోపణలకు దిగారు.

బెంగళూరు సౌత్ బిజెపి అధ్యక్షుడు రమేష్ ఈ మేరకు ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణ వెళ్తే అక్కడ ఒక్క రోజు కూడా ఉండలేరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం నక్సల్స్ పీడిత రాష్ట్రంగా పేరొందిందని, కంపెనీలు, ఉద్యోగులు ఒక్కరోజు కూడా అక్కడ బతకలేరని రమేష్ అన్నారు. పైగా భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదలు, సంక్షోభ పరిస్థితులకు ఐటీ కంపెనీలే కారణమని ఆయన ఆరోపించారు.

మోహన్‌దాస్ పాయ్ 'సేవ్ బెంగళూరు' ప్రచారాన్ని కూడా రమేష్ బహిరంగ లేఖలో తప్పుబట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాయడం, వరదల పరిస్థితిపై ప్రచారం నిర్వహించడం ద్వారా సంక్షోభ సమయంలో బెంగళూరు ప్రతిష్టను దిగజార్చేందుకు మోహన్ దాస్ పాయ్ ప్రయత్నం చేస్తున్నారని రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం రోడ్ల తవ్వకాలకు రుసుం వసూలు చేయలేదని, అప్పట్లో ఉచిత సేవలు అందించేందుకు రూ.3 వేల కోట్లు వెచ్చించింది. ఈ విషయాన్ని మోహన్ దాస్ పాయ్ మరిచిపోయినట్లున్నారు రమేష్ వివరించారు.

" 1999,2004 సంవత్సరాలలో, IT మరియు BT కంపెనీల ప్రయోజనాల కోసం, 4,500 కిలోమీటర్ల రోడ్లలో OFC డక్ట్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం పన్ను వసూలు చేయలేదు" అని ఆయన అన్నారు.

''బెంగళూరు వరదలకు ఐటీ, బీటీ కంపెనీలు కూడా కారణమని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. ప్రధాని మోడీకి లేఖ రాయడం ద్వారా ఐటీ కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరంపై బ్లాక్ మార్క్ వేయడానికి ప్రయత్నిస్తున్నాయి.బెంగుళూరు దేశంలోనే శాస్త్రీయంగా నిర్మించిన ఏకైక నగరం," అని ఆయన అన్నారు.

''ఔటర్‌ రింగ్‌ రోడ్‌ కంపెనీల సంఘం పరిధిలోని 79 టెక్‌ పార్కులు, ఎలక్ట్రానిక్‌ సిటీ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ పరిధిలోని 250కి పైగా ఐటీ, బీటీ కంపెనీలు, మహదేవపురలోని 100కు పైగా టెక్‌ కంపెనీలు నిర్మాణ సమయంలోనే మురుగునీటి కాలువలను ఆక్రమించుకున్నాయి. టెక్ మహీంద్రా, టాటా పవర్, బాష్, IBM, TCS, HP, ఎలక్ట్రానిక్స్ సిటీలోని అన్ని ఇతర కంపెనీలు వరద‌ నీటి కాలువలను పూర్తిగా ఆక్రమించాయి, వాటిని కుదించాయి, "అని ఆయన అన్నారు.

''ఈ వాస్తవాలన్నీ మీకు బాగా తెలుసు, బీబీఎంపీకి పన్ను ఎగవేసేందుకే మీరిలా నగర ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కంపెనీలు దాదాపు రూ.400 కోట్ల వరకు ఆస్తిపన్ను చెల్లించాలి.బీబీఎంపీ, బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ వంటి ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని సౌకర్యాలు పొందిన తర్వాత ఐటీ కంపెనీలు రూ.400 కోట్ల పన్ను ఎగవేశాయి.'' అని ఆయన ఆరోపించారు.

ఐటీ, బీటీ కంపెనీలు తమ ఆక్రమణలను తొలగిస్తే బెంగళూరు వరద సంక్షోభానికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.మీరు ప్రభుత్వాన్ని బెదిరించవద్దు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడవద్దు అని బీజేపీ నేత రమేష్ ఐటీ కంపెనీలను హెచ్చరించారు.

మొత్తానికి బెంగుళూరు వదిలి హైదరాబాద్ వెళ్ళిపోతామన్న ఐటీ కంపెనీల ఆలోచన బీజేపీ కి బాగానే కాకరేపుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎంత గొప్ప పరిపాలన అందిస్తున్నాయో డబ్బాలు కొట్టే బీజేపీ నాయకులకు, తమ శతృపక్షం పాలిస్తున్న తెలంగాణకు వెళ్ళిపోదామని ఐటీ కంపెనీలు చేస్తున్న ఆలోచన మింగుడుపడట‍ం లేదు.

First Published:  9 Sep 2022 4:54 AM GMT
Next Story